అధిక డివిడెండ్‌ కావాలంటే...

పెట్టుబడిపై అధిక డివిడెండ్‌ ఆశించే వారిని లక్ష్యంగా చేసుకొని, ఎస్‌బీఐ మ్యూచువల్‌ ఫండ్‌ కొత్తగా ఒక డివిడెండ్‌ ఈల్డ్‌ ఫండ్‌ను తీసుకొచ్చింది.

Updated : 24 Feb 2023 03:03 IST

ఎస్‌బీఐ మ్యూచువల్‌ ఫండ్‌ డివిడెండ్‌ ఈల్డ్‌ ఫండ్‌

పెట్టుబడిపై అధిక డివిడెండ్‌ ఆశించే వారిని లక్ష్యంగా చేసుకొని, ఎస్‌బీఐ మ్యూచువల్‌ ఫండ్‌ కొత్తగా ఒక డివిడెండ్‌ ఈల్డ్‌ ఫండ్‌ను తీసుకొచ్చింది. ‘ఎస్‌బీఐ డివిడెండ్‌ ఈల్డ్‌ ఫండ్‌’ అనే ఈ పథకం న్యూ ఫండ్‌ ఆఫర్‌ (ఎన్‌ఎఫ్‌ఓ) ముగింపు తేదీ వచ్చే నెల 6. ఎన్‌ఎఫ్‌ఓలో కనీసం రూ.5,000 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఇది ఓపెన్‌ ఎండెడ్‌ పథకం. మూలధన లాభాలు ఆర్జించటంతో పాటు మదుపరులకు అధిక డివిడెండ్‌ లభించే రీతిలో ఈ పథకం పెట్టుబడుల పోర్ట్‌ఫోలియోను నిర్మిస్తారు. కనీసం 65 శాతం పెట్టుబడులను అధిక డివిడెండ్లు చెల్లించే కంపెనీలకు కేటాయిస్తారు. ఈ పథకానికి రోహిత్‌ షింపి ఫండ్‌ మేనేజర్‌గా వ్యవహరిస్తారు. ‘నిఫ్టీ 500 టీఆర్‌ఐ’ పనితీరును దీనికి ప్రామాణికంగా తీసుకుంటారు. దీర్ఘకాలిక మదుపరులకు ఈ పథకం ఆకర్షణీయంగా ఉంటుందని చెప్పొచ్చు. అధిక డివిడెండ్‌ లభించడంతో పాటు రిస్కు పరిమితంగా ఉంటుంది. కాకపోతే పెట్టుబడుల్లో అత్యంత ఆకర్షణీయమైన వృద్ధి స్వల్పకాలంలో కనిపించకపోవచ్చు.


బహుళ జాతి సంస్థల్లో...
హెచ్‌డీఎఫ్‌సీ ఎంఎన్‌సీ ఫండ్‌

హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్‌ ఫండ్‌ బహుళ జాతి కంపెనీల్లో పెట్టుబడి పెట్టే నూతన మ్యూచువల్‌ ఫండ్‌ పథకాన్ని ప్రకటించింది. ‘హెచ్‌డీఎఫ్‌సీ ఎంఎన్‌సీ ఫండ్‌’ అనే ఈ పథకం ఎన్‌ఎఫ్‌ఓ (న్యూ ఫండ్‌ ఆఫర్‌) వచ్చే నెల 3తో ముగస్తుంది. కనీస పెట్టుబడి రూ.100. ఇది సెక్టోరియల్‌/ థీమ్యాటిక్‌ విభాగానికి చెందిన పథకం. ఈ పథకానికి రాహుల్‌ బైజాల్‌ ఫండ్‌ మేనేజర్‌గా వ్యవహరిస్తారు. ప్రధానంగా నిఫ్టీ ఎంఎన్‌సీ ఇండెక్స్‌లో ఉన్న కంపెనీలతో ఈ పథకం పోర్ట్‌ఫోలియోను నిర్మిస్తారు. దాదాపు 80 శాతం కంపెనీలు విదేశీ యాజమాన్య కంపెనీలు అయి ఉంటాయి. ముఖ్యంగా ఎఫ్‌ఎంసీజీ, కేపిటల్‌ గూడ్స్‌, ఆటోమొబైల్‌, ఇంజినీరింగ్‌, ఆటోమోటివ్‌ విడిభాగాలకు చెందిన కంపెనీలు ఇందులో ఉంటాయి. ఇవి ప్రముఖ బ్రాండ్లూ అయి ఉంటాయి. నెస్లే, కోల్గేట్‌్, బాటా, హిందుస్థాన్‌ యూనిలీవర్స్‌, కమిన్స్‌, ఏబీబీ... తదితర కంపెనీలను దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. గత పదేళ్ల కాలంలో నిఫ్టీ 500 సూచీ కంటే నిఫ్టీ ఎంఎన్‌సీ సూచీ అధిక ప్రతిఫలాన్ని ఆర్జించింది. మూడు నుంచి అయిదేళ్ల కాలానికి చూస్తే రెండంకెల స్థాయిలో ప్రతిఫలం కనిపిస్తుంది. కాకపోతే అనుకున్నంత ప్రతిఫలం ఇటువంటి కంపెనీలపై పెట్టుబడితో కనిపించదు. ఎందుకంటే ఈ కంపెనీల షేర్ల ధరలు అధికంగా ఉంటాయి. కాబట్టి. దీర్ఘకాలంలో స్థిరమైన, ఒక మోస్తరు ప్రతిఫలం చాలు... అనుకునే వారికి ఇటువంటి పథకాలు అనుకూలంగా ఉంటాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు