‘మేలైన శక్తిగా’ ఇంటర్నెట్‌

ఇంటర్నెట్‌ను ఓ ‘మేలైన శక్తి’గా తీర్చిదిద్దే విషయంలో విదేశీ, భారతీయ కంపెనీలకు ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ తెలిపారు. కొన్ని పెద్ద కంపెనీలే గుత్తాధిపత్యం

Published : 16 Dec 2021 01:54 IST

సురక్షితంగా, నమ్మదగినదిగా, ప్రజలకు జవాబుదారీగా ఉండాలి

కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌

దిల్లీ: ఇంటర్నెట్‌ను ఓ ‘మేలైన శక్తి’గా తీర్చిదిద్దే విషయంలో విదేశీ, భారతీయ కంపెనీలకు ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ తెలిపారు. కొన్ని పెద్ద కంపెనీలే గుత్తాధిపత్యం చలాయించకుండా.. ఇంటర్నెట్‌ను అందరికీ సమానంగా అందుబాటులో ఉంచేందుకు చర్యలు చేపడతామని చెప్పారు. ఇంటర్నెట్‌ కంపెనీలు, వినియోగదారుల మధ్య జవాబుదారీతనం, పరస్పర గౌరవం ఇచ్చిపుచ్చుకునే సంస్కృతిని మెటా (మునుపు ఫేస్‌బుక్‌) లాంటి పెద్ద కంపెనీలు, ఇతర సంబంధిత సంస్థలు నెలకొల్పాలని ప్రభుత్వం కోరుకుంటోందని అన్నారు. ‘ఫ్యూయల్‌ ఫర్‌ ఇండియా 2021’ పేరుతో మెటా నిర్వహించిన వార్షిక సమావేశంలో  చంద్రశేఖర్‌ ప్రసంగించారు. పిల్లలు, పెద్దలు, పింఛన్‌దార్లు ఇలా అందరూ వాడుతారు కనుక ఇంటర్నెట్‌ సురక్షితంగాను, నమ్మదగినదిగా ఉండాలని తెలిపారు. ఆన్‌లైన్‌ ప్రపంచంలో ‘మంచి’ని పెంచేందుకు ప్రైవేట్‌ రంగ కంపెనీలు, విదేశీ, దేశీయ సంస్థలు, వ్యాపారవేత్తలతో భాగస్వాములం అయ్యేందుకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో కట్టుబడి ఉందని అన్నారు.  విధానాల రూపకల్పన, పరిశోధన- అభివృద్ధి, సాంకేతిక అభివృద్ధి వ్యూహాల పరంగా ప్రభుత్వం కీలకపాత్ర పోషించినప్పటికీ.. డిజటల్‌ ఆర్థిక వ్యవస్థ వృద్ధి, సంపద, అవకాశాల సృష్టికి కొత్త సంస్థల ఆవిర్భావం (ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌) కీలక చోదకంగా పనిచేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

మరింత ఆశావహంగా భారత్‌ భవిత..

సొంతంగా సంస్థలను ఏర్పాటు చేయాలనే తపన భారతీయుల్లో పెరగడం భవిష్యత్‌పై ఆశావహ దృక్పథం పెరిగేందుకు దోహదం చేస్తుందని, అవకాశాలూ సృష్టిస్తుందని మెటా వ్యవస్థాపకుడు మార్క్‌ జుకర్‌బర్గ్‌ అన్నారు. మెటావర్స్‌ను అభివృద్ధి చేయడంలో భారత్‌ పోషించనున్న పాత్రపై ఉత్సుకతతో ఎదురు చూస్తున్నానని జుకర్‌బర్గ్‌ తెలిపారు. వినియోగదారులు డిజిటల్‌ విశ్వంలో జీవించే వర్చువల్‌ రియాల్టీ, ఆగ్యుమెంటెడ్‌ రియాల్టీ, వీడియో లాంటి పలు రకాల సాంకేతికతలను కలిపి మెటావర్స్‌గా మెటా పిలుస్తోంది. మున్ముందు మొబైల్‌ ఇంటర్నెట్‌ స్థానంలో మెటావర్స్‌ చేరుతుందని జుకర్‌బర్గ్‌ చెప్పారు. భారత్‌ భవిష్యత్‌ను మార్చడంలో నిపుణులు కీలక పాత్ర పోషించనున్నారని తెలిపారు. 2024 కల్లా అతిపెద్ద యాప్‌ డెవలపర్‌ సంస్థలున్న దేశంగా అవతరించే దిశలో భారత్‌ అడుగులు వేస్తోందని అన్నారు. కొన్నేళ్లుగా భారత్‌లో ఆన్‌లైన్‌ గేమింగ్‌ రంగంలో అధిక వృద్ధ కన్పిస్తోందని జుకర్‌బర్గ్‌ చెప్పారు. మెటావర్స్‌లో ఆన్‌లైన్‌ గేమింగ్‌ ఎలాంటి పాత్ర పోషించనుందో చూడాల్సి ఉందని, అందుకే ఈ విభాగంలో పెట్టుబడులు పెంచడాన్ని కొనసాగిస్తామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని