Union Budget2022: భారత బడ్జెట్‌ భేష్‌

2022-23 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌, దేశం కోసం ‘చాలా ఆలోచించి’ తీసుకొచ్చిన అజెండా అని అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎమ్‌ఎఫ్‌) సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌(ఎండీ) క్రిస్టాలినా

Updated : 05 Feb 2022 04:17 IST

‘బాగా ఆలోచించి’ ప్రవేశపెట్టారు

ఐఎమ్‌ఎఫ్‌ ఎండీ క్రిస్టాలినా జార్జివా

వాషింగ్టన్‌: 2022-23 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌, దేశం కోసం ‘చాలా ఆలోచించి’ తీసుకొచ్చిన అజెండా అని అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎమ్‌ఎఫ్‌) సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌(ఎండీ) క్రిస్టాలినా జార్జివా ప్రశంసించారు. మానవ వనరులపై, డిజిటలీకరణ కోసం, పరిశోధన-అభివృద్ధిలో వినూత్నతపై ఈ బడ్జెట్‌ గట్టి దృష్టి పెట్టిందని తెలిపారు. రూ.39.45 లక్షల కోట్లతో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో జాతీయ రహదార్ల నుంచి అందుబాటు ధరలో ఇళ్ల వరకు అధిక కేటాయింపులను చేశారు. కరోనా నుంచి పుంజుకుని ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్లే కీలక అంశాలకు మద్దతు ఇచ్చేందు కోసం ఈ వ్యయాలను ప్రతిపాదించారు. ‘భారత్‌ బలమైన వృద్ధిని నమోదు చేయగలదని మేం అంచనా వేస్తున్నాం. అయితే  2021-22కు వృద్ధిరేటు అంచనాను 9.5 శాతం నుంచి 9 శాతానికి తగ్గించాం. 2022-23కు అంచనాలను కాస్తంత పెంచామ’ని జార్జివా పేర్కొన్నారు. ‘భారత్‌ తన స్వల్పకాల సమస్యలను పరిష్కరించుకునేందుకు చేసిన ఆలోచనా తీరుపై మేం చాలా సానుకూలంగా ఉన్నాం. అదే సమయంలో దీర్ఘకాల నిర్మాణాత్మక మార్పులూ ప్రతిపాదించారు. ఆర్థిక వనరులను వినియోగించుకుని వాతావరణ మార్పు అజెండాను వేగవంతం చేయడంలోనూ మంచి ఆలోచనలు చేశార’ని ప్రశంసించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని