డాక్టర్‌ రెడ్డీస్‌ లాభంలో 76 శాతం క్షీణత

అగ్రశ్రేణి ఔషధ కంపెనీల్లో ఒకటైన డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికానికి రూ.5,437 కోట్ల ఆదాయాన్ని, రూ.88 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. 2020-21 ఇదేకాలంలో ఆదాయం రూ.4,728 కోట్లు,

Published : 20 May 2022 02:51 IST

 ‘ఇంపెయిర్‌మెంట్‌ ఛార్జీల’ భారం వల్లే

 వార్షికాదాయం రూ.21,439 కోట్లు 

ఈనాడు, హైదరాబాద్‌: అగ్రశ్రేణి ఔషధ కంపెనీల్లో ఒకటైన డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికానికి రూ.5,437 కోట్ల ఆదాయాన్ని, రూ.88 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. 2020-21 ఇదేకాలంలో ఆదాయం రూ.4,728 కోట్లు, నికరలాభం రూ.362 కోట్లు కావడం గమనార్హం. దీంతో పోల్చితే ఈసారి ఆదాయం 15 శాతం పెరిగినా, నికరలాభం 76 శాతం క్షీణించింది. చర్మవ్యాధుల విభాగానికి చెందిన పీపీసీ-06 (టెపిలమైడ్‌ ఫుమరేట్‌ ఇఆర్‌ ట్యాబ్లెట్స్‌) అనే ఔషధానికి గిరాకీ తగ్గిపోవటంతో ఆ మేరకు రూ.430 కోట్లను ఇంపెయిర్‌మెంట్‌ ఛార్జీ కింద రద్దు చేయాల్సి వచ్చిందని, అదేవిధంగా అమెరికాలోని ష్రీవ్‌పోర్ట్‌ యూనిట్‌ ఆస్తులు- గుడ్‌విల్‌ కింద రూ.310 కోట్ల ఇంపెయిర్‌మెంట్‌ ఛార్జి నమోదు చేసినట్లు డాక్టర్‌ రెడ్డీస్‌ వెల్లడించింది. మెరుగైన ఆదాయాలు నమోదు చేసినా, ‘ఇంపెయిర్‌మెంట్‌ ఛార్జెస్‌’ వల్ల లాభాలు తగ్గినట్లు డాక్టర్‌ రెడ్డీస్‌ కో-ఛైర్మన్, ఎండీ జీవీ ప్రసాద్‌ పేర్కొన్నారు. కొన్ని కొత్త ఔషధాలు ఆవిష్కరించడం ద్వారా తమ మార్కెట్‌ వాటా పెంచుకోగలిగామన్నారు. ఉత్తర అమెరికాలో 100 కోట్ల డాలర్ల ఆదాయాలు నమోదు చేసే స్థాయికి ఎదిగినట్లు తెలిపారు. 

2021-22 మొత్తంమీద: గత ఆర్థిక సంవత్సరం పూర్తికాలానికి రూ.21,439 కోట్ల ఆదాయాన్ని, రూ.2,357 కోట్ల నికరలాభాన్ని సంస్థ ఆర్జించింది. 2020-21తో పోలిస్తే ఆదాయం 13 శాతం, నికరలాభం 37 శాతం పెరిగాయి. గత ఆర్థిక సంవత్సరానికి రూ.141.7 ఈపీఎస్‌ను డాక్టర్‌ రెడ్డీస్‌ నమోదు చేసింది. యూఎస్‌ ఆదాయాలు 6 శాతం, ఐరోపాలో 8 శాతం, దేశీయ మార్కెట్లో 26 శాతం వృద్ధి నమోదైందని సంస్థ తెలిపింది. 

రష్యా యుద్ధ ప్రభావం లేదు

మార్చి త్రైమాసిక  ఆదాయాలపై రష్యా- ఉక్రెయిన్‌ యుద్ధ ప్రభావం లేదని డాక్టర్‌ రెడ్డీస్‌ యాజమాన్యం స్పష్టం చేసింది. రష్యా వ్యాపారం గత ఆర్థిక సంవత్సరంలో 32 శాతం వృద్ధితో రూ.2,090 కోట్లకు చేరినట్లు పేర్కొంది. యుద్ధభయంతో రష్యాలోని స్టాకిస్టులు అధికంగా మందులు నిల్వచేయటం  కలిసివచ్చిందని, చెల్లింపుల సమస్యలూ లేవని తెలిపింది. ఉక్రెయిన్‌ విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నట్లు పేర్కొన్నారు.

‘స్పుత్నిక్‌ లైట్‌’ ధర తగ్గిస్తాం

కొవిడ్‌ వ్యాధి టీకా ‘స్పుత్నిక్‌ లైట్‌’ ధర తగ్గించనున్నట్లు డాక్టర్‌ రెడ్డీస్‌ వెల్లడించింది.  రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్, స్పుత్నిక్‌ లైట్‌ టీకా మార్కెటింగ్, పంపిణీ హక్కులు డాక్టర్‌ రెడ్డీస్‌కు ఉన్న విషయం విదితమే. స్పుత్నిక్‌ లైట్‌ టీకాను మనదేశంలో బూస్టర్‌ డోసు కింద వినియోగించేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా కోరుతూ డాక్టర్‌ రెడ్డీస్‌ త్వరలో భారత ఔషధ నియంత్రణ మండలి ని కోరనుంది. రెండు డోసుల కొవాగ్జిన్‌ లేదా కొవిషీల్డ్‌ టీకా తీసుకున్న వారు బూస్టర్‌ డోసు కింద స్పుత్నిక్‌ లైట్‌ టీకా తీసుకోవచ్చని డాక్టర్‌ రెడ్డీస్‌ సీఈఓ దీపక్‌ సప్ర పేర్కొన్నారు. 

ఒక్కోషేరుకు రూ.30 డివిడెండ్‌ 

 రూ.5 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుకురూ.30 చొప్పున డివిడెండ్‌ చెల్లించాలని డాక్టర్‌ రెడ్డీస్‌ యాజమాన్యం నిర్ణయించింది.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని