విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల వరద

ఇది వరకెన్నడూ లేనంతగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ)ను మన దేశం ఆకర్షించగలిగింది. 2021-22లో ఏకంగా 83.57 బిలియన్‌ డాలర్ల(దాదాపు రూ.6.3 లక్షల కోట్లు) ఎఫ్‌డీఐ వచ్చినట్లు వాణిజ్య,

Published : 21 May 2022 02:37 IST

2021-22లో రూ.6.3 లక్షల కోట్ల మేర

దిల్లీ: ఇది వరకెన్నడూ లేనంతగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ)ను మన దేశం ఆకర్షించగలిగింది. 2021-22లో ఏకంగా 83.57 బిలియన్‌ డాలర్ల(దాదాపు రూ.6.3 లక్షల కోట్లు) ఎఫ్‌డీఐ వచ్చినట్లు వాణిజ్య, పరిశ్రమల శాఖ శుక్రవారం తెలిపింది. సంస్కరణలతో పాటు సులభతర వాణిజ్యానికి ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల ఇది సాధ్యమైందని పేర్కొంది. 2020-21లో ఇవి 81.97 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి.

‘కొవిడ్‌, ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం వల్ల చోటుచేసుకున్న సవాళ్ల నేపథ్యంలోనూ విదేశీ పెట్టుబడులు తరలి వచ్చాయి. 2003-04తో పోలిస్తే ఈ పెట్టుబడులు 20 రెట్లు పెరిగాయ’ని పేర్కొంది. ‘తయారీ రంగంలో విదేశీ పెట్టుబడులకు గమ్యస్థానంగా భారత్‌ వేగంగా మారుతోంద’ని వివరించింది. 2020-21తో పోలిస్తే తయారీ రంగంలోకి ఎఫ్‌డీఐ 76 శాతం పెరిగింది. ‘బొగ్గు వెలికితీత, కాంట్రాక్ట్‌ తయారీ, డిజిటల్‌ మీడియా, ఏక బ్రాండ్‌ రిటైల్‌, పౌర విమానయానం, రక్షణ, బీమా, టెలికాం రంగాల్లో సంస్కరణలు చేపట్టడమూ కలిసివచ్చింది’ అని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

అగ్రగామి దేశాలు: మన దేశంలోకి వచ్చిన ఎఫ్‌డీఐలో 27 శాతం వాటాతో సింగపూర్‌ అగ్రస్థానంలో నిలిచింది. అమెరికా(18%), మారిషస్‌(16%)లు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

ఈ రంగాల్లోకి: కంప్యూటర్‌ సాఫ్ట్‌వేర్‌, హార్డ్‌వేర్‌ రంగాలు అత్యధిక పెట్టుబడులను ఆకర్షించగా.. సేవల రంగం, వాహన పరిశ్రమ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

ఈ రాష్ట్రాలకు అధికం
మొత్తం ఎఫ్‌డీఐ ఈక్విటీల్లో కర్ణాటక అత్యధికంగా 38 శాతం వాటా పొందింది. మహారాష్ట్ర(26%), దిల్లీ(14%) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని