అప్పు చేసి.. షేర్లలో వద్దు

రెండేళ్లుగా గోల్డ్‌ ఫండ్లలో మదుపు చేస్తున్నాను. పెద్దగా రాబడి వస్తున్నట్లు కనిపించడం లేదు. వీటికి బదులుగా ఈక్విటీ ఫండ్లలో మదుపు చేస్తే లాభం అంటున్నారు. నిజమేనా? నెలకు రూ.10వేలు మదుపు చేసి, ఆరేళ్ల తర్వాత బంగారం కొనాలనేది నా ఆలోచన.

Published : 08 Apr 2022 00:42 IST

రెండేళ్లుగా గోల్డ్‌ ఫండ్లలో మదుపు చేస్తున్నాను. పెద్దగా రాబడి వస్తున్నట్లు కనిపించడం లేదు. వీటికి బదులుగా ఈక్విటీ ఫండ్లలో మదుపు చేస్తే లాభం అంటున్నారు. నిజమేనా? నెలకు రూ.10వేలు మదుపు చేసి, ఆరేళ్ల తర్వాత బంగారం కొనాలనేది నా ఆలోచన.

- సత్య

కొవిడ్‌ తర్వాత బంగారం ధర జీవిత కాల గరిష్ఠాల నుంచి 12 నుంచి 14 శాతం వరకూ తగ్గింది. మీరు ధర అధికంగా ఉన్నప్పుడు మదుపు ప్రారంభిస్తే.. ఇప్పుడు లాభాలు తక్కువగానే ఉంటాయి. ఇంకా ఆరేళ్ల వ్యవధి ఉందంటున్నారు కాబట్టి, ఈక్విటీ ఫండ్లలో క్రమానుగత పెట్టుబడి ద్వారా మదుపు చేయండి. బంగారం కొనాలనుకున్నప్పుడు ఈ పెట్టుబడిని వెనక్కి తీసుకొని, వాడుకోండి.


* వ్యక్తిగత రుణం తీసుకొని, షేర్లలో మదుపు చేద్దామని అనుకుంటున్నాను. స్టాక్‌ మార్కెట్‌ పెరుగుతోంది కాబట్టి, లాభాలు బాగా వస్తాయని స్నేహితుడు సూచించాడు. ఇది మంచిదేనా? ఏం చేయాలి?

- శ్రీధర్‌

*  స్టాక్‌ మార్కెట్‌లో దీర్ఘకాలం అంటే కనీసం 5-7 ఏళ్ల పాటు పెట్టుబడి పెట్టాలి. అప్పుడే మంచి రాబడికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతోపాటు నష్టభయం ఉంటుందని మర్చిపోవద్దు. పెట్టుబడి పెట్టిన మొత్తంతో మీకు 5-6 ఏళ్లపాటు అవసరం లేదనుకున్నప్పుడే మంచి షేర్లలో మదుపు చేయాలి. అప్పు చేసి షేర్లను కొనుగోలు చేయడం ఎప్పుడూ శ్రేయస్కరం కాదు. తీసుకున్న రుణానికి వడ్డీ చెల్లించాలి. మీకు డబ్బు అవసరమున్నప్పుడు మార్కెట్‌లు పతనమైతే.. నష్టాన్నీ భరించాల్సి వస్తుంది.


* మూడేళ్ల మా అబ్బాయి పేరుమీద నెలకు రూ.20వేల వరకూ మదుపు చేయాలనేది ఆలోచన. ఇందుకోసం నా ప్రణాళిక ఎలా ఉండాలి?

- ప్రభాకర్‌

ముందుగా మీ అబ్బాయి భవిష్యత్‌ అవసరాలకు ఆర్థిక రక్షణ కల్పించండి. అందుకోసం మీ పేరుపై తగినంత మొత్తానికి జీవిత బీమా పాలసీ తీసుకోండి. మరో 12 ఏళ్ల తర్వాతే మీ అబ్బాయి చదువుకు డబ్బు అవసరం పెరుగుతుంది. దానికి తగ్గట్టుగా మీ పెట్టుబడులు కొనసాగించండి. ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లలో నెలకు రూ.20వేల చొప్పున 12 ఏళ్లపాటు మదుపు చేస్తే.. 12 శాతం రాబడితో రూ.57,91,951 అయ్యేందుకు అవకాశం ఉంది.


ప్రైవేటు ఉద్యోగిని. నెలకు రూ.50 వేల వరకూ జీతం వస్తోంది. గతంలో రూ.25లక్షల టర్మ్‌ పాలసీ తీసుకున్నాను. దీన్ని ఎంత మొత్తానికి పెంచుకోవాలి? నెలకు రూ.4 వేలు రికరింగ్‌ డిపాజిట్‌ చేయాలని అనుకుంటున్నాను. దీనికి ప్రత్యామ్నాయంగా సురక్షిత పెట్టుబడి పథకాలేమున్నాయి?

- పవన్‌

* మనకు ఉన్న బీమా రక్షణ సరిపోతుందా లేదా అనేది రెండేళ్లకోసారైనా సమీక్షించుకోవాలి. వార్షికాదాయానికి 15 రెట్ల వరకూ జీవిత బీమా ఉండేలా చూసుకోవాలి. ప్రస్తుతం ఉన బీమా మొత్తం మీకు సరిపోదు. కనీసం రూ.70 లక్షల బీమా ఉండేలా చూసుకోండి. కాబట్టి, ఇప్పుడున్న బీమాకు అదనంగా మరో రూ.45 లక్షల పాలసీని తీసుకోండి. మంచి చెల్లింపుల చరిత్ర ఉన్న సంస్థను ఎంచుకోండి. మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటున్న రూ.4వేలను దీర్ఘకాలిక లక్ష్యంతో ప్రజా భవిష్య నిధి (పీపీఎఫ్‌)లో మదుపు చేయండి. దీనివల్ల మీ డబ్బు సురక్షితంగా ఉంటుంది. సెక్షన్‌ 80సీ కింద పన్ను మినహాయింపు క్లెయిం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ పథకంలో 7.1 శాతం వడ్డీ లభిస్తోంది.


* నా వయసు 64. ఇటీవలే నా ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ నుంచి రూ.3లక్షలు వెనక్కి వచ్చాయి. వడ్డీ రేట్లు తక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ మొత్తాన్ని మ్యూచువల్‌ ఫండ్లలో పెట్టాలని అనుకుంటున్నాను. దీనివల్ల నష్టపోయే ప్రమాదం ఉందా?

- కృష్ణ

* నేరుగా షేర్లలో మదుపు చేసే ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లలో నష్టభయం కాస్త అధికంగా ఉంటుంది. డెట్‌ ఫండ్లలో స్వల్ప నష్టభయం ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో డెట్‌ ఫండ్లు 5-6 శాతం వరకే రాబడినిస్తున్నాయి. దీనికి ప్రత్యామ్నాయంగా మీరు పోస్టాఫీసు సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్‌ స్కీంలో మదుపు చేయొచ్చు. ప్రస్తుతం ఇందులో 7.4శాతం వడ్డీ చెల్లిస్తున్నారు.

- తుమ్మ బాల్‌రాజ్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని