రుణం వ‌ద్దు.. పొదుపు చేసుకోండి

వ్య‌క్తిగత రుణాలు తీసుకోవ‌డం ప్ర‌స్తుతం చాలా సాధార‌ణంగా మారింది. రిజ‌ర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) గ‌ణాంకాల ప్రకారం, వ్య‌క్తిగ‌త రుణాలు ఏప్రిల్ 2017 తో పోలిస్తే, ఏప్రిల్ 2018 నాటికికి 35.3 శాతం పెరిగాయి. క్రెడిట్ కార్డు రుణాలు 35.2 శాతం పెరిగాయి. అయితే దీర్ఘ‌కాలిక వ‌స్తువుల కొనుగోలుకు రుణాలు, విద్యారుణాలు మాత్రం వాటితో

Published : 23 Dec 2020 09:43 IST

వ్య‌క్తిగత రుణాలు తీసుకోవ‌డం ప్ర‌స్తుతం చాలా సాధార‌ణంగా మారింది. రిజ‌ర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) గ‌ణాంకాల ప్రకారం, వ్య‌క్తిగ‌త రుణాలు ఏప్రిల్ 2017 తో పోలిస్తే, ఏప్రిల్ 2018 నాటికికి 35.3 శాతం పెరిగాయి. క్రెడిట్ కార్డు రుణాలు 35.2 శాతం పెరిగాయి. అయితే దీర్ఘ‌కాలిక వ‌స్తువుల కొనుగోలుకు రుణాలు, విద్యారుణాలు మాత్రం వాటితో పోలిస్తే త‌గ్గిపోయాయి. గ‌త కొన్ని సంవ‌త్స‌రాలుగా వ్య‌క్తిగ‌త రుణాల అవ‌స‌రంతో పాటు, ఆమోదం పెరిగిపోయింది. రుణాలు తీసుకొని విదేశాల‌కు ప‌ర్య‌ట‌న‌ల‌కు వెళ్లేందుకు ఇష్ట‌ప‌డుతున్నారు. పొదుపు చేసేందుకు సుముఖ‌త చూప‌ట్లేదు. ఈఎమ్ఐల స‌దుపాయం ఉండ‌టంతో మ‌రింత ఆనందంగా రుణాల‌ను తీసుకొని ఆస్వాదిస్తున్నారు. దీంతో పాటు ఇప్పుడు మార్కెట్‌లో వ్య‌క్తిగ‌త రుణాలు సుల‌భంగా ల‌భిస్తుండ‌టంతో అవ‌స‌రం లేకున్నా తీసుకుంటున్నారు.

మంచి క్రెడిట్ చ‌రిత్ర క‌లిగి ఉంటే వ్య‌క్తిగ‌త రుణాలు ల‌భించ‌డం సులభం. డిజిటైజేషన్ ద్వారా బ్యాంకు సేవ‌ల‌ను వినియోగ‌దారులు సుల‌భంగా పొందుతున్నారు. క్రెడిట్ స్కోరును తెలుసుకొని అర్హ‌త ఉన్న‌ట్ల‌యితే వ్య‌క్తిగ‌త రుణాల‌ను తీసుకుంటున్నారు. బ్యాంకులు, ఇత‌ర ఆర్థిక సంస్థ‌లు సుల‌భంగా వ్య‌క్తిగ‌త రుణాల‌ను ఆఫ‌ర్ చేస్తున్నాయి. బ్యాంకును బట్టి రుణ కాల‌ప‌రిమితి, వ‌డ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఫీజులు మారుతుంటాయి. ఇప్పుడు టాటా క్యాపిట‌ల్ 10.99 శాతం నుంచి 19 శాతం వ‌డ్డీ రేటుతో రుణాల‌ను అందిస్తుంది. ప్రాసెసింగ్ ఫీజు రూ.999 తో పాటు జీఎస్‌టీ వ‌ర్తిస్తుంది. రుణ కాల‌ప‌రిమితి 12 నుంచి 72 నెల‌ల వ‌ర‌కు ఉంటుంది. బ‌జాజ్ ఫిన్‌స‌ర్వ్ వ్య‌క్తిగ‌త రుణాల‌పై వ‌డ్డీ రేట్లు 12.99 శాతం, ఛార్జీలు 2.25 శాతంతో పాటు ఇత‌ర ఛార్జీలు వ‌ర్తిస్తాయి.

అదేవిధంగా హెచ్‌డీఎఫ్‌సీ వ్యక్తిగ‌త రుణాల‌పై వ‌డ్డీ రేట్ల‌ను 15 శాతం నుంచి 20.99 శాతం వ‌ర‌కు విధిస్తుంది. ప్రాసెసింగ్ ఫీజు 2.5 శాతం. వేత‌న జీవులు రుణం తీసుకుంటే 12 ఈఎమ్ఐల కంటే ముందు పూర్తిగా ముంద‌స్తుగా రుణం చెల్లించేందుకు వీలుండ‌దు. వేత‌న స్లిప్‌లు, మీ గుర్తింపు కార్డులు ఉంటే చాలు సుల‌భంగా రుణం ల‌భిస్తుంది.

మీరు వ్య‌క్తిగ‌త రుణం తీసుకుంటున్నారా?

భ‌విష్య‌త్తులో మీకు ఉండే ఖ‌ర్చుల‌ను అంచ‌నా వేసుకొని పొదుపు అలవాటు చేసుకోవ‌డం మంచి ప‌ని. అన‌వ‌స‌ర ఖ‌ర్చుల‌ను త‌గ్గించుకొని దీనిపై దృష్టి సారించాలి. అలాంట‌ప్పుడు ఏదైనా అవ‌స‌ర‌మున్న‌ప్పుడు వ్య‌క్తిగ‌త రుణాలు తీసుకోకుండా పొదుపు చేసుకున్న డ‌బ్బును వినియోగించుకోవ‌చ్చు. అయినా స‌రే, అత్య‌వ‌స‌ర స‌మ‌యాల్లో క‌చ్చితంగా డ‌బ్బు అవ‌స‌ర‌మ‌నుకుంటే వ‌డ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఫీజులు, ముందస్తు ఛార్జీల వివ‌రాలు తెలుసుకొని తీసుకోవాలి. త‌ర్వాత స‌మ‌యానికి చెల్లింపులు జ‌ర‌పాలి. లేక‌పోతే మీ క్రెడిట్ స్కోర్‌పై ప్ర‌భావం ప‌డుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని