సెక్యూరిటీస్‌ను హామీగా ఉంచి రుణం తీసుకోవ‌చ్చా?

ఇది వ‌ర‌కు రోజుల్లో రుణం మంజూరు కావ‌డానికి చాలా స‌మ‌యం వేచియుండ‌వ‌ల‌సి వచ్చేది. అయితే ప్ర‌స్తుతం ఆన్‌లైన్‌, యాప్‌ల ద్వారా ఒకే రోజులో రుణాల‌ను అందించే సౌక‌ర్యాల‌ను బ్యాంకులు క‌ల్పిస్తున్నాయి. కొన్ని బ్యాంకులు అయితే కొన్ని నిమిషాలు, సెక‌న్ల‌లోనే రుణాల‌ను అందిస్తున్నాయి. రుణం సుల‌భంగా

Published : 23 Dec 2020 15:52 IST

ఇది వ‌ర‌కు రోజుల్లో రుణం మంజూరు కావ‌డానికి చాలా స‌మ‌యం వేచియుండ‌వ‌ల‌సి వచ్చేది. అయితే ప్ర‌స్తుతం ఆన్‌లైన్‌, యాప్‌ల ద్వారా ఒకే రోజులో రుణాల‌ను అందించే సౌక‌ర్యాల‌ను బ్యాంకులు క‌ల్పిస్తున్నాయి. కొన్ని బ్యాంకులు అయితే కొన్ని నిమిషాలు, సెక‌న్ల‌లోనే రుణాల‌ను అందిస్తున్నాయి. రుణం సుల‌భంగా ల‌భిస్తుంద‌ని విచ‌క్ష‌ణా రహితంగా తీసుకోవ‌డం మంచిది కాదు. ఎటువంటి హామీ లేకుండా ఒక్క సెక‌న్ లేదా ఒక్క ట్యాప్‌తో బ్యాంకులు రుణాలను అందిస్తున్నాయి. అయితే ఇటువంటి రుణాల‌కు వ‌డ్డీ రేటు కూడా అధికంగానే ఉంటుంది. ఆస్తి, సెక్యూరిటీస్ వంటి వాటిని హామీగా ఉంచి తీసుకున్న రుణాలను భ‌ద్ర‌త రుణాలు అంటారు. వీటిపై వ‌డ్డీ రేటు త‌క్కువ‌గా ఉంటుంది.

సెక్యూరిటీస్‌పై ల‌భించే రుణాలు అంటే ఏమిటి?

ఇన్సురెన్స్ పాల‌సీలు, మ్యూచువ‌ల్ ఫండ్లు, డైరెక్ట్ స్టాక్‌లు, ఫిక్స్‌డ్ మెచ్యూరిటీ ప్లాన్లు, ఎక్స్‌ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్లు, సేవింగ్స్ బాండ్లు వంటి వాటిని కొనుగోలు చేశారా? ఒక‌వేళ రుణం అవ‌స‌ర‌మైతే ఈ సెక్యూరిటీస్‌ను హామీగా వుంచి రుణం పొంద‌వ‌చ్చు. ఈ విధ‌మైన రుణాల‌పై విధించే వ‌డ్డీ రేటు బ్యాంకు నుంచి బ్యాంకుకు మారుతుంది. కొన్ని బ్యాంకులు ఆన్‌లైన్ రుణాల‌ను తీసుకునేందుకు అనుమ‌తిస్తున్నాయి. షేర్ల‌ను హామీగా ఉంచి రుణాల‌ను తీసుకోవ‌చ్చు. అయితే ఇందుకోసం మీకు ఆ బ్యాంకులో డీమ్యాట్ ఖాతా ఉండాలి.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ. 50 వేల‌తో మొద‌లుకుని గ‌రిష్టంగా రూ. 20 ల‌క్ష‌ల వ‌ర‌కు షేర్ల‌పై రుణాల‌ను మంజూరు చేస్తుంది. మీరు హామీగా ఉంచే షేర్ల విలువ‌లో 50 శాతం వ‌ర‌కు మాత్ర‌మే రుణం ఇస్తుంది. ఐసీఐసీఐ బ్యాంక్ లిమిటెడ్ ప్ర‌కారం మ్యూచువ‌ల్ ఫండ్ల నిక‌ర విలువ‌పై 50 శాతం రుణం ల‌భిస్తుంది. జీవిత‌బీమా పాల‌సీలను హామీగా ఉంచి క‌నిష్టంగా రూ.50 వేలు, గ‌రిష్టంగా రూ.5 కోట్ల వ‌ర‌కు రుణాలు తీసుకోవ‌చ్చు. సెక్యూరిటీస్‌పై రుణాల కోసం ద‌ర‌ఖాస్తు చేసుకునేవారు, సెక్యూరిటీస్‌ని హామీగా ఉంచ‌డంతో పాటు మీ గుర్తింపు కార్డు, అడ్ర‌స్ ప్రూఫ్, సంత‌కం వంటివి ఇవ్వాల్సి ఉంటుంది.

వ‌డ్డీ రేటు:

దాదాపు అన్ని బ్యాంకులు సెక్యూరీటీస్‌పై రుణాల‌ను అందిస్తున్నాయి. అయితే ఇది కొంత ఖ‌ర్చుతో కూడి ఉంటుంది. రుణం కోసం ద‌ర‌ఖాస్తు చేసుకునే బ్యాంకు, హామీగా ఉంచే సెక్యూరిటీల ఆధారంగా వ‌డ్డీ రేటు మారుతుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్ర‌స్తుతం షేర్లు, మ్యూచువ‌ల్ ఫండ్ల డ్యూయ‌ల్ అడ్వాంటేజ్ పండ్ల‌ను హామీగా ఉంచి తీసుకునే రుణాల‌పై 10.95 శాతం, సార్వ‌భౌమ ప‌సిడి బాండ్లపై రుణాల‌కు 10.45 శాతం, జాతీయ పొదుపు ప‌త్రాలు, ఆర్‌బీఐ రీలీఫ్ బాండ్లు, బీమా పాల‌సీల‌పై రుణాల‌కు 13.10 శాతం వ‌డ్డీ వ‌సూలు చేస్తుంది. వ‌డ్డీతో పాటు వార్షిక నిర్వ‌హ‌ణ రుసుములు, ప్రాసెసింగ్ చార్జీలు, స్టాంప్ డ్యూటీ, క్రెడిట్ స‌మాచారం అందించే కంపెనీ చార్జీలు, ముంద‌స్తు చెల్లింపుల‌కు విధించే చార్జీలు, ఇత‌ర ఛార్జీలు వ‌ర్తిస్తాయి. ఉదాహ‌ర‌ణ‌కు ఈక్వీటీ, డెట్‌, నాన్‌-క‌న్వ‌ర్ట‌బుల్ బాండ్లు, క‌నీసం రూ.1000, గ‌రిష్టంగా రూ. 5వేలు క్యాప్‌తో ఉండే బాండ్ల‌కు, 0.5 శాతం(50 బేసిస్ పాయింట్ల) ఆధారంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ లిమిటెడ్ వార్షిక నిర్వ‌హ‌ణ రుసుములు విధిస్తుంది. ప్రాసెసింగ్ చార్జీలు స్థిరంగా గానీ, మొత్తం రుణంలో కొంత శాతం గానీ విధిస్తారు.

రుణం కోసం ద‌ర‌ఖాస్తు చేస్తున్నారా?

రుణాల‌ను తీసుకునే కంటే ముందుగా పొదుపు చేసి, ఆమొత్తాన్ని అవ‌స‌రాల‌కు వినియోగించ‌డం మంచింది. ఒక‌వేళ రుణం తీసుకోవ‌ల్సిన ప‌రిస్థ‌తి వ‌స్తే మీకు అందుబాటులో ఉన్న అన్నింటిని ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని త‌క్కువ వ‌డ్డీ రేటు వ‌ర్తించే రుణం తీసుకోవ‌డం మంచిది. ఉదాహ‌ర‌ణ‌కి, మీరు క్రెడిట్ కార్డు రుణాల‌ను ప‌రిశీలిస్తే గ్రేస్ పిరియ‌డ్ లోపుగా చెల్లించ‌క పోతే 22 నుంచి 44 శాతం వ‌డ్డీ చెల్లించాలి. వ్య‌క్తిగ‌త రుణాల విష‌యంలో వార్షికంగా 12 నుంచి 24 శాతం, సెక్యూరిటీ రుణాల‌పై 10 నుంచి 14 శాతం వార్షిక వ‌డ్డీ రేటు ఉంటుంది. అందువ‌ల్ల పైన తెలిపిన మూడు రుణాల‌లో ఒక‌దాన్ని ఎంచుకోవ‌ల్సి వ‌చ్చిన‌ప్పుడు సెక్యూరిటీస్ రుణాల‌ను ఎంచుకోవ‌డం మంచిది.

రుణాలు అనేవి ఎల్ల‌ప్పుడూ చివ‌రి ఎంపిక‌గా ఉండాలి. ఒక‌సారి రుణం తీసుకోవాలి అని నిర్ణ‌యించుకున్న‌ప్పుడు మీకు అందుబాటులో ఉన్న అన్ని రుణాల‌లో త‌క్కువ వ‌డ్డీ రేటుతో ల‌భించే రుణాల‌ను తీసుకోవ‌డం మంచిది. త‌న‌ఖాలేని క్రెడిట్ కార్డు, వ్య‌క్తిగ‌త రుణాల కంటే త‌న‌ఖా పెట్టి తీసుకునే గృహ రుణం, సెక్యూరిటీస్ రుణం వంటివి త‌క్కువ వ‌డ్డీ రేట్ల‌తో ల‌భిస్తాయి. తీసుకున్న రుణానికి చెల్లించే వ‌డ్డీ కంటే, సెక్యూరిటీస్‌పై వ‌చ్చే రాబ‌డి త‌క్కువ‌గా ఉన్న‌ప్పుడు ఆ సెక్యూరిటీల‌ను విక్ర‌యించ‌డం మంచిది. అయితే ఇది సంద‌ర్భానికి అనుగుణంగా మారుతూ ఉంటుందని సెబీ రిజిష్ట‌ర్డ్ అడ్వైజ‌ర్‌, ఫిన్‌విన్ ఫైనాన్షియ‌ల్ ప్లాన‌ర్ వ్య‌వ‌స్థాప‌కులు మాల్వీన్ జోస‌ఫ్ పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని