Import duty: అరుదైన వ్యాధుల చికిత్సలో వినియోగించే ఔషధాలపై దిగుమతి సుంకం మినహాయింపు

Import Duty: వివిధ వర్గాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు అరుదైన వ్యాధుల చికిత్సలో ఉపయోగించే ఔషధాలపై దిగుమతి సుంకాన్ని పూర్తిగా మినహాయిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది.

Published : 30 Mar 2023 23:59 IST

దిల్లీ: అరుదైన వ్యాధుల చికిత్సలో ఉపయోగించే ఔషధాలు, ప్రత్యేక వైద్య ప్రయోజనాల నిమిత్తం వినియోగించే ఆహారంపై దిగుమతి సుంకాన్ని (Import Duty) పూర్తిగా మినహాయిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే, వ్యక్తిగత అవసరాల కోసం చేసుకునే దిగుమతులకు మాత్రమే మినహాయింపు ఉంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు గురువారం కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

వివిధ వర్గాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ మినహాయింపు ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి రానున్నట్లు పేర్కొంది. వివిధ రకాల క్యాన్సర్‌ చికిత్సల్లో ఉపయోగించే పెంబ్రోలిజుమాబ్‌ అనే ఔషధం దిగుమతిపై బేసిక్‌ కస్టమ్స్‌ డ్యూటీని పూర్తిగా తొలగిస్తున్నట్లు తెలిపింది. ‘జాతీయ పాలసీ 2021’లో పేర్కొన్న అన్ని అరుదైన వ్యాధుల చికిత్సల్లో ఉపయోగించే మందులపై దిగుమతి సుంకం మినహాయింపు ఉంటుందని పేర్కొంది. కస్టమ్స్ సుంకం నుంచి పూర్తి మినహాయింపును పొందేందుకు కేంద్ర/రాష్ట్ర డైరెక్టర్ హెల్త్ సర్వీసెస్‌ లేదా జిల్లా వైద్య అధికారి/జిల్లా సివిల్ సర్జన్ నుంచి పొందిన సర్టిఫికెట్‌ను సమర్పించాల్సి ఉంటుంది.

ఇప్పటికే కొన్ని రకాల చికిత్సల్లో ఉపయోగించే మందులకు దిగుమతి సుంకం నుంచి మినహాయింపు ఉంది. అయితే, దాన్ని మరికొన్ని చికిత్సలకూ విస్తరించాలనే డిమాండ్లు ప్రభుత్వానికి అందాయి. ఆ మేరకే ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది. సాధారణంగా ఔషధాలపై 10 శాతం ప్రాథమిక కస్టమ్స్ సుంకం ఉంటుంది. కొన్ని కీలక ఔషధాలపై దాన్ని ఐదు శాతానికి కుదించారు. వెన్నెముక కండరాల క్షీణత, కండరాల బలహీనత వంటి వ్యాధుల చికిత్స కోసం ఉపయోగించే మందులపై ఇప్పటికే పూర్తిగా మినహాయింపు లభిస్తోంది. కొన్ని అరుదైన వ్యాధుల చికిత్సకు వార్షిక ఖర్చు సంవత్సరానికి 10 లక్షల నుంచి రూ.1 కోటి కంటే ఎక్కువ అవుతోందని కేంద్రం అంచనా వేసింది. చికిత్స జీవితకాలం ఉండడం వల్ల సామాన్య ప్రజలు ఆ ఖర్చును భరించలేకపోతున్నారని పేర్కొంది. కస్టమ్స్ సుంకం మినహాయింపు వల్ల ఔషధాల వ్యయం గణనీయంగా తగ్గుతుందని తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని