Oneplus: వన్‌ప్లస్‌ యూజర్స్‌కు రిలీఫ్‌.. వారికి లైఫ్‌టైమ్‌ స్క్రీన్‌ వారెంటీ!

Oneplus greenline isssue: గ్రీన్‌లైన్‌ సమస్యకు వన్‌ప్లస్‌ పరిష్కారం చూపింది. ఆయా యూజర్లకు లైఫ్‌టైమ్‌ స్క్రీన్‌ రీప్లేస్‌మెంట్‌ వారెంటీ సౌకర్యాన్ని కల్పిస్తోంది.

Published : 10 Aug 2023 16:01 IST

ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల వన్‌ప్లస్‌ (Oneplus) యూజర్ల నోట వినిపిస్తున్న ప్రధాన సమస్య గ్రీన్‌లైన్‌ (greenline isssue). తమ హ్యాండ్‌సెట్‌ను లేటెస్ట్‌ వెర్షన్‌కు అప్‌డేట్‌ చేసిన తర్వాత స్క్రీన్‌పై ఆకుపచ్చ రంగులో ఓ గీత దర్శనమిస్తోందని పలు యూజర్లు ఫిర్యాదు చేస్తున్నారు. పాత వెర్షన్‌కు మారినా ఈ సమస్య పోవడం లేదని చెబుతున్నారు. దీనిపై ట్విటర్‌, రెడిట్‌, వన్‌ప్లస్‌ కమ్యూనిటీ వంటి వేదికలుగా తమ సమస్యను తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయా యూజర్లకు ఊరట కల్పిస్తూ వన్‌ప్లస్‌ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌లో ఈ సమస్య ఎదుర్కొంటున్న యూజర్లకు లైఫ్‌టైమ్‌ స్క్రీన్‌ వారెంటీ సదుపాయాన్ని కల్పిస్తోంది.

ముఖ్యంగా వన్‌ప్లస్‌ 8, వన్‌ప్లస్‌ 9 సిరీస్‌ ఫోన్లలో ఈ గ్రీన్‌లైన్‌ ఇష్యూ ఎక్కువగా కనిపిస్తోంది. వన్‌ప్లస్‌ ఓఎస్‌ అయిన ఆక్సిజన్‌ 13.1 అప్‌డేట్ చేసినప్పుడు తమ ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేలో గ్రీన్‌లైన్‌ కనిపిస్తున్నట్లు కంపెనీ దృష్టికి తీసుకురావడంతో వన్‌ప్లస్‌ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సమస్య ఎదుర్కొన్న వారు దగ్గర్లోని వన్‌ప్లస్‌ సర్వీసస్‌ సెంటర్‌కు వెళితే ఉచితంగా స్క్రీన్‌ రీప్లేస్‌ చేసి ఇస్తామని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొన్నట్లు ఆండ్రాయిడ్‌ అథారిటీ పేర్కొంది. యూజర్లకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని వన్‌ప్లస్‌ పేర్కొంది. ఇండియాలో కొనుగోలు చేసిన వన్‌ప్లస్‌ హ్యాండ్‌సెట్లకు ఈ సర్వీస్‌ వర్తిస్తుంది.

జియో ఫ్రీడమ్‌ ప్లాన్‌.. ₹2,999 రీఛార్జిపై ₹5,800 విలువ చేసే ప్రయోజనాలు

అయితే, స్క్రీన్‌ రీప్లేస్‌మెంట్‌తో పాటు వోచర్‌ సదుపాయాన్నీ వన్‌ప్లస్‌ కల్పిస్తోంది. పాత ఫోన్‌ తీసుకుని కొత్త వన్‌ప్లస్‌ డివైజ్‌ కొనుగోలుకు వోచర్‌ అందిస్తోంది. పాత ఫోన్‌కు తగిన విలువ కట్టి ఈ వోచర్‌ను అందిస్తోంది. ముఖ్యంగా వన్‌ప్లస్‌ 8 ప్రో, వన్‌ప్లస్‌ 8టి, వన్‌ప్లస్‌ 9, వన్‌ప్లస్‌ 9ఆర్‌ మోడళ్లపై డిస్కౌంట్‌ వోచర్లను వన్‌ప్లస్‌ అందిస్తున్నట్లు తెలుస్తోంది. స్పేర్‌ పార్ట్స్‌ అందుబాటులో లేని కారణంగా చాలా స్టోర్ల వద్ద వోచర్‌ను అందిస్తామని నోటీసులు అతికిస్తున్నారు. ఏ మోడల్‌ ఫోన్‌కు ఎంత విలువ కలిగిన వోచర్‌ అందిస్తారో, ఏయే ఫోన్లపై డిస్కౌంట్‌ లభిస్తుందో వంటి వివరాలను అందులో పొందుపరుస్తున్నారు. ఒక్క వన్‌ప్లస్‌లోనే కాదని, ఇతర కంపెనీ ఫోన్లలోనూ కొన్నింటిలో ఈ సమస్య తలెత్తుతున్నట్లు యూజర్లు ఫిర్యాదు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని