Tax on Gold: బంగారం కొనుగోలుదారులకు షాక్‌.. దిగుమతి సుంకం పెంపు!

Tax on Gold: ప్ర‌భుత్వం దిగుమ‌తి సుంకాన్ని 5 శాతం మేర పెంచింది.

Updated : 01 Jul 2022 15:58 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బంగారం (Gold) కొనుగోలుదారులకు కేంద్రం షాకిచ్చింది. పసిడిపై దిగుమతి సుంకాన్ని (Tax on Gold) పెంచింది. ప్రస్తుతం 10.75 శాతంగా ఉన్న దిగుమతి సుంకాన్ని 15 శాతానికి పెంచింది. బంగారం దిగుమతులు పెరుగుతున్న నేపథ్యంలో కరెంట్‌ ఖాతా లోటును అధిగమించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం తన నోటిఫికేషన్‌లో పేర్కొంది. జూన్‌ 30 నుంచే ఈ మార్పులు అమల్లోకి వచ్చినట్లు తెలిపింది.

ఇంతకుముందు బంగారంపై ప్రాథమిక దిగుమతి పన్ను 7.5 శాతంగా ఉంది. ఇప్పుడది 12.5 శాతానికి చేరింది. దీనికి 2.5 శాతం అగ్రికల్చర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సెస్‌ అదనం. దీంతో బంగారంపై దిగుమతి పన్ను 15 శాతానికి చేరింది. ఈ మొత్తానికి 3 శాతం జీఎస్టీ అదనం. పెరిగిన దిగుమతి సుంకంతో బంగారం కొనుగోళ్లు ఇక భారంగా మారనున్నాయి.

పెంపు ఎందుకు..?

డాలరుతో పోలిస్తే రూపాయి విలువ రికార్డు కనిష్ఠానికి చేరింది. దీంతో రూపాయిపై ఒత్తిడిని తగ్గించేందుకు కేంద్రం చర్యలకు ఉపక్రమించింది. ముఖ్యంగా బంగారం దిగుమతులు అమాంతం పెరగడంతో దీనిపై దృష్టి సారించింది. మే నెలలో 107 టన్నుల బంగారం దేశంలోకి దిగుమతి అవ్వగా.. జూన్‌లో సైతం అదే స్థాయిలో బంగారం భారత్‌కు వచ్చింది. దీనివల్ల బంగారం కరెంట్‌ ఖాతా లోటు పెరగుతుండడంతో దిగుమతి సుంకాన్ని పెంచినట్లు ఆర్థిక మంత్రిత్వశాఖ తన నోటిఫికేషన్‌లో పేర్కొంది.

గతంలో బంగారం అక్రమ రవాణాను తగ్గించేందుకు బంగారంపై దిగుమతి సుంకాన్ని 7.5 శాతం నుంచి 4 శాతానికి తగ్గించాలని దేశంలోని ప్రముఖ ఆభరణ వ్యాపారులు ప్రభుత్వాన్ని కోరారు. దీనికి విరుద్ధంగా దిగుమతి సుంకాన్ని ప్రభుత్వం పెంచడం గమనార్హం. దీంతో బంగారం ధ‌ర‌లు మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంది. మ‌రోవైపు దేశీయ మార్కెట్‌ను బ‌లోపేతం చేసేందుకు చైనా, అమెరికా, సింగపూర్ వంటి దేశాలు బంగారంపై దిగుమతి సుంకాన్ని తొలగించాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని