India - EFTA: 15 ఏళ్లలో 100 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు.. ఈఎఫ్‌టీఏతో భారత్‌ ఒప్పందం!

రాబోయే 15 ఏళ్లలో భారత్‌లో ఈఎఫ్‌టీఏ 100 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టనుందని కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ తెలిపారు. 

Published : 10 Mar 2024 14:52 IST

దిల్లీ: ఐరోపా స్వేచ్ఛా వాణిజ్య సంఘం (EFTA) రాబోయే 15 ఏళ్లలో భారత్‌లో 100 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ తెలిపారు. ఈ మేరకు ఆదివారం భారత్‌ - ఈఎఫ్‌టీఏలు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశాయి. ఇందులో సరకు వాణిజ్యం, మేధో సంపత్తి హక్కులు (IPR), సేవలు, పెట్టుబడి ప్రోత్సాహం, సహకారం, ప్రభుత్వ సేకరణ, సాంకేతిక అడ్డంకులను తొలగించుకోవడం.. వంటి 14 అంశాలు ఉన్నాయి. దాంతోపాటు పెట్టుబడుల్ని ప్రోత్సహించడానికి ఇరు పక్షాలు నిబంధనల్ని సడలించాల్సి ఉంటుంది. 

న్యాయమైన, సమానత్వంతో కూడిన వాణిజ్యానికి ఈ ఒప్పందం నిదర్శనమని ప్రధాని మోదీ అన్నారు. ‘‘డిజిటల్‌ ట్రేడ్‌, బ్యాంకింగ్‌, ఆర్థిక సేవలు, ఫార్మా వంటి విభిన్న రంగాల్లో ఆవిష్కరణలు, పరిశోధనలకు ఈఎఫ్‌టీఏ దేశాలు నాయకత్వం చూపుతాయి. భారత్‌-ఈఎఫ్‌టీఏ వాణిజ్య, ఆర్థిక ఒప్పంద ప్రక్రియలో కీలకంగా వ్యవహరించిన, దీనిపై సంతకాలు చేసిన వారికి శుభాకాంక్షలు. గత పదేళ్లలో భారత్‌ ఆర్థిక వ్యవస్థ గణనీయమైన వృద్ధి సాధించింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో 11వ స్ధానం నుంచి ఐదో స్థానానికి చేరుకుంది. భారత్‌ను ప్రపంచంలో మూడో ఆర్థిక వ్యవస్థగా నిలబెట్టడమే మా తదుపరి లక్ష్యం’’ అని ప్రధాని తెలిపారు. 

ఈఎఫ్‌టీఏలో ఐర్లాండ్‌, లైక్టన్‌స్టైన్‌, నార్వే, స్విట్జర్లాండ్‌ సభ్య దేశాలుగా ఉన్నాయి. ఇవి ఐరోపా సమాఖ్యలో భాగం కాదు. స్వేచ్ఛా వాణిజ్యాన్ని ప్రోత్సహించేందుకు ఏర్పాటైన సమాఖ్య. కెనడా, చిలీ, చైనా, మెక్సికో, కొరియా వంటి 40 భాగస్వామ్య దేశాలతో ఈఎఫ్‌టీఏ ఇప్పటివరకు 29 స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు చేసుకుంది. ఈఎఫ్‌టీఏ దేశాలకు భారత్‌ ఎగుమతులు 2021-22లో 1.74 బిలియన్‌ డాలర్లుగా ఉండేవి. 2022-23 నాటికి అవి 1.92 బిలియన్‌ డాలర్లకు చేరాయి. ఇక ఆ దేశాల నుంచి దిగుమతులు 25.5 బిలియన్‌ డాలర్ల నుంచి 16.74 బిలియన్‌ డాలర్లకు తగ్గాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని