చ‌దువుకునే పిల్ల‌లు ఆర్ధిక విష‌యాలు తెలుసుకోవ‌డం మంచిదేనా!

డ‌బ్బు, పెట్టుబ‌డుల‌ విష‌యంలో పిల్ల‌ల‌కు క‌నీస ప‌రిజ్ఞానం లేక‌పోవ‌డం మంచిది కాదు.

Published : 21 Mar 2022 12:56 IST

భార‌త్ క‌రిగిపోతున్న సంస్కృతులు, విభిన్న జాతుల కేంద్రంగా ఉంది. ప్ర‌తి సంస్కృతికి డ‌బ్బుతో ప్ర‌త్యేక‌మైన సంబంధం ఉంటుంది. సామూహిక వ్య‌వ‌హారాలే కాకుండా, వ్య‌క్తిగ‌త అనుభ‌వాలు, సామాజిక‌,  మాన‌సిక‌, చారిత్ర‌క‌, కుటుంబ‌ప‌ర‌మైన కార్య‌క‌లాపాల్లో డ‌బ్బు ప్ర‌ధాన పాత్ర పోషిస్తుంది. కానీ ఆర్ధిక విద్యలో భార‌త్ ఇప్ప‌టికీ త‌క్కువ స్థాయిలోనే ఉంది. భార‌త్‌లో విద్యార్ధులు చ‌దువుకునే స‌మ‌యంలో ఇటు విద్యా ఖ‌ర్చుల‌కు, అటు వాళ్ల సొంత ఖ‌ర్చుల‌కు త‌ల్లిదండ్రుల మీద ఆధార‌ప‌డ‌తారు. చ‌దువుకోవ‌డానికి, సొంత ఖ‌ర్చుల‌కు ల‌భిస్తున్న డ‌బ్బు ఎక్క‌డ నుండి వ‌స్తుంది, త‌ల్లిదండ్రులకు ఈ డ‌బ్బు ఎలా వ‌స్తుంది, సంపాద‌న‌లో వారి క‌ష్ట‌మెంత‌, ఇటువంటి విష‌యాలు పిల్ల‌లు తెలుసుకోరు. 

త‌ల్లిదండ్రులు డ‌బ్బు విష‌యాలు పిల్ల‌ల‌కు తెలియ‌కుండా జాగ్ర‌త్త‌ప‌డ‌తారు. ఇంటి ఆర్ధిక చ‌ర్చ‌ల్లో పిల్ల‌ల‌ను చేర్చుకోవ‌డం భార‌త‌ సంస్కృతిలో ఉండ‌దు. ఆర్ధిక విష‌యాలు పిల్ల‌ల మ‌న‌స్సుల‌ను ఎక్క‌డ గాయ‌ప‌రుస్తాయోన‌న్న భ‌యం త‌ల్లిదండ్రుల కుంటుంది. దుర‌దృష్ట‌వ‌శాత్తూ పిల్ల‌లు, యువ విద్యార్ధుల కోసం ఆర్ధిక అక్ష‌రాస్య‌త తెలియ‌చెప్ప‌డానికి విద్యా వ్య‌వ‌స్థలో పాఠ్యాంశాలు కూడా లేవు. డ‌బ్బు, పెట్టుబ‌డుల‌ విష‌యంలో పిల్ల‌ల‌కు క‌నీస ప‌రిజ్ఞానం లేక‌పోవ‌డం మంచిది కాదు. ఆర్ధిక విష‌య‌ల్లో కొంత ప‌రిజ్ఞానం ఉంటేనే ఇత‌ర‌ విష‌యాలు పిల్ల‌ల‌కు తెలిసే అవ‌కాశం ఉంది.

దుర‌దృష్ట‌వ‌శాత్తూ, త‌మ ఆర్ధిక స్థితిని ఎలా నిర్వ‌హించాలో పూర్తిగా అర్ధం చేసుకోకుండా యుక్త‌వ‌య‌స్సులోకి ప్ర‌వేశించే అనేక మంది విద్యార్ధులు ఉన్నారు. ఇలాంటి పిల్ల‌లు కొత్త భావ‌న‌లు, ఆలోచ‌న‌ల‌తో వాస్త‌వ ఆర్ధిక స‌మాచారాలు తెలియ‌క తిక‌మ‌క‌కు గుర‌వుతారు. అవ‌గాహ‌న లేని యుక్త వ‌య‌స్కులు పెద్ద‌య్యాక అనాలోచిత ఆర్ధిక నిర్ణయాలు తీసుకునేలా పెరుగుతారు. మీ పిల్ల‌ల‌తో వ్య‌క్తిగ‌త ఆర్ధిక వ్య‌వ‌హారాలు చ‌ర్చించ‌డం వ‌ల్ల పెద్దయ్యాక వారికి త‌న‌ఖాలు, ప‌న్ను ప్ర‌యోజ‌నాలు, పెట్టుబడుల గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్ల‌లేదు, వాళ్లే అనుభ‌వ‌పూర్వ‌కంగా తెలుసుకుంటారు.

భార‌త్‌లో స్త్రీల‌కు పురుషుల కంటే ఆర్ధిక విష‌యాల్లో త‌క్కువ ప్ర‌వేశం ఉంది. ఖ‌ర్చు చేసే సామ‌ర్ధ్యం కూడా త‌క్కువే. డ‌బ్బుకు సంబంధించిన ఈ లింగ‌ప‌ర‌మైన భేదాల‌ను ప‌రిష్క‌రించ‌డం అంత సుల‌భం కాదు. అయితే, లింగంతో సంబంధం లేకుండా పిల్ల‌ల‌కు ఆర్ధికంగా విద్య‌ను అందించ‌డం, ఆర్ధిక సాధికార‌త క‌ల్పించ‌డం ముందుగానే ప్రారంభించాలి. ఇంటిలో పెళ్ల‌యిన ఆడ‌వారికి ఇంటి ఖ‌ర్చుల‌ను నిర్వహించడంలో కొద్దిగా అనుభ‌వం ఉంది కానీ పిల్ల‌ల‌కు లేదు. పిల్ల‌లు కూడా ఈ ఖ‌ర్చులు తెలుసుకునేలాగా చేయాలి.

50-30-20 నియ‌మం పిల్ల‌లు తెలుసుకునేలా చేయాలి. ఇది ఏమిటంటే మీ ఆదాయాన్ని 3 భాగాలుగా విభ‌జించాలి, అందులో 50% కుటుంబ అవ‌స‌రాల‌కు, 30% అవసరమైన కోరిక‌ల‌కు, 20% నేరుగా పొదుపుకు కేటాయించాలి. ఈ విష‌యాలు చిన్న వ‌య‌స్సులోనే పిల్ల‌ల‌కు నేర్పించాలి. ఇది మీ పిల్ల‌ల‌ను ఆర్ధికంగా క్ర‌మ‌శిక్ష‌ణ‌తో కూడిన వివేక‌వంతులను చేస్తుంది.

ఈ ఆధునిక కాలంలో ఫిన్‌టెక్‌లు, వారి సేవ‌ల‌ను ఉప‌యోగించుకోవ‌చ్చు. మీరు సాంప్ర‌దాయ బ్యాంకులో యుక్త‌వ‌య‌స్కుల కోసం పొదుపు ఖాతాలు ప్రారంభించ‌గ‌లిగిన‌ప్ప‌టికీ, ఇంకా యువ‌కుల‌కు అనుకూల‌మైన ప్రీపెయిడ్ కార్డ్‌లు, బ్యాంకింగ్‌తో వ‌చ్చిన అనేక స్టార్ట‌ప్‌లు ఉన్నాయి. మీ పిల్ల‌ల‌కు వ్య‌క్తిగ‌త ఫైనాన్స్‌, మ‌నీ మేనేజ్‌మెంట్ ప్రాథ‌మికాల‌ను నేర్చుకోవ‌డంలో స‌హాయ‌ప‌డే సాంకేతిక‌త ఉన్న‌ప్పుడు, మీ ప్ర‌యోజ‌నం కోసం ఈ సాధ‌నాల‌ను ఉప‌యోగించ‌డం తెలివైన ప‌ని. ఇది ఆర్ధిక విష‌యాల్లో బాధ్య‌తాయుత‌మైన యువ‌కుల‌ను త‌యారుచేస్తుంది.

జీవిత‌కాల ఆర్ధిక నిర్వ‌హ‌ణ‌కు పొదుపు, ముంద‌స్తు పెట్టుబ‌డుల‌పై అవ‌గాహ‌న అవ‌స‌రం. ఆర్ధిక స్వాతంత్య్రం, ఆర్ధిక ప్ర‌ణాళిక ఈ రోజు మెరుగైన జీవితాన్ని గ‌డ‌ప‌డంలో కీల‌క‌పాత్ర పోషిస్తున్న 2 స్తంభాల‌ని నిపుణులు అంటున్నారు. చిన్న వ‌య‌సులోనే పిల్ల‌ల‌కు ఆర్ధిక విష‌యాల‌పై పూర్తి అవ‌గాహ‌న క‌ల్పించ‌డం, త‌ర్వాత జీవితంలో స‌రైన ఆర్ధిక నిర్వ‌హ‌ణ‌ను నిర్వాహించుకునేలా చేయ‌డం చాలా అవ‌స‌రం. గుణ‌పాఠాల‌నేవి ఆర్ధిక విష‌యాల‌లోనే ఎక్కువ జ‌రుగుతాయి, కాబట్టి ఆర్ధిక విష‌యాల‌పై చిన్న‌ప్ప‌టినుండి అనుభ‌వం ఉండాల్సిందేన‌ని నిపుణుల మాట‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని