గ‌తంలో చేయించుకున్న జీవిత బీమా ప్ర‌స్తుత కాలానికి స‌రిపోతుందా?

ఒక వ్య‌క్తి త‌న‌పై ఆధార‌ప‌డే వారికి కొన్ని అద‌న‌పు బీమా తీసుకోవ‌డం మంచిది.

Updated : 08 Mar 2022 19:28 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: గ‌తంలో జీవిత బీమాపై వ్య‌క్తుల‌కు అవ‌గాహ‌న త‌క్కువ ఉండేది. సొంతంగా ఏ పాల‌సీ తీసుకోవాలి అనేది తెలిసేదికాదు. బీమా ఏజెంట్‌ చెప్పిన పాల‌సీని తీసుకుని స‌రిపెట్టుకునేవారు. ఏజెంట్‌తో మొహ‌మాటానికి పోయి ఏదో ఒక పాల‌సీ తీసుకునేవారు. దీనివల్ల ఆ పాల‌సీ ఇప్ప‌టి కాల ప‌రిస్థితికి స‌రిపోద‌నే విష‌యం మెల్ల‌గా తెలిసివ‌చ్చేది.

ఇప్పుడు ఆన్‌లైన్‌లో వివిధ స‌మాచార వేదిక‌ల ద్వారా జీవిత బీమాపై చాలా విలువైన స‌మాచారం ప్ర‌తి ఒక్కరికీ చేరుతోంది. చాలా మందికి బీమా పాల‌సీల‌పై చైత‌న్యం వ‌చ్చింది. జీవిత బీమా పాల‌సీలు ఏజెంట్ అవ‌స‌రం లేకుండానే చౌక‌గా ఆన్‌లైన్‌లో తీసుకోవ‌చ్చు.

ఎవ‌రైనా బీమా చేయించుకోవ‌డానికి ముఖ్య కార‌ణం వారు అక‌స్మిక మ‌ర‌ణం చెందితే.. త‌ర్వాత భార్య, పిల్ల‌లు, త‌న‌పై ఆధార‌ప‌డిన త‌ల్లిదండ్రులు ఆర్ధిక ఇబ్బందులు ప‌డ‌కూడ‌దు అనే బ‌ల‌మైన కార‌ణంతోనే. కానీ, బీమా చేయించుకునేటప్పుడు త‌న ఆర్థిక ప‌రిస్థితి త‌క్కువ స్థాయిలో ఉండ‌టం వల్లనో.. భ‌విష్య‌త్తు ఖ‌ర్చుల‌ను స‌రిగ్గా అంచ‌నా వేయ‌లేక‌పోవ‌డమనే కారణం చేతనో బీమా త‌క్కువ ఉండే అవ‌కాశాలున్నాయి. ఇటువంటి త‌క్కువ స్థాయి బీమా చివ‌రి వ‌ర‌కు కొన‌సాగిస్తే అనుకోని విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో అత‌డిపై ఆధార‌ప‌డిన కుటుంబం ఇబ్బందుల పాల‌వుతుంది.

ఒక‌రి కెరీర్ ప్రారంభంలో కొనుగోలు చేసిన పాల‌సీలో ఫీచ‌ర్లు అన‌వ‌స‌రంగా ఉండ‌ట‌మే కాకుండా, పాల‌సీదారు త‌న ఉద్యోగ‌ జీవితంలో మ‌ధ్య‌లోకి వ‌చ్చే స‌మ‌యానికి హామీ బీమా మొత్తం ఏ మాత్రం స‌రిపోదు. పాల‌సీదారు మ‌ర‌ణించిన త‌ర్వాత కుటుంబానికి వ‌చ్చిన సొమ్ములు ఏ మాత్రం స‌రిపోవు. కాబ‌ట్టి కెరీర్‌లోని వివిధ ద‌శ‌ల‌లో పాల‌సీదారులు భ‌విష్య‌త్తు అవ‌స‌రాల‌ను విశ్లేషించ‌డం చాలా మంచిది.

20 సంవ‌త్స‌రాల క్రితం మ‌ధ్య ఆదాయ త‌ర‌గ‌తిలో ఉన్న వ్య‌క్తికి త‌గిన ర‌క్ష‌ణ కోసం రూ. 5-10 ల‌క్ష‌ల మొత్తంతో జీవిత బీమా పాల‌సీ ప‌రిగ‌ణ‌లోకి తీసుకునేవారు. కానీ, నేడు పాలసీదారు మ‌ర‌ణిస్తే బ‌కాయిలు ఉన్న రుణ బాధ్య‌త‌లు తీర్చ‌డానికి కూడా ఈ మొత్తం స‌రిపోదు. కొవిడ్ ప‌రిస్థితుల‌లో త‌మ కుటుంబ స‌భ్యుల‌ను కోల్పోయిన వారి ఇటీవ‌ల అనుభ‌వాలు జీవిత బీమా ఆలోచ‌న‌పై అనేక ప్ర‌శ్న‌ల‌ను లేవ‌నెత్తాయి. సంపాదించే వ్య‌క్తి మ‌ర‌ణం త‌ర్వాత చాలా మంది బాధితులు, క్రెడిట్ కార్డ్ బ‌కాయిలు లేదా  ఇంటి ప్రాప‌ర్టీ లోన్  తిరిగి చెల్లించ‌లేక కుటుంబాన్ని పూర్తిగా నిస్స‌హాయ స్థితిలోకి నెట్టిన సంద‌ర్భాలున్నాయి.

వ్య‌క్తులు పాత పాల‌సీని కొన‌సాగిస్తూ త‌దుప‌రి 15 సంవ‌త్స‌రాల పాటు బాధ్య‌త‌ల‌ను క‌వ‌ర్ చేయ‌డానికి ఆన్‌లైన్‌లో ట‌ర్మ్ ప్లాన్‌ను కొనుగోలు చేయ‌డం మంచిది. ట‌ర్మ్ బీమాలో త‌క్కువ ప్రీమియానికి ఎక్కువ క‌వ‌రేజ్ పొందొచ్చు. మీ వార్షిక ఆదాయానికి కనీసం 10-15 రెట్లు బీమా హామీ ఉండేలా చూసుకోవాలి. మీకు 60 ఏళ్లు వచ్చే దాక పాలసీని కొనసాగించండి.

మార్కెట్లో పిల్ల‌ల పాల‌సీల‌ను కోసం ప్రయత్నించకండి. వీటిలో ప్రత్యేకతలు ఉండవు. ఎండోమెంట్, హోల్ లైఫ్, యులిప్, మనీ బ్యాక్ లాంటి పథకాలన్నింటిలో రాబడి తక్కువ, బీమా హామీ కూడా తక్కువే. వీటి నుంచి దూరంగా ఉండడం మేలు. ఏదేమైనా జీవిత బీమా ఆవ‌శ్య‌క‌త గురించి, భ‌విష్య‌త్తు ఖ‌ర్చుల గురించి ఎవ‌రికివారే వ్య‌క్తిగ‌తంగా తెలుసుకుని త‌ద‌న‌గుణంగా న‌డుచుకోవాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని