Jack Dorsey: ఎలాన్‌ మస్క్‌ చేతికి ట్విటర్‌.. జాక్‌ డోర్సే స్పందన ఏంటంటే..!

ప్రముఖ మైక్రోబ్లాగింగ్‌ సైట్‌ ‘ట్విటర్‌’ను.. విద్యుత్ కార్ల సంస్థ టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ కొనుగోలు చేయడంపై సామాజిక మాధ్యమాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ట్విటర్ సహా వ్యవస్థాపకుడు,

Updated : 26 Apr 2022 11:38 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ మైక్రోబ్లాగింగ్‌ సైట్‌ ‘ట్విటర్‌’ (Twitter) ను.. విద్యుత్తు కార్ల సంస్థ టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) కొనుగోలు చేయడంపై సామాజిక మాధ్యమాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ట్విటర్ సహా వ్యవస్థాపకుడు, కంపెనీ మాజీ సీఈఓ జాక్‌ డోర్సే (Jack Dorsey) ఈ కొనుగోలుకు పూర్తి మద్దతు ప్రకటించారు. సమస్యకు ఏకైక పరిష్కారం మస్క్‌ మాత్రమే అని పేర్కొన్న డోర్సే.. ట్విటర్‌ను ఆయన కొనుగోలు చేయడం సరైన ముందడుగు అన్నారు. ఈ మేరకు వరుస ట్వీట్లతో తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

‘‘ట్విటర్‌ అంటే నాకు చాలా ప్రేమ. అయితే, ఒక కంపెనీగా ట్విటర్‌ ఎల్లప్పుడూ నాకున్న ఏకైక సమస్య కూడా. ప్రస్తుతం ఇది వాల్‌స్ట్రీట్‌ (పబ్లిక్‌ ఇష్యూలను ఉద్దేశిస్తూ) యాజమాన్యం చేతుల్లో ఉంది. దాన్నుంచి బయటకు తీసుకురావడం కంపెనీ భవిష్యత్తుకు సరైన ముందడుగు’’ అని డోర్సే ట్విటర్‌లో పేర్కొన్నారు. ట్విటర్‌ను కొనుగోలు చేసిన మస్క్‌.. దాన్ని ప్రైవేటు కంపెనీగానే ఉంచుతానని ప్రకటించిన విషయం తెలిసిందే. అంటే ఇకపై ఇది పబ్లిక్ ఇష్యూ లిస్టింగ్‌లోకి రాదు. దీన్ని ఉద్దేశిస్తూనే డోర్సే ట్వీట్ చేశారు.

అంతేగాక, ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ట్విటర్‌కు ఏకైక పరిష్కారం మస్కే అని డోర్సే ఈ సందర్భంగా అన్నారు. ‘‘వాస్తవంగా ట్విటర్‌ను ఎవరైనా కొనుగోలు చేస్తారని, దాన్ని నడిపిస్తారంటే నేను నమ్మలేను. ఇది ఒక కంపెనీలా కాకుండా ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగా అది ఉండాలని కోరుకుంటా. అయితే, ఒక సంస్థగా ట్విటర్‌ ఎదుర్కొంటున్న సమస్యలకు ఏకైక పరిష్కారం ఎలాన్‌ అని నేను నమ్ముతున్నా. విశ్వసనీయ, సమ్మిళిత వేదికగా దీన్ని మార్చాలనుకుంటున్న ఎలాన్‌ లక్ష్యం సరైందే. ప్రస్తుత సీఈఓ పరాగ్‌ అగర్వాల్ లక్ష్యం కూడా ఇదే. అందుకే, నేను ఆయనను ఎంచుకున్నా. ఒక అసాధ్య పరిస్థితి నుంచి కంపెనీని బయటపడేసిన మస్క్‌, పరాగ్‌కు కృతజ్ఞతలు. ట్విటర్‌ను మస్క్‌ కొనుగోలు చేయడమే సరైన మార్గం అని నేను హృదయ పూర్వకంగా నమ్ముతున్నా’’ అని డోర్సే రాసుకొచ్చారు.

ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన ఎలాన్‌ మస్క్‌.. రెండు వారాల క్రితమే ట్విటర్లో 9.2శాతం వాటాను కొనుగోలు చేశారు. ఆ తర్వాత కంపెనీని పూర్తిగా కొనుగోలు చేస్తానని ఆఫర్‌ కూడా ఇచ్చారు. దీనిపై కొన్ని రోజులుగా మస్క్‌తో ట్విటర్‌ బోర్డు చర్చలు జరిపింది. తాజాగా దాదాపు 44 బిలియన్‌ డాలర్లకు ఒప్పందం కుదిరినట్లు ప్రకటించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని