E-Luna: కైనటిక్‌ ఇ-లూనా వచ్చేసింది.. సింగిల్‌ ఛార్జ్‌తో 110km

E-Luna: కైనటిక్‌ ఇ-లూనాను కైనటిక్‌ గ్రీన్‌ సంస్థ లాంచ్‌ చేసింది. దీని ధరను రూ.69 వేలుగా నిర్ణయించింది. సింగిల్‌ ఛార్జ్‌తో 110 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది.

Published : 08 Feb 2024 02:03 IST

E-Luna is back | ఇంటర్నెట్‌ డెస్క్‌: కైనటిక్‌ లూనా కొత్త అవతారంలో తిరిగి మార్కెట్లోకి అడుగుపెట్టింది. దాదాపు ఐదు దశాబ్దాల క్రితం దేశీయ రోడ్లపై పరుగులు ప్రారంభించి కాలగర్భంలో కలిసిపోయిన ఈ మోపెడ్‌.. ఇ-లూనా (E-Luna) రూపంలో రీఎంట్రీ ఇచ్చింది. కైనటిక్‌ గ్రీన్‌ (Kinetic Green) కంపెనీ దీన్ని అధికారికంగా ఫిబ్రవరి 7న ఆవిష్కరించింది. దీని ధర రూ.69,990 నుంచి ప్రారంభమవుతుంది.

కైనటిక్‌ ఇ-లూనా (E-Lun) ఎక్స్‌1, ఎక్స్‌2 పేరుతో రెండు వేరియంట్లలో లభిస్తుంది. ఇందులో ఎక్స్‌1 వేరియంట్‌ ధర రూ.69,990 (ఎక్స్‌ షోరూమ్‌, దిల్లీ) కాగా.. ఎక్స్‌2 వేరియంట్‌ ధరను రూ.74,990గా కంపెనీ నిర్ణయించింది. ఎరుపు, నీలం, పసుపు, ఆకుపచ్చ, నలుపు రంగుల్లో లభిస్తుంది. ఎక్స్‌2 వేరియంట్లో 2kWh బ్యాటరీ ఇచ్చారు. సింగిల్‌ ఛార్జ్‌పై 110కి.మీ.  ప్రయాణించొచ్చు. ఎక్స్‌1 వేరియంట్‌లో 1.7kWh బ్యాటరీ ఇచ్చారు.  దీంతో సింగిల్‌ ఛార్జ్‌పై 80 కిలోమీటర్లు ప్రయాణం చేయొచ్చు. స్వాపబుల్‌ బ్యాటరీ సదుపాయం ఉంది. దీని టాప్‌ స్పీడ్ 50 కిలోమీటర్లు. ఛార్జింగ్‌ టైమ్‌ నాలుగు గంటలు.

190km రేంజ్‌తో ఓలా కొత్త స్కూటర్‌.. ఇక 8 ఏళ్ల బ్యాటరీ వారెంటీ

ఇతర సదుపాయాల విషయానికొస్తే.. ఇ-లూనాలో టెలీస్కోపిక్‌ ఫోర్క్‌, డ్యూయల్‌ షాక్‌ అబ్జార్బర్‌ సస్పెన్షన్‌, డ్రమ్‌ బ్రేక్స్‌ ఇచ్చారు. ఎల్‌సీడీ ఇన్‌స్ట్రుమెంట్‌ కన్సోల్‌, సైడ్‌స్టాండ్‌ సెన్సర్‌, యూఎస్‌బీ ఛార్జింగ్‌ వంటి సదుపాయాలు ఉన్నాయి. బ్యాగ్‌ క్యారీ చేయడానికి హుక్‌ ఇస్తున్నారు. లగేజీ తీసుకెళ్లేందుకు వీలుగా వెనక సీటు తొలగించుకునే సదుపాయం కూడా ఉంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో లక్ష వాహనాలను విక్రయించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. రూ.500 చెల్లించి కైనటిక్‌ గ్రీన్‌ వెబ్‌సైట్‌లో ఇ-లూనాను బుక్‌ చేసుకోవచ్చు. ప్రస్తుతం పెట్రోల్‌ వేరియంట్లో దొరుకుతున్న టీవీఎస్‌ ఎక్సెల్‌కు కైనటిక్‌ లూనా పోటీనివ్వనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని