GDP: 2023లో భారత వృద్ధిరేటు 6.7%.. అంచనాల్లో మార్పుచేయని మూడీస్‌

GDP: ఎగుమతులు తగ్గే అవకాశం ఉన్నప్పటికీ.. బలమైన దేశీయ డిమాండ్ వల్ల 2023లో మెరుగైన వృద్ధి రేటు నమోదవుతుందని మూడీస్‌ అంచనా వేసింది.

Published : 09 Nov 2023 19:04 IST

దిల్లీ: 2023 భారత ఆర్థిక వృద్ధిరేటు అంచనాలను ఎలాంటి మార్పు లేకుండా ‘మూడీస్‌ ఇన్వెస్టర్స్‌ సర్వీస్‌ (Moody's Investors Service)’ 6.7 శాతం వద్ద స్థిరంగా కొనసాగించింది. స్థిర వృద్ధి కొనసాగడానికి బలమైన దేశీయ గిరాకీ దోహదం చేస్తుందని వివరించింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఉన్న బలహీనతల కారణంగా ఎగుమతులు మాత్రం ఆశించిన స్థాయిలో ఉండకపోవచ్చునని అంచనా వేసింది.

2023లో భారత జీడీపీ (GDP) 6.7 శాతంగా, 2024లో 6.1 శాతంగా, 2025లో 6.3 శాతంగా ఉంటుందని మూడీస్‌ అంచనా వేసింది. జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో భారత ఆర్థిక వ్యవస్థ 7.8 శాతం వృద్ధి రేటు (Growth Rate)ను నమోదు చేసిన విషయం తెలిసిందే. అంతకు ముందు త్రైమాసికంలో ఇది 6.1 శాతంగా నమోదైంది. జూన్‌లో నమోదైన బలమైన వృద్ధి.. జులై- సెప్టెంబర్‌ త్రైమాసికంలోనూ కొనసాగినట్లుగా కీలక గణాంకాలు వెల్లడిస్తున్నాయని మూడీస్‌ (Moody's Investors Service) తెలిపింది. బలమైన జీఎస్‌టీ వసూళ్లు, వాహన విక్రయాల్లో పెరుగుదల, రుణ వితరణలో రెండంకెల వృద్ధి పట్టణ ప్రాంతాల్లో బలమైన గిరాకీని సూచిస్తున్నాయని తెలిపింది. కానీ, గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం వర్షాభావ పరిస్థితుల వల్ల డిమాండ్‌ బలహీనంగా ఉందని పేర్కొంది.

ఆగస్టులో 6.8 శాతంగా నమోదైన రిటైల్‌ ద్రవ్యోల్బణం.. సెప్టెంబరులో 5 శాతానికి దిగొచ్చిన విషయం తెలిసిందే. ఇది ఆర్‌బీఐ (RBI) లక్ష్యిత పరిధి అయిన ఆరు శాతానికి లోపే ఉన్నప్పటికీ.. అధిక ఇంధన, ఆహార ధరలు, ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఆర్‌బీఐని అప్రమత్తం చేస్తున్నాయని మూడీస్‌ వివరించింది. కేంద్ర బ్యాంకు గత నాలుగు ద్వైమాసిక సమీక్షల్లో రెపోరేటును 6.5 శాతం వద్ద యథాతథంగా కొనసాగించిన విషయం తెలిసిందే. రిటైల్‌ ద్రవ్యోల్బణ లక్ష్యాన్ని నాలుగు శాతంగా నిర్దేశించుకున్నట్లు అక్టోబర్‌ సమీక్షలో ఆర్‌బీఐ తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని