Go First: గోఫస్ట్‌ దివాలా ప్రక్రియ పిటిషన్‌కు ఎన్‌సీఎల్‌టీ గ్రీన్‌ సిగ్నల్‌

Go First crisis: గోఫస్ట్‌ దాఖలు చేసిన దివాలా పిటిషన్‌కు ఎన్‌సీఎల్‌టీ ఆమోదం తెలిపింది. పరిష్కారకర్తను నియమించింది. చెల్లింపులపైనా మారటోరియం విధించింది.

Published : 10 May 2023 13:34 IST

దిల్లీ: ప్రముఖ విమానయాన సంస్థ గోఫస్ట్‌ (Go First) దాఖలు చేసిన స్వచ్ఛంద దివాలా (Insolvency) పరిష్కార ప్రక్రియ కోసం దాఖలు చేసిన పిటిషన్‌ను నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌ (NCLT) స్వీకరించింది. జస్టిస్‌ రామలింగం సుధాకర్‌, జస్టిస్‌ ఎల్‌ఎన్‌ గుప్తా నేతృత్వంలోని బెంచ్‌ ఈ మేరకు బుధవారం కీలక ఆదేశాలు వెలువరించింది. దివాలా పరిష్కారకర్తగా (IRP) అభిలాష్‌ లాల్‌కు కంపెనీ నిర్వహణ బాధ్యతలు అప్పగించింది. 

వాడియా గ్రూప్‌నకు చెందిన గోఫస్ట్‌ స్వచ్ఛంద దివాలా పిటిషన్‌పై విచారణ జరిపిన ఎన్‌సీఎల్‌టీ.. మే 4న ఆదేశాలు రిజర్వ్‌ చేసింది. త్వరితగతిన విచారణ జరపాలన్న విజ్ఞప్తి మేరకు తాజాగా తీర్పు వెలువరించింది. గోఫస్ట్‌ చేయాల్సిన చెల్లింపులపై మారటోరియం విధించింది. అలాగే డైరెక్టర్ల బోర్డును సస్పెండ్‌ చేసింది. దివాలా పరిష్కార ప్రక్రియలో ఐఆర్‌పీకి సాయమందించాలని సూచించింది. పరిష్కార ప్రక్రియ సమయంలో ఏ ఒక్క ఉద్యోగినీ తొలగించకూడదని ఆదేశించింది.

ఎన్‌సీఎల్‌టీ తీర్పును గోఫస్ట్ సీఈఓ కౌశిక్‌ కోనా స్వాగతించారు. ఈ ఆదేశాలను ఓ మైలురాయిగా అభివర్ణించారు. అమెరికాకు చెందిన ప్రాట్‌ అండ్‌ విట్నీ సంస్థ సకాలంలో ఇంజిన్లు సరఫరా చేయకపోవడం వల్ల తమ విమానాలు నిలిచిపోయాయని, తద్వారా ఆర్థికంగా నష్టం తలెత్తిందని గోఫస్ట్‌ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నెల ఆరంభంలో కార్యకలాపాలు పూర్తిగా నిలిపేసే సమయానికి 28 విమానాలు నేలపైనే ఉన్నాయి. మరోవైపు ఇటీవలే తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు టికెట్ల విక్రయాలు నిలిపివేయాలని డీజీసీఏ ఇటీవల గోఫస్ట్‌ను ఆదేశించింది. తాజాగా సర్వీసులను మే 19 వరకు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని