లాభాలకే అవకాశం

దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈ వారం రాణించే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గత శుక్రవారం సూచీలు భారీగా నష్టపోయినా, అది తాత్కాలికమేనని.. సూచీలు అధిక స్థాయులకు చేరాయనే భావనతో, లాభాల స్వీకరణకు దిగడం వల్లే ఆ పరిస్థితి ఏర్పడిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

Published : 06 May 2024 02:17 IST

స్టాక్‌ మార్కెట్‌
ఈ వారం
దేశీయంగా ప్రతికూలతలు లేవు
అంతర్జాతీయ ఉద్రిక్తతలూ చల్లబడుతున్న నేపథ్యం
ఔషధ, చమురు షేర్లు రాణించొచ్చు
ఐటీ, వాహన స్క్రిప్‌లకు ప్రతికూలతలు
విశ్లేషకుల అంచనాలు

దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈ వారం రాణించే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గత శుక్రవారం సూచీలు భారీగా నష్టపోయినా, అది తాత్కాలికమేనని.. సూచీలు అధిక స్థాయులకు చేరాయనే భావనతో, లాభాల స్వీకరణకు దిగడం వల్లే ఆ పరిస్థితి ఏర్పడిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇప్పుడు దేశీయంగా ప్రతికూల వార్తలేమీ లేకపోవడం, అంతర్జాతీయంగానూ ఉద్రిక్తతలు చల్లబడుతుండటం మన సూచీలకు కలిసొస్తుందని చెబుతున్నారు. అకస్మాత్తుగా ఏమైనా ప్రతికూలతలు ఏర్పడితేనే నష్టాలు ఉంటాయని వివరిస్తున్నారు. బ్యాంకుల షేర్ల ధరలు ముఖ్యంగా ప్రైవేటు బ్యాంకులవి ఆకర్షణీయంగా ఉన్నాయని అంటున్నారు. ఇటీవలి కష్టాల నుంచి ఐటీ స్టాక్స్‌ త్వరలోనే బయటపడతాయని పేర్కొంటున్నారు. ముడిచమురు ధరల మంట తగ్గుతున్నందున, చమురు మార్కెటింగ్‌ కంపెనీలకు ఊరట లభించనుంది. వివిధ రంగాలపై విశ్లేషకులు ఏమంటున్నారంటే..

ఇటీవలి సానుకూల సంకేతాల మధ్య ఔషధ కంపెనీలు రాణించొచ్చని అంచనా.  లుపిన్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, అబాట్‌ ఇండియా, అలెంబిక్‌ ఫార్మా, సిప్లా, పిరమాల్‌ ఫార్మా ఈవారం ఫలితాలు ప్రకటించనున్నాయి.

 టెలికాం షేర్లపై అప్రమత్తత కొనసాగొచ్చు. ఇటీవలి నెలల్లో చందాదార్ల సంఖ్యలో వచ్చిన మార్పులు ప్రభావం చూపుతాయి. దీర్ఘకాలంలో టెలికాం షేర్లు పరిమితంగానే పెరగొచ్చు.నీ బ్యాంకు షేర్లు సానుకూలంగా చలించొచ్చు. బ్యాంక్‌ నిఫ్టీకి 48,500 - 49,000 శ్రేణిలో డిమాండ్‌ లభించొచ్చు. తక్కువ ధరల్లో ఈ షేర్లు కొనడం మంచి వ్యూహమని ఒక బ్రోకరేజీ పేర్కొంటోంది.  
సిమెంటు షేర్లు ఒక శ్రేణికి లోబడి చలించొచ్చు. దిగ్గజ కంపెనీలన్నీ గిరాకీ వృద్ధి మందగమనంలో ఉందని ప్రకటించడమే ఇందుకు నేపథ్యం.

  • లోహ కంపెనీల షేర్లలో సానుకూల చలనాలు కనిపించొచ్చు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలోనూ దేశీయంగా, అమెరికాలోనూ మూలధన వ్యయాలు జరుగుతున్నందున ఉక్కుకు గిరాకీ స్థిరంగా ఉండడం కలిసొచ్చే అంశం.  
  • ఐటీ షేర్లు నష్టపోయే అవకాశం ఉంది. దిగ్గజ కంపెనీలకు ఆర్డర్లు బాగానే ఉన్నా, అంతర్జాతీయ పరిస్థితుల దృష్ట్యా ఇప్పటికీ ఈ షేర్లపై అప్రమత్తత కనపడుతోంది.
  • చమురు కంపెనీల షేర్లు రాణించొచ్చు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెద్దగా పెరగకపోవచ్చన్న అంచనాలు ఇందుకు నేపథ్యం. అమెరికాలో వడ్డీరేట్లు ఈ ఏడాదిలో ఒక్కసారే తగ్గించవచ్చన్న అంచనాలు బలపడుతున్నందున, ఈ ప్రభావం చమురు గిరాకీపై కనపడనుంది.
  • యంత్ర పరికరాల షేర్లు రాణించొచ్చు. ఎన్నికల తరవాత కొత్త ప్రభుత్వం నుంచి ఆర్డర్లు వస్తాయనే అంచనాలే ఇందుకు కారణం. ఎల్‌అండ్‌టీ, ఏబీబీ ఇండియా, పాలీక్యాబ్‌, సీజీ పవర్‌ కంపెనీలు ఫలితాలు వెల్లడించాల్సి ఉంది.  
  • వాహన షేర్లు సానుకూల ధోరణిలో పరిమిత శ్రేణిలో ట్రేడవవచ్చు. హీరో, టీవీఎస్‌, భారత్‌ ఫోర్జ్‌ కంపెనీలు ఈవారం ఫలితాలు ప్రకటించనున్నాయి. ప్రధాన సూచీలతో పాటే ఈ షేర్లలోనూ లాభాల స్వీకరణకూ అవకాశం ఉంది. ఆటో సూచీకి 22,000 వద్ద మద్దతు, 23,000 పాయింట్ల వద్ద నిరోధం ఎదురవుతుందని అంచనా.మార్కెట్‌ అంచనాలను ఎక్కువ కంపెనీలు అందుకోని నేపథ్యంలో, ఎఫ్‌ఎమ్‌సీజీ షేర్లపై అప్రమత్తత కొనసాగొచ్చు. గోద్రేజ్‌ కన్జూమర్‌ ప్రోడక్ట్స్‌, మారికో ఫలితాల కోసం మదుపర్లు వేచిచూస్తున్నారు.

నేటి బోర్డు సమావేశాలు: గోద్రేజ్‌ కన్జూమర్‌ ప్రోడక్ట్స్‌, లుపిన్‌, ఇండియన్‌ బ్యాంక్‌, మారికో, రూట్‌ మొబైల్‌, హ్యాపియెస్ట్‌ మైండ్‌ టెక్నాలజీస్‌, ముత్తూట్‌ మైక్రోఫిన్‌, కార్‌ట్రేడ్‌ టెక్‌, సువెన్‌ లైఫ్‌ సైన్సెస్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని