Cyber scam: కొరియర్‌ స్కామ్‌.. లక్షల్లో దోపిడీ.. ఎలా జరుగుతున్నాయంటే?

cyber scam: సైబర్‌ నేరగాళ్లు రోజుకో వేషం మార్చి దోచేస్తున్నారు. కొత్తగా కొరియర్‌ పేరుతో మోసాలకు తెరతీస్తున్నారు. అయితే వీరు ఎలా డబ్బును దోచుకుంటున్నారు. వాటి నుంచి ఎలా జాగ్రత్తగా ఉండాలో చూద్దాం..

Published : 29 Jun 2023 19:14 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: సైబర్‌ మోసాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. సైబర్‌ నేరగాళ్లు పూటకో వేషం మార్చి దోచుకుంటున్నారు. కొత్త కొత్త పంథాలు అనుసరిస్తూ.. లక్షల్లో ఎగరేసుకుపోతున్నారు. వీడియోకు లైక్‌ చేస్తే డబ్బులొస్తాయని.. లింక్‌పై క్లిక్‌ చేస్తే ప్రైజ్‌ గెలుచుకోవచ్చంటూ.. ఇన్నాళ్లూ రకరకాలుగా మోసాలకు పాల్పడిన వారు.. ఇప్పుడు కొరియర్‌ పేరిట (courier scam) కొత్త తరహా మోసాలకు దిగుతున్నారు. ఇంతకీ ఏమిటీ మోసం? ఎలా చేస్తున్నారు?

ఇటీవల పీహెచ్‌డీ చదువుతున్న బెంగళూరుకు చెందిన విద్యార్థి ఒకరు ఈ కొరియర్‌ స్కామ్‌కు బలయ్యాడు. ఏకంగా రూ.1,34,650 పోగొట్టుకున్నాడు. ‘నా పేరున మాదకద్రవ్యాలున్న కొరియర్‌ వచ్చిందంటూ కాల్‌ వచ్చింది. సంబంధిత అధికారులకు కాల్‌ కనెక్ట్‌ చేసి వెంటనే స్కైప్‌ కాల్‌ కనెక్ట్‌ కావాలన్నారు. ఆర్‌బీఐ, సీబీఐకి చెందిన కొన్ని పత్రాలను చూపించారు. అలాగే బ్యాంక్‌ సంబంధిత వివరాలు తీసుకొని డబ్బుకట్టాలని తెలిపారు. వారు నార్కోటిక్‌ అధికారులుగా నమ్మించి ‘మత్తుపదార్థాలు పంపిణీ చేస్తావా?’ అంటూ బెదిరించారు. దీంతో భయం వేసి వెంటనే డబ్బు పంపించా’ అంటూ ఆ విద్యార్థి చెప్పుకొచ్చాడు. ఇలాంటి ఘటనలే ఇటీవల కాలంలో తరచూ జరుగుతున్నాయి. అచ్చం ఇలాంటి సంఘటన గురించే జెరోధా (Zerodha) సీఈఓ నితిన్‌ కామత్‌ (Nithin Kamath) సామాజిక మాధ్యమం ద్వారా పంచున్నారు.

అసలేంటీ స్కామ్‌?

ఈ తరహా మోసాలకు పాల్పడుతున్న వాళ్లు ముఖ్యంగా యువకులనే లక్ష్యంగా చేసుకుంటున్నారు. మాదకద్రవ్యాలు లేదా నిషిద్ధ పదార్థాలు ఉన్న కొరియర్లు మీ పేరుతో విదేశాలకు వెళ్తున్నాయని సమాచారం ఇస్తారు. మత్తుపదార్థాలు అని వినగానే చాలా మంది భయపడిపోతారు. సరిగ్గా దీన్నే వారు ఆసరాగా చేసుకుంటున్నారు. పేరూ వివరాలూ ధ్రువీకరించుకున్నాక నార్కోటిక్‌ విభాగానికి చెందిన అధికారులతో మాట్లాడటానికి వీడియోకాల్‌ జాయిన్‌ కావాలని చెబుతారు. ఆ తర్వాత మాటలతో మభ్యపెడతారు. బాధితుల నుంచి ఆధార్‌, బ్యాంక్‌ వివరాలు సేకరిస్తారు. వెరిఫికేషన్‌ కోసం అంటూ నగదు పంపాలని కోరతారు. ఆ సొమ్మంతా తిరిగి అకౌంట్‌కు జమ అవుతుందని నమ్మిస్తారు. ఇక బాధితులు డబ్బులు వేశాక ఇక అంతా గప్‌చుప్‌! ఆ సొమ్ముతో జారుకుంటారు. తొలుత భయపెట్టి.. ఆ భయం నుంచి కోలుకునేలోపే సొమ్మును దోచేస్తున్నారు. ఇలా చాలా మంది పెద్ద మొత్తంలో డబ్బును పోగొట్టుకుంటున్నారు.

అలాంటి కాల్స్‌తో జాగ్రత్త..!

  •  కొరియర్‌ సర్వీసులు లేదా చట్టపరమైన సంస్థల నుంచి ఎటువంటి కాల్స్‌ వచ్చినా వెంటనే సంబంధిత అధికారుల నుంచే వచ్చిందో లేదో అన్న విషయాన్ని ధ్రువీకరించుకోవాలి.
  •  మీకు అందిన సమాచారంలో ఎటువంటి అనుమానం ఉన్నా కొరియర్‌ సంస్థలకే ఫోన్‌ చేయడం మంచిది.
  •  ఆధార్‌, బ్యాంక్‌ నంబర్‌ వంటి వ్యక్తిగత వివరాలు ఫోన్ల ద్వారా ఇతరులతో పంచుకోకపోవడమే ఉత్తమం.
  •  సైబర్‌ మోసగాళ్లు తొందర పెడుతుంటారు. వెంటనే డబ్బులు పంపాలంటూ హెచ్చరిస్తుంటారు. ఇలాంటి సమయంలోనే విచక్షణతో వ్యవహరించండి.
  •  ఒకవేళ మీకు సైబర్‌ దాడి ఎదురైతే 155260 నంబర్‌కు లేదా cybercrime.gov.in.వెబ్‌సైట్‌ ద్వారా ఫిర్యాదు చేయండి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని