Cryptocurreny: క్రిప్టోలూ కుంగుతున్నాయ్‌..బిట్‌కాయిన్‌ విలువ ఎంతుందో తెలుసా?

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధ ప్రభావం స్టాక్‌ మార్కెట్‌తో పాటు క్రిప్టోకరెన్సీలపైనా పడింది. అతిపెద్ద క్రిప్టో అయిన బిట్‌కాయిన్‌ విలువ 40,000 డాలర్ల కింద ట్రేడవుతోంది.....

Updated : 14 Mar 2022 13:00 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధ ప్రభావం స్టాక్‌ మార్కెట్‌తో పాటు క్రిప్టోకరెన్సీలపైనా పడింది. అతిపెద్ద క్రిప్టో అయిన బిట్‌కాయిన్‌ విలువ 40,000 డాలర్ల కింద ట్రేడవుతోంది. అలాగే ఇథేరియం విలువ సైతం భారీగా కుంగింది. దక్షిణ కొరియా అధ్యక్షుడిగా ఎన్నికైన యూన్‌ సుక్‌-యోల్‌.. తన హయాంలో క్రిప్టో అనుకూల నిర్ణయాలు ఉంటాయని ప్రకటించారు. అయినప్పటికీ.. ఈ  వర్చువల్‌ కరెన్సీల విలువలు తీవ్ర ఒడుదొడుకులు ఎదుర్కొంటుండడం గమనార్హం.

ప్రస్తుత విలువ ఇలా..

బిట్‌కాయిన్‌ విలువ గత 24 గంటల్లో 1.38 శాతం, ఇథేరియం విలువ 0.37 శాతం కుంగింది. శుక్రవారం మధ్యాహ్నం 12:14 గంటల సమయంలో బిట్‌కాయిన్‌ 38,612 డాలర్లు, ఇథేరియం 2,575 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అయితే, గత వారం రోజుల విలువను చూస్తే మాత్రం ఇవి కాస్త పుంజుకున్నాయి. గడిచిన 24 గంటల్లో క్రిప్టోమార్కెట్‌ విలువ 3 శాతం కుంగినట్లు నిపుణులు తెలిపారు. ట్రేడింగ్‌ పరిమాణం మాత్రం 17 శాతం పెరగడం గమనార్హం. గత ఏడు రోజుల్లో బిట్‌కాయిన్‌ 38,000-42,000 డాలర్ల మధ్య ఊగిసలాడుతోంది.

ఇతర క్రిప్టోలూ పడ్డాయ్‌..

ఎక్స్‌ఆర్‌పీ విలువ 4శాతం, సొలానా విలువ 2 శాతం, అవలాంచే 4శాతం, పోల్కాడాట్‌ 3శాతం, స్టెల్లార్‌ 3 శాతం, డోజీకాయిన్‌ 1శాతం, శిబుకాయిన్‌ 2 శాతం మేర నష్టపోయాయి. క్రిప్టోలతో పాటు స్టాక్‌, కమొడిటీ మార్కెట్లు కూడా తీవ్ర ఊగిసలాటలో పయనిస్తున్నాయి. గత నెలరోజులగా ద్రవ్యోల్బణం.. ఆ తర్వాత యుద్ధ భయాలు మదుపర్లను కలవరపెడుతున్నాయి. ప్రస్తుతం పరిస్థితులను బట్టి చూస్తే మరికొన్ని రోజుల పాటు ఈ ఒడుదొడుకులు తప్పకపోవచ్చునని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని