Stock Market: నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

Stock Market: ఉదయం 9:23 గంటల సమయంలో సెన్సెక్స్‌ (Sensex) 518 పాయింట్ల నష్టంతో 57,471 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ (Nifty) 159 పాయింట్లు నష్టపోయి 16,940 దగ్గర కొనసాగుతోంది.

Published : 20 Mar 2023 09:35 IST

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు సోమవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:23 గంటల సమయంలో సెన్సెక్స్‌ (Sensex) 518 పాయింట్ల నష్టంతో 57,471 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ (Nifty) 159 పాయింట్లు నష్టపోయి 16,940 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 10 పైసలు పుంజుకొని 82.49 దగ్గర ప్రారంభమైంది. సెన్సెక్స్‌ 30 సూచీలో ఒక్క హెచ్‌యూఎల్‌ మాత్రమే లాభాల్లో ఉంది. టాటా స్టీల్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, టాటా మోటార్స్‌, ఎంఅండ్‌ఎం, ఇన్ఫోసిస్‌, ఎస్‌బీఐ, టీసీఎస్‌, మారుతీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, పవర్‌గ్రిడ్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌ అత్యధికంగా నష్టపోతున్న షేర్ల జాబితాలో ఉన్నాయి.

అమెరికా, చైనా, ఇంగ్లాండ్‌ కేంద్ర బ్యాంకుల వడ్డీ రేట్ల నిర్ణయాలు ఈ వారం కీలకం కానున్నాయి. సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌, ఫస్ట్‌ రిపబ్లిక్‌ బ్యాంక్‌, క్రెడిట్‌ సూయిజ్‌ తాజా పరిణామాలపై మదుపర్లు దృష్టి పెట్టొచ్చు. ఈ బ్యాంకులు కోలుకునేందుకు తీసుకునే చర్యలు ప్రభావం చూపొచ్చు. అధిక ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, వడ్డీ రేట్ల పెంపులు, అంతర్జాతీయ వృద్ధి భయాలతో మార్కెట్లలో ఒడుదొడుకులు కొనసాగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. బ్యాంకింగ్‌ సంక్షోభంపై అమెరికా ఫెడ్‌ చేసే వ్యాఖ్యలపై మదుపర్లు దృష్టి సారించొచ్చు. యూఎస్‌ ఫ్యూచర్స్‌ ప్రస్తుతం సానుకూలంగా ట్రేడవుతున్నాయి. ఆసియా- పసిఫిక్‌ సూచీలు సైతం నేడు లాభాల్లో కొనసాగుతున్నాయి.

గమనించాల్సిన స్టాక్స్‌..

పతంజలి ఫుడ్స్‌: కనీస పబ్లిక్‌ షేర్‌హోల్డింగ్‌ అర్హతను సాధించేందుకు మలిదశ పబ్లిక్‌ ఆఫర్‌కు వచ్చే యోచనలో ఉన్నట్లు పతంజలి ఫుడ్స్‌ స్పష్టం చేసింది. అయితే, దీని కోసం ఆఫర్‌ ఫర్‌ సేల్‌, అర్హతగల సంస్థాగత మదుపర్లకు విక్రయాల వంటి మార్గాలను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నట్లు తెలిపింది.

టాటా కన్జ్యూమర్‌ ప్రొడక్ట్స్‌: బిస్లరీ కొనుగోలు నిమిత్తం జరుపుతున్న చర్చలను నిలిపివేస్తున్నట్లు టాటా కన్జ్యూమర్‌ ప్రకటించింది.

హెచ్‌డీఎఫ్‌సీ: కొన్ని నియంత్రణాపరమైన నిబంధనలను ఉల్లంఘించినందుకుగానూ ఆర్‌బీఐ హెచ్‌డీఎఫ్‌సీపై రూ.5 లక్షల జరిమానా విధించింది. ఇలాంటివి మరోసారి పునరావృతం కాకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటామని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది.

రైల్‌ వికాస్‌ నిగమ్‌: హరియాణా ఆర్బిటాల్‌ రైల్‌ కార్పొరేషన్‌ ప్రాజెక్టుకు సంబంధించిన కొత్త బ్రాడ్‌గేజ్‌ రైల్వేలైన్‌కు సంబంధించిన కాంట్రాక్టులో రైల్‌ వికాస్‌ కనిష్ఠ బిడ్డర్‌గా ఎంపికైంది.

హావెల్స్‌ ఇండియా: ఆంధ్రప్రదేశ్‌లో చిత్తూరు జిల్లాలోని శ్రీసిటీలో ఏసీ తయారీ ప్రారంభించినట్లు హావెల్స్‌ ఇండియా ప్రకటించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని