యాన్యుటీ.. జీవితాంతం పింఛను వచ్చేలా

పదవీ విరమణ చేసిన తర్వాత క్రమం తప్పకుండా ఆదాయం రావాలంటే.. దానికి ముందు నుంచే తగిన ప్రణాళికలు వేసుకోవాలి.

Updated : 08 Sep 2023 00:46 IST

దవీ విరమణ చేసిన తర్వాత క్రమం తప్పకుండా ఆదాయం రావాలంటే.. దానికి ముందు నుంచే తగిన ప్రణాళికలు వేసుకోవాలి. జాతీయ పింఛను పథకం, బీమా పాలసీలు అందించే యాన్యుటీ పింఛను పాలసీలతో ఒక కచ్చితమైన ఆదాయం వచ్చేలా చూసుకోవాలి.

ఆయుర్దాయం పెరుగుతోంది. ఇప్పటితో పోలిస్తే భవిష్యత్‌లో ఇది మరింత అధికం అవుతుంది. అందుకే, చివరి వరకూ నమ్మకమైన పదవీ విరమణ ఆదాయం లభించే ఏర్పాటు చేసుకోవడం అవసరం. మలి జీవితంలో ఆర్థిక భద్రతను కోరుకునే వారు జీవితాంతం పింఛను ఇచ్చి, తర్వాత ప్రీమియాన్ని వారసులకు అందించే యాన్యుటీ పాలసీలను ఎంచుకోవచ్చు. దీర్ఘకాలిక హామీతో రాబడిని అందించే పాలసీలుగానూ వీటిని చెప్పొచ్చు.  

  • జీవిత కాలంపాటు నెలవారీ పింఛను అందించి, ఆ తర్వాత పాలసీ కొనుగోలు మొత్తాన్ని నామినీలకు అందించేదే ‘లైఫ్‌ యాన్యుటీ రిటర్న్‌ ఆఫ్‌ ప్రీమియం’ పాలసీ. ఈ పాలసీలు పదవీ విరమణ తర్వాత ఆర్థిక స్థిరత్వానికి తోడుగా ఉంటాయి. పాలసీదారుడు మరణించిన తర్వాత పెట్టుబడి మొత్తం వారసులకు ఒక ఆస్తిగా అందుతుంది. కాబట్టి, ఇది రెండు విధాలుగా ప్రయోజనం చేకూరుస్తుందని చెప్పొచ్చు.  
  • తీవ్రమైన అనారోగ్యం, కొన్ని అత్యవసర పరిస్థితుల్లోనూ పాలసీని స్వాధీనం చేసేందుకూ వీలుంటుంది. ఇలాంటప్పుడు మొత్తం ప్రీమియం వెనక్కి రాకపోవచ్చు. ఈ విషయాన్ని పాలసీదారులు గుర్తుంచుకోవాలి.  
  • పదవీ విరమణ తర్వాత ఆర్థిక లక్ష్యాల గురించి స్పష్టమైన అవగాహన ఉండాలి. అప్పుడే సౌకర్యవంతమైన జీవితం సాధ్యమవుతుంది. బాధ్యతలు, ఆధారపడిన వారు ఇలా అన్ని   అంశాలనూ పరిశీలనలోకి తీసుకోవాలి.
  • పాలసీని ఎంపిక చేసుకునేటప్పుడు ఆర్థిక పరిస్థితి, నష్టాన్ని భరించే సామర్థ్యం అంచనా వేసుకోవాలి. ఆయుర్దాయాన్నీ లెక్కలోకి తీసుకోవాలి.  
  • ఆర్థిక ప్రణాళికలు ఎప్పుడూ సంక్లిష్టమే ఒకరికి సరిపోయిన పథకాలు మరొకరికి నప్పకపోవచ్చు. కాబట్టి, పాలసీని ఎంచుకునేటప్పుడు వ్యక్తిగత ఆర్థిక నిపుణులను సంప్రదించడం మేలు. ప్రస్తుతం అందుబాటులో అనేక పాలసీలు ఉన్నాయి. వీటిలో ఏది మీకు సరిపోతుందో చూసుకున్నాకే నిర్ణయం తీసుకోవాలి.

కాస్పరస్‌ క్రోమ్‌హౌట్‌, ఎండీ-సీఈఓ, శ్రీరామ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని