క్రెడిట్‌ స్కోరు తగ్గితే... వడ్డీ భారం

మీరు గృహరుణం తీసుకున్నారా? ఎట్టి పరిస్థితుల్లోనూ మీ క్రెడిట్‌ స్కోరు తగ్గకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడే వడ్డీ భారం నుంచి మీకు ఉపశమనం లభిస్తుంది.

Updated : 08 Sep 2023 07:01 IST

మీరు గృహరుణం తీసుకున్నారా? ఎట్టి పరిస్థితుల్లోనూ మీ క్రెడిట్‌ స్కోరు తగ్గకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడే వడ్డీ భారం నుంచి మీకు ఉపశమనం లభిస్తుంది. ఇప్పుడు బ్యాంకులు మంచి క్రెడిట్‌ స్కోరున్న వారికి 0.75 శాతం నుంచి 1 శాతం వరకూ వడ్డీలో రాయితీని ఇవ్వడమే ఇందుకు కారణం.

  • డాదిలో గృహరుణ వడ్డీ రేట్లు పెరిగాయి. ఇటీవలి కాలంలో ఇవి స్థిరంగా కొనసాగుతున్నాయి. అయినప్పటికీ కొన్ని బ్యాంకులు, గృహరుణ సంస్థలు రుణదాతలకు వడ్డీని తగ్గించుకునే వెసులుబాటును కల్పిస్తున్నాయి. ఈ క్రమంలో మంచి క్రెడిట్‌ స్కోరున్న వారికి ప్రాధాన్యం ఇస్తున్నాయి. కొంత మొత్తం రుసుముగా వసూలు చేసి, వడ్డీని తగ్గిస్తున్నాయి. ఒకసారి మీ బ్యాంకును సంప్రదించి, ఈ వెసులుబాటు కల్పిస్తుందో లేదో చూసుకోండి.
  • సాధారణంగా క్రెడిట్‌ స్కోరు 750 పాయింట్లకు మించి ఉందంటే మీ ఆర్థిక క్రమశిక్షణ బాగుందని అర్థం. క్రెడిట్‌ స్కోరు కేవలం మీరు పాత రుణాలను ఎలా చెల్లిస్తున్నారన్నదే చెబుతుంది. అంతేకానీ, మీ ఆదాయం, దానికి ఎంత మేరకు రుణం తీసుకోవాలనే విషయాలను పట్టించుకోదు. అందువల్ల మీ క్రెడిట్‌ స్కోరు 800 పాయింట్లు ఉంది అంటే, కొత్తగా అప్పులు ఇచ్చేందుకు బ్యాంకులకు అభ్యంతరం లేకపోవచ్చు. కానీ, మీ ఆదాయాన్ని పరిశీలించినప్పుడే మీకు నిజంగా ఎంత మేరకు రుణ అర్హత ఉందనేది అర్థం అవుతుంది. అదే సమయంలో వడ్డీ రేటులోనూ బేరమాడే శక్తిని ఇది మీకు అందిస్తుంది.
  • క్రెడిట్‌ కార్డు బిల్లులు, రుణాల వాయిదాలు.. బీమా పాలసీ ప్రీమియం, పోస్ట్‌పెయిడ్‌ ఫోన్‌ బిల్లులు ఇలా ఏదైనా సరే సకాలంలో చెల్లించాలి. క్రెడిట్‌ స్కోరుపై ప్రతికూల ప్రభావం చూపేవి ఇవే. ఆలస్యం చేస్తే మున్ముందు తక్కువ వడ్డీకి రుణాల లభ్యత అంత తేలిక కాదన్నది గుర్తుంచుకోండి. సాధ్యమైనంత వరకు మీ ఆదాయంలో 40 శాతానికి మించి వాయిదాలు ఉండకుండా చూసుకోవడం ఎప్పుడూ మంచిది. బ్యాంకులో కనీసం మూడు నెలల వాయిదాలకు సరిపడా మొత్తం అందుబాటులో ఉంచుకోవాలి. అప్పుడే వాయిదాలు ఎలాంటి ఇబ్బందీ లేకుండా చెల్లించవచ్చు.
  • ఒకటికి మించి క్రెడిట్‌ కార్డులు ఉండటం ఇప్పుడు సర్వసాధారణం. మీరు మొదటిసారిగా తీసుకున్న కార్డునే ఎప్పటికీ వాడుకోవడం మంచిది. దీనివల్ల మీకు క్రెడిట్‌ చరిత్ర పెరుగుతుంది. దీనికి సకాలంలో చెల్లింపులు చేస్తుంటే.. మీ స్కోరూ పెరిగేందుకు అవకాశం ఉంటుంది. వడ్డీ తగ్గుతుంది.
  • బ్యాంకులు, క్రెడిట్‌ కార్డు సంస్థలు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు రుణాలను ఇస్తామంటూ సందేశాలు పంపిస్తూనే ఉంటాయి. వీటిని క్లిక్‌ చేయడం, అడిగిన ప్రాథమిక వివరాలు సమర్పించినప్పుడు రుణానికి దరఖాస్తు చేసుకున్నట్లే అవుతుంది. ఫలితంగా క్రెడిట్‌ స్కోరు తగ్గుతుంది.
  • ఇతరులు తీసుకున్న రుణానికి మీరు హామీ సంతకం చేశారా? ఎవరికైనా సహ-దరఖాస్తుగా కొనసాగుతున్నారా? వారు రుణ వాయిదాలను సకాలంలో చెల్లించేలా చూసే బాధ్యతనూ మీరు తీసుకోక తప్పదు. వారు చెల్లించకపోతే మీ క్రెడిట్‌ నివేదికపై దాన్ని పేర్కొంటారు. ఫలితంగా స్కోరు తగ్గుతుంది. కాబట్టి, సంతకాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.
  • సకాలంలో వాయిదాలు, బిల్లులు చెల్లిస్తున్నా సరే.. కొన్నిసార్లు క్రెడిట్‌ నివేదికలో అవి సరిగా నమోదవ్వకపోతే స్కోరు తగ్గే ప్రమాదం ఉంది. కాబట్టి, అధిక రుణాలు, కార్డులు ఉన్నవారు కనీసం ఆరు నెలలకోసారైనా మీ క్రెడిట్‌ నివేదికను తనిఖీ చేసుకోండి. తప్పులు ఉంటే బ్యాంకులను, క్రెడిట్‌ బ్యూరోలను సంప్రదించి, వాటిని సరిచేసుకోండి.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని