నో ఫోన్‌ అగ్రిమెంట్‌.. స్టాంప్‌ పేపర్‌పై ఫ్యామిలీ సంతకం.. జొమాటో ఫన్నీ రియాక్షన్‌!

Viral news: కుటుంబ సభ్యులకున్న స్మార్ట్‌ఫోన్‌ వ్యసనాన్ని దూరం చేసేందుకు ఓ మహిళ వినూత్న ప్రయత్నం చేసింది. ఆ పని కాస్తా సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఇంతకీ ఆమె ఏం చేసిందంటే..?

Published : 06 Jan 2024 02:03 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: స్మార్ట్‌ఫోన్‌ వినియోగం అంతకంతకూ పెరిగిపోతోంది. నిద్రలేచింది మొదలు.. రాత్రి పడుకొనేంత వరకూ ఫోన్‌ వెంట ఉండాల్సిందే. కిచెన్‌, బెడ్‌రూమ్‌, బాత్‌ రూమ్‌ అనే తేడా లేకుండా పోయింది. దీంతో కుటుంబ సభ్యుల మధ్య మాటలు తగ్గిపోయాయి. తన ఇంట్లోనూ ఇదే సమస్య ఎదురవడంతో విసిగిపోయింది ఓ మహిళ. దీంతో ఎలాగైనా ఈ సమస్యకు ఫుల్‌స్టాప్‌ పెట్టాలనుకుంది. అందుకోసం ఆమె చేసిన పని ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

మంజు గుప్తా అనే మహిళ తన ఇంట్లోని వారంతా స్మార్ట్‌ఫోన్‌కు బానిసలయ్యారని గ్రహించింది. వారందరినీ ఎలాగైనా ఈ వ్యసనం నుంచి బయటపడేయాలని ఆలోచించింది. ఇందుకోసం ‘నో ఫోన్‌’ ఒప్పందాన్ని తయారు చేసింది. అది కూడా నాన్-జుడీషియల్ స్టాంప్ పేపర్‌పై అధికారికంగా తీసుకొచ్చింది. ఉదయం లేవగానే ఫోన్‌ స్క్రీన్‌ చూడకుండా సూర్యుడిని చూడటంతో రోజును ప్రారంభించాలనేది మొదటి నియమం. రెండోది.. కుటుంబ సభ్యులంతా కలసి భోజనం చేయాలి. ఆ సమయంలో ఫోన్‌ అస్సలు వాడకూడదు. కనీసం 20 అడుగుల దూరంలో మొబైల్‌ని ఉంచాలి. బాత్‌రూమ్‌లో ఫోన్‌ ఉపయోగించకూడదనేది మూడో నియమం.

ICICI క్రెడిట్‌ కార్డు ప్రయోజనాల్లో కోత.. ఇకపై వారికి మాత్రమే లాంజ్‌ యాక్సెస్‌!

‘ఏ కారణంతోనైనా ఈ మూడు నియమాలు ఉల్లంఘిస్తే స్విగ్గీ, జొమాటో నుంచి నెల పాటు ఫుడ్‌ ఆర్డర్‌ నిషేధం’ అని స్టాంప్‌ పేపర్‌పై గుప్తా వివరంగా పేర్కొంది. ఇక చేసేదేమీ లేక ఆమె కుటుంబంలోని నలుగురు సభ్యులు దానిపై సంతకం చేశారు. ఆ ఒప్పంద పత్రం ఫొటోను కుటుంబానికి చెందిన ఓ వ్యక్తి ‘ఎక్స్‌’ ద్వారా పంచుకున్నాడు. అంతే అది కాస్తా వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్‌ చేస్తున్నారు. ‘ఈ ఒప్పందంలో మ్యూచువల్‌ ఫండ్స్‌ కంటే ఎక్కువ షరతులు, నిబంధనలు ఉన్నాయి’ అని ఓ వ్యక్తి కామెంట్‌ చేశారు. ఈ పోస్ట్‌పై ప్రముఖ ఫుడ్‌ డెలివరీ సంస్థ  జొమాటో కూడా స్పందించింది. ‘మధ్యలో మా పొట్ట ఎందుకు కొడుతున్నారు?’ అంటూ ఫన్నీగా కామెంట్‌ చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని