Telsa: టెస్లాకు ప్రత్యేక మినహాయింపులు ఉండవ్‌!

Tesla: టెస్లాకు ప్రత్యేక మినహాయింపులు ఏమీ ఉండవని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు స్పష్టంచేశారు. దీనిపై వస్తున్న వార్తలన్నీ ఊహాగానాలేనని కొట్టిపారేశారు.

Updated : 01 Dec 2023 20:17 IST

Tesla | దిల్లీ: దేశంలోకి ఎంట్రీ ఇచ్చేందుకు టెస్లా (Tesla) ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. దేశీయంగా తయారీ కర్మాగారం నెలకొల్పేందుకు కొన్ని పన్ను మినహాయింపులు, ప్రోత్సాహాకాలు కోరుతోంది. ఇందుకు ప్రభుత్వం కూడా సుముఖంగా ఉందంటూ వార్తలు వచ్చాయి. దీనిపై ప్రభుత్వ వర్గాలు స్పందించాయి. విద్యుత్‌ వాహన రంగంలో ఒక కంపెనీకి నిర్దిష్టంగా ప్రోత్సాహకాలు, మినహాయింపులు ఇవ్వడం జరగదని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. ఒకవేళ అలాంటివి ఏవైనా ఉంటే దేశంలో ప్రవేశించాలనుకునే వారితో పాటు ఈవీ తయారీదారులందరికీ ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇస్తుందని పేర్కొన్నారు. టెస్లా డిమాండ్‌పై వివిధ మంత్రిత్వ శాఖల మధ్య చర్చలు జరిగాయన్నది వాస్తవమే అయినప్పటికీ.. తుది నిర్ణయం తీసుకోలేదని స్పష్టంచేశారు.

టెస్లా 2021 నుంచి భారత్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఇందులో భాగంగా ఈవీలపై దిగుమతి సుంకాలను గణనీయంగా తగ్గించాలని కోరుతోంది. పూర్తిగా విదేశాల్లో తయారై (కంప్లీట్లీ బిల్ట్‌ అప్‌) భారత్‌కు వచ్చే వాహనాలపై ప్రస్తుతం 100 శాతం వరకు సుంకం వర్తిస్తోంది. విలువతో సంబంధం లేకుండా ఈ సుంకాన్ని 40 శాతానికి తగ్గించాలని టెస్లా కోరింది. దీనికి ససేమిరా అన్న ప్రభుత్వం దేశీయంగా తయారీ ప్రారంభించడంతో పాటు ప్రాంతీయంగానే విడిభాగాలను కొనుగోలు చేయాలని షరతు విధించింది. దీంతో టెస్లా ప్రయత్నాలకు బ్రేక్‌ పడింది. ఈ ఏడాది జూన్‌లో ప్రధాని మోదీ, ఎలాన్‌ మస్క్‌ భేటీ అయ్యారు. కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ సైతం కాలిఫోర్నియాలోని టెస్లా తయారీ కేంద్రాన్ని సందర్శించారు. 

6 నెలలు దాటినా రూ.9700 కోట్లు విలువైన ₹2 వేల నోట్లు ప్రజల వద్దే

దీంతో టెస్లా ఎంట్రీకి సంబంధించిన ప్రయత్నాలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో టెస్లాకు కస్టమ్స్‌ సుంకంలో భారత్‌ మినహాయింపు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తోందంటూ వార్తలు వచ్చాయి. దీనిపై తాజాగా సదరు ఉన్నతాధికారి స్పందిస్తూ.. ‘‘ఒక కంపెనీకి ప్రత్యేకంగా మినహాయింపులంటూ ఏవీ ఉండవు. ఒకవేళ అలాంటివేవైనా ఇవ్వాలని నిర్ణయిస్తే.. తయారీదారులందరికీ ఇస్తారు’’ అని  తెలిపారు. కస్టమ్స్‌ సుంకంలో రాయితీ, ఇతర ప్రోత్సాహకాల గురించి వచ్చిన వార్తలన్నీ ఊహాజనితమని పేర్కొన్నారు. మరోవైపు ఒక కంపెనీకి ప్రత్యేకంగా ప్రోత్సాహకాలు ఇచ్చే అంశాన్ని దేశీయ ఈవీ తయారీ కంపెనీలు సైతం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని