Robbery: సినిమాలో చూసి.. రూ.47 లక్షలు కాజేసి..!

ఓ సినిమాలో దోపిడీ (Robbery) సీన్‌తో ప్రేరణ పొందిన ముగ్గురు వ్యక్తులు.. అదే  స్టైల్‌లో దోపిడీకి పాల్పడ్డారు. ముమ్మర గాలింపు చేపట్టిన పోలీసులు ముగ్గురు నిందుతులను అరెస్టు చేశారు. మహారాష్ట్రలోని పుణెలో ఈ ఘటన చోటుచేసుకుంది.

Published : 31 Mar 2023 01:29 IST

పుణె: ఓ సినిమాలోని దొంగతనం సీన్‌తో ప్రేరణ పొంది అచ్చం అలాంటి చోరీకే (Robbery) పాల్పడ్డారు ముగ్గురు వ్యక్తులు. అలా రూ.47 లక్షలు కాజేసిన ఈ ఘటన మహారాష్ట్రలోని పుణెలో (Pune) చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నానాపేట్‌కు చెందిన మంగళ్‌పురి గోస్వామి అనే వ్యక్తి మార్కెటింగ్‌ ఏజెన్సీలో 30 ఏళ్లుగా ఉద్యోగం చేస్తున్నారు. ఏజెన్సీకి సంబంధించిన డబ్బును బ్యాంకులో వేయడం అతని విధి. కొంతకాలంగా ఇది గమనిస్తున్న కొందరు వ్యక్తులు అతడి నుంచి డబ్బు కాజేసేందుకు ప్రణాళిక రచించారు. దీంతో రోజూలాగే బ్యాంకుకు వెళుతున్న గోస్వామిని ఇటీవల ఉదయం ఆజాద్‌ చౌక్‌ వద్ద ఇద్దరు వ్యక్తులు అడ్డుకున్నారు. పదునైన కత్తి చూపించి బెదిరించారు. అతని వద్ద ఉన్న రూ.47 లక్షల డబ్బును దోచుకుని పరారయ్యారు. బాధితుడు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా మార్చి 23న ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.

అనంతరం నిందితులను పట్టుకునేందుకు స్థానిక పోలీసులు ప్రత్యేక బృందాలతో ముమ్మర గాలింపు చేపట్టారు. ఇందులో భాగంగా వివిధ ప్రాంతాల్లోని 500 సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలించారు. వీడియోలో అనుమానాస్పదంగా కనిపించిన ఆటోను గుర్తించిన పోలీసులు..  ప్రధాన నిందితుడు గైక్వాడ్‌ పట్టుకున్నారు. నానాపేట్‌కు చెందిన రుషికేశ్ గైక్వాడ్, కిరణ్ అశోక్ పవార్, ఆకాష్ కపిల్ గోరాడ్‌లు ఈ దోపిడీకి పాల్పడ్డట్లు నిర్ధారించారు. గైక్వాడ్‌ గతంలో మార్కెటింగ్ ఏజెన్సీలో సేల్స్‌మెన్‌గా పనిచేసినట్లు విచారణలో వెల్లడైంది. పనిచేస్తున్న సమయంలో అతడిపై కొన్ని ఆరోపణలు రావడంతో ఉద్యోగం నుంచి తొలగించారు. అనంతరం.. గోస్వామి రోజూ నగదు తీసుకెళ్లడాన్ని గమనించిన నిందితుడు అతన్నుంచి డబ్బు కాజేయాలని పథకం పన్నాడు. ఓ సినిమా నుంచి ప్రేరణ పొందిన అతడు.. తన స్నేహితులతో కలిసి అచ్చం అలానే ఈ దోపిడీకి పాల్పడినట్లు పోలీసులకు వివరించాడు. నిందితుల నుంచి రూ.25 లక్షలను స్వాధీనం చేసుకున్నట్లు పుణె డీసీపీ సందీప్ సింగ్ గిల్ వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని