చీర లాగిన ఘటన.. ఐదుగురు పోలీసుల సస్పెన్షన్

నామినేషన్‌ వేసేందుకు వచ్చిన ఓ మహిళా అభ్యర్థినితో అసభ్య ప్రవర్తనకు సంబంధించిన ఓ వీడియో వైరల్‌గా మారింది. దీంతో ఉత్తరప్రదేశ్‌ రాజకీయాల్లో దుమారం రేగింది....

Published : 09 Jul 2021 20:52 IST

లఖ్‌నవూ: నామినేషన్‌ వేసేందుకు వచ్చిన ఓ మహిళా అభ్యర్థినితో అసభ్య ప్రవర్తనకు సంబంధించిన ఓ వీడియో వైరల్‌గా మారింది. దీంతో ఉత్తర్‌ప్రదేశ్‌ రాజకీయాల్లో దుమారం రేగింది. యూపీలో గత కొద్ది రోజులపాటు పంచాయతీ ఎన్నికల జోరు కొనసాగింది. లఖింపురి ఖేరి ప్రాంతానికి చెందిన సమాజ్‌వాదీ పార్టీ మహిళా అభ్యర్థిని చివరి రోజైన శనివారం నామినేషన్‌ వేసేందుకు వెళ్లారు. అయితే ఆమెకు అక్కడ ఓ చేదు అనుభవం ఎదురైంది. నామినేషన్‌ కేంద్రం లోపలికి వెళ్లనీయకుండా సదరు మహిళా అభ్యర్థినిని ఇద్దరు వ్యక్తులు అడ్డుకున్నారు. నామినేషన్‌ పత్రాలను లాక్కున్నారు. ఈ క్రమంలోనే ఆమె చీర లాగారు. కాగా వెంటనే కొందరు వచ్చి వారిని విడిపించారు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో గురువారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో రాజకీయ దుమారం రేగింది. యూపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ ట్విటర్‌ వేదికగా యోగి ఆదిత్యనాథ్‌ సర్కారుపై మండిపడ్డారు. మహిళా అభ్యర్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఇద్దరు వ్యక్తులు భాజపా కార్యకర్తలేనని ఆరోపించారు. ఆ ఘటనకు సంబంధించిన వీడియోను పోస్టుచేశారు. అధికారం కోసం యోగి ఆదిత్యనాథ్‌ గూండాలు చేసిన పని అని పేర్కొన్నారు. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఐదుగురు పోలీసుపై సస్పెన్షన్‌ విధించింది. సస్పెన్షన్‌కు గురైన వారిలో ఓ సీఐ, ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు, మరో ఇద్దరు సబ్‌ ఇన్‌స్పెక్టర్లు ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని