
హాథ్రస్ ఘటనా ప్రాంతంలో సీబీఐ దర్యాప్తు
బాధితురాలి సోదరుడు, తల్లిని వెంట తీసుకెళ్లిన అధికారులు
లఖ్‌నవూ: నలుగురు మృగాళ్ల చేతిలో అత్యాచారం, హత్యకు గురైన ఉత్తరప్రదేశ్‌లోని హాథ్రస్ యువతి కేసు దర్యాప్తును సీబీఐ వేగవంతం చేసింది. ఈరోజు మధ్యాహ్నం పోలీసులు, ఫోరెన్సిక్ బృందంతో హాథ్రస్ చేరుకున్న అధికారులు ఘటనా ప్రాంతంలో దర్యాప్తు చేపట్టారు. బాధితురాలి సోదరుడి వివరాల ప్రకారం వ్యవసాయ క్షేత్రంలోని ఘటనా ప్రాంతంలో దర్యాప్తు ప్రారంభించారు. అనారోగ్యంపాలై ఆసుపత్రిలో చేరి చికిత్స చేయించుకోని తిరిగి వస్తున్న యువతి తల్లిని కూడా ఘటనా ప్రాంతానికి తీసుకెళ్లారు. ఆసుపత్రి నుంచి తిరిగి వస్తున్న ఆంబులెన్స్‌ను మధ్యలోనే ఆపి ఆమెను వ్యవసాయ క్షేత్రానికి తీసుకెళ్లారు. ఆరోజు అక్కడ ఏం జరిగిందో వివరించాలని కోరారు.
ఈరోజు మధ్యాహ్నం హాథ్రస్ ప్రధాన వైద్యాధికారి డా.బ్రిజేష్ రాథోడ్ బాధితురాలి ఇంటికి వెళ్లి ఆమె కుటుంబసభ్యులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. యువతి తల్లిదండ్రులకు ఆరోగ్యం క్షీణించినట్లు నిర్ధరించారు. అయితే ఆసుపత్రిలో చేరేందుకు యువతి తండ్రి నిరాకరించగా, ఆమె తల్లి మాత్రం ఆసుపత్రికి వెళ్లి స్వల్ప చికిత్స చేయించుకున్నారు.
సెప్టెంబర్ 14న తల్లితోపాటు పొలానికి వెళ్లిన ఓ దళిత యువతిపై నలుగురు దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడిన బాధితురాలు దిల్లీలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అదే నెల 29న మృతిచెందింది. ఈ ఘటనతో దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. అయితే యువతి మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించకుండా పోలీసులే అర్ధరాత్రి 2.15గంటలకు దహనసంస్కారాలు నిర్వహించడం దుమారం రేపాయి. పోలీసుల వ్యవహారశైలి, ప్రభుత్వ తీరుపై నిరసనలు ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి. అనంతరం ఈ కేసు దర్యాప్తును యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం సీబీఐకి అప్పగించింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.