
కరోనా నివారణ పేరుతో తండ్రికి పురుగుల మందు!
ఆ తర్వాత తానూ సేవించి యువకుడి ఆత్మహత్య
పంజాగుట్టలో దారుణం..తండ్రి పరిస్థితి విషమం
పంజాగుట్ట: హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. కరోనా నివారణ మందు పేరుతో ఓ యువకుడు తన తండ్రికి పురుగుల మందు తాగించాడు. ఆ తర్వాత తానూ తీసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం రాత్రి అనీష్ రెడ్డి అనే యువకుడు కొవిడ్ నివారణ మందు తెచ్చానంటూ తండ్రికి చెప్పారు. తనతో పాటు తల్లిదండ్రులకు కొవిడ్ మందు పేరుతో మూడు గ్లాసుల్లో పురుగుల మందు కలిపాడు. తొలుత దాన్ని తండ్రికి ఇచ్చి.. ఆ తర్వాత తాను కూడా సేవించాడు. వంటగదిలో ఉన్న తల్లి బయటకు వచ్చి చూసే సరికి తండ్రీకుమారులిద్దరూ వాంతులు చేసుకోవడాన్ని గమనించి వారిని వెంటనే సోమాజీగూడ యశోద ఆస్పత్రికి తరలించారు. పురుగుల మందును అనీష్ ఎక్కువ మోతాదులో తీసుకోవడంతో అతడు మృతిచెందాడు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తండ్రి రాంరెడ్డి పరిస్థితి విషమంగా ఉంది.
అనీష్‌రెడ్డి పలు ఐటీ కంపెనీలకు భోజనం సరఫరా చేస్తున్నారు. గత కొంతకాలంగా కంపెనీల నుంచి రావాల్సిన బకాయిలు రాకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ కారణంగానే మనస్తాపంతో అనీష్ ఆత్మహత్యకు పాల్పడినట్లు అతడి తల్లి పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆయా కంపెనీల యజమానులను పిలిచి విచారించనున్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.