Cyber Crime: ఈ-కామర్స్‌ ఓటీపీ పేరుతో కొత్త పంథాలో సైబర్‌ మోసం!

ఆన్‌లైన్‌లో తరచుగా షాపింగ్ చేసే యూజర్ వివరాలను సేకరించి వారి నుంచి క్యాన్సిలేషన్‌ ఓటీపీ (OTP) పేరుతో వివరాలు సేకరించి బ్యాంకు ఖాతాలు ఖాళీ చేస్తున్న కొత్త పంథా సైబర్‌ మోసం (Cyber Fraud) తాజాగా వెలుగులోకి వచ్చింది. 

Published : 06 Feb 2023 01:22 IST

 

దిల్లీ: సైబర్‌ నేరాల (Cyber Crime) కట్టడికి ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకున్నప్పటికీ, నేరగాళ్లు కొత్త పంథాలో వినియోగదారులను మోసం చేస్తూనే ఉన్నారు. ఇటీవలి కాలంలో ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేసే వారి సంఖ్య గణనీయంగా పెరగడంతో ఈ-కామర్స్‌ (e-commerce) సంస్థల పేరుతో ఓటీపీ (OTP) ద్వారా కొత్త తరహా మోసాలు జరుగుతున్నాయి. వీటి గురించి నేషనల్‌ సైబర్‌ క్రైమ్‌ రిపోర్టింగ్ పోర్టల్‌ (NCCRP) వెల్లడించింది. 

ఈ తరహా మోసంలో భాగంగా సైబర్‌ నేరగాళ్లు (Cyber Criminals) ముందుగా సేకరించిన మొబైల్ నంబర్ల ఆధారంగా ఈ-కామర్స్‌ సంస్థల నుంచి తరచుగా వస్తువులు డెలివరీ అవుతున్నవినియోగదారుడి వివరాలు సేకరిస్తారు. సదరు యూజర్‌కు ఫోన్‌ చేయడం లేదా వాళ్ల ఇంటికి వెళ్లి, ఈ-కామర్స్ ప్రతినిధులుగా పరిచయం చేసుకుంటారు. తర్వాత క్యాష్‌ ఆన్‌ డెలివరీ ద్వారా ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ వచ్చినట్లు చెబుతారు. కస్టమర్‌ తాను ఆర్డర్‌ చేయలేదని, నగదు చెల్లించేందుకు నిరాకరిస్తే, ఆర్డర్‌ క్యాన్సిల్‌ చేయాలి చెబుతారు. అందుకోసం కస్టమర్ ఫోన్‌కు ఓటీపీ పంపినట్లు నమ్మిస్తారు. సదరు ఓటీపీని చెప్పిన వెంటనే కస్టమర్ ఫోన్‌ను హ్యాక్‌ చేసి, బ్యాంక్‌ ఖాతాలను ఖాళీ చేస్తారు. పలుసందర్బాల్లో సైబర్‌ నేరగాళ్లు మోసం చేయాలనుకున్న వ్యక్తి ఇంట్లో లేకపోతే, పక్కింటి వారిని దగ్గరకు వెళ్లి సదరు వ్యక్తి నుంచి ఓటీపీ అడగమని కోరినట్లు పలువురు వినియోగదారులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. 

ఈ విధమైన ఫిర్యాదులు ఎన్‌సీసీఆర్‌పీలో ఇటీవలి కాలంలో ఎక్కువగా నమోదవుతున్నట్లు తెలిపింది. వినియోగదారులు ఓటీపీని ఎవరితో షేర్ చేయొద్దని సూచించింది. అలానే ఫోన్‌ చేసిన వ్యక్తి నిజంగా సదరు ఈ-కామర్స్‌ సంస్థ ప్రతినిధి అవునా? కాదా? అనేది నిర్ధారించుకోవాలని కోరింది. ఆర్డర్‌ చేయని ప్యాకెజ్‌ను రిసీవ్‌ చేసుకోవద్దని సూచించింది. వ్యక్తిగత సమాచారం కోరుతూ ఈ-కామర్స్ ప్రతినిధులమని చెబుతూ పంపే వెబ్‌ లింక్‌లను క్లిక్ చేయొద్దని కోరింది. డెలివరీ ప్రతినిధులమని చెప్పే వారి వద్ద క్యూఆర్‌ కోడ్‌ స్కానింగ్ చేయొద్దని సూచించింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని