Published : 03 Feb 2020 08:42 IST

ఉమ్మనీరు తాగి.. ఊపిరి ఆడక

పసికందు మృతి

అందుబాటులో లేని వైద్యుడు, స్టౌఫ్‌నర్స్‌

ప్రసవం చేసేందుకు ప్రయత్నించి విఫలమైన ఏఎన్‌ఎం

ఆక్సిజన్‌ సౌకర్యం కరవు
ఆసుపత్రి సిబ్బందితో బాధితుల వాగ్వాద

మృతి చెందిన పసికందు

తమ కలలు ఫలిస్తున్నాయని ఆ దంపతులు ఎంతో ఆశ పడ్డారు. భార్యకు ప్రసవం నొప్పులు రాగానే ఆసుపత్రికి వచ్చారు. బిడ్డతో సంతోషంగా తిరిగి వెళ్లాలనుకున్న వారి ఆశలు ఆవిరయ్యాయి. మగ బిడ్డ పుట్టినా పురిటిలోనే మృతి చెందడంతో వారి ఆవేదనకు అంతే లేకుండా పోయింది. సమయానికి వైద్యుడు, స్టాఫ్‌నర్స్‌ లేకపోవడం... ఏఎన్‌ఎం ప్రసవం చేయడం, ఆసుపత్రిలో ఆక్సిజన్‌ అందుబాటులో లేకపోవడం వంటి సమస్యలు చుట్టుముట్టడంతో ఓ పసికందు ప్రాణాలు గాలిలో కలిసి పోయాయి. ఈ లోకాన్ని చూడకుండానే ఆ బిడ్డ కన్నుమూశాడు.

సంతబొమ్మాళి, న్యూస్‌టుడే : సంతబొమ్మాళి గ్రామం బీసీ కాలనీకి చెందిన గర్భిణి దూబ కుమారికి శనివారం అర్ధరాత్రి 1.30గంటల సమయంలో పురిటి నొప్పులు రావడంతో సంతబొమ్మాళి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి కుటుంబ సభ్యులు తీసుకెళ్లారు. ఆ సమయంలో వైద్యులు అందుబాటులో లేకపోవడంతో ఆసుపత్రి ఏఎన్‌ఏం సాధారణ ప్రసవం చేసేందుకు ప్రయత్నించారు. వైద్యుడికి చరవాణిలో సమాచారం అందించామన్నారు. ఆదివారం ఉదయం 6.30 గంటల సమయంలో మగ బిడ్డకు జన్మనిచ్చినా ఆ పసికందు ఉమ్మనీరు తాగడంతో శ్వాస సక్రమంగా అందలేదు. ఆసుపత్రిలో ఆక్సిజన్‌, ఇతర పరికరాల సౌకర్యం లేకపోవడంతో చిన్నారి చనిపోయాడు. బిడ్డ దక్కకపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. దీంతో కుటుంబసభ్యులు ఆసుపత్రి సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. వైద్యుడు అందుబాటులో లేనప్పుడు వేరే ఆసుపత్రికి పంపించకుండా ఎందుకు ప్రసవం చేశారని ఏఎన్‌ఎంను నిలదీశారు. బాలింతను పరామర్శించి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందని తెలుసుకోవడానికి ఆదివారం ఆసుపత్రికి వైద్యులు ఎవరూ రాలేదని బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న సంతబొమ్మాళి ఎస్‌ఐ ఎన్‌.కామేశ్వరరావు గ్రామంలో విచారణ చేపట్టారు. ఈ విషయంపై సంబంధిత వైద్యాధికారి గురుమూర్తిని ‘న్యూస్‌టుడే’ సంప్రందించగా మొబైల్‌ ఫోన్‌ స్వీచ్‌ ఆఫ్‌ వచ్చింది.

విషాదంలో కుటుంబ సభ్యులు

కలెక్టర్‌ హెచ్చరించినా..మారని తీరు

మండల కేంద్రంలో జనవరి 2వ తేదీన జిల్లా కలెక్టర్‌ జి.నివాస్‌ పర్యటించారు. ఈ సందర్భంగా సంతబొమ్మాళి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆరోగ్య కేంద్ర నిర్వహణ తీరు అధ్వానంగా ఉండటంతోపాటు పీహెచ్‌సీలో ప్రసవాలు సక్రమంగా జరగకపోవడంతో వైద్యాధికారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా సిబ్బంది తీరు మారలేదు. పీహెచ్‌సీలో ప్రసవానికి వచ్చిన సమయంలో వైద్య సేవలు సక్రమంగా అందించకపోవడంతో పసికందు మృతి చెందిందని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాత, శిశు మరణాలను అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా ఫలితం మాత్రం అంతంతమ్రాతం గానే ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికీ ఆరోగ్య కేంద్రాలు అరకొర సిబ్బందితోను, సౌకర్యాల లేమి, వైద్యుల నిర్లక్ష్యం కారణంగా సతమతవుతున్నాయని, దీని వల్లే ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయని పేర్కొంటున్నారు.

 

ఎంతో ప్రయత్నించా..

బాలింత మృతి చెందిన మగబిడ్డకు ప్రసవించింది. బాబును బతికించాలన్న తాపత్రయంతో ఎంతో కృషి చేశా. బాబు చనిపోవడానికి ఉమ్మనీరు తాగడమే కారణం. - సంతబొమ్మాళి ఏఎన్‌ఎం.

 

ఆరా తీశా ..

ఆదివారం ఉదయం 11గంటల సమయంలో ఆసుపత్రికి చేరుకొని జరిగిన సంఘటనపై ఆరా తీశా. వైద్యుడు సెలవుల్లో ఉన్న విషయం నాకు తెలియదు. వైద్యుడితో మాట్లాడి విషయం తెలియజేస్తాను. - రామారావు, ఈవో, సంతబొమ్మాళి పీహెచ్‌సీ

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని