పోలీసుల హత్య వెనుక అతడు

రాష్ట్రంలో మోస్ట్‌ వాంటెడ్‌ నేరస్థుడిని అరెస్టు చేసేందుకు వెళ్లిన ఎనిమిది మంది ఉత్తరప్రదేశ్‌ పోలీసులు మృత్యువాతపడ్డారు. గురువారం అర్ధరాత్రి దుండగుల కాల్పుల్లో..

Updated : 22 Dec 2022 17:17 IST

దాదాపు 60 కేసుల్లో వికాస్‌ దూబే నిందితుడు

లక్నో: రాష్ట్రంలో మోస్ట్‌ వాంటెడ్‌ నేరస్థుడిని అరెస్టు చేసేందుకు వెళ్లిన ఎనిమిది మంది ఉత్తర్‌ప్రదేశ్‌ పోలీసులు మృత్యువాతపడ్డారు. గురువారం అర్ధరాత్రి దుండగుల కాల్పుల్లో మృతిచెందిన వారిలో ఓ డిప్యూటీ సూపరింటెండెంట్‌ కూడా ఉన్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోనే కరడుగట్టిన నేరస్థుల్లో వికాస్‌ దూబే ఒకడు. అతడిపై హత్య కేసులు సహా దాదాపు 60 కేసులు ఉన్నాయి. పలుమార్లు పోలీసులు అరెస్టు చేసినా ఎలాగోలా తప్పించుకున్నాడు. కాన్పూర్‌ జిల్లాలోని ఓ గ్రామంలో నివసిస్తున్న అతడిని అరెస్టు చేసేందుకు పోలీసులు వస్తున్నారని ముందే పసిగట్టాడు. రాష్ట్ర రాజధాని నుంచి 150 కి.మీ. దూరంలో ఉండే గ్రామం వరకు అనేక చోట్ల రహదారిని బ్లాక్‌ చేయించాడు. రోడ్డుకు అడ్డంగా ఉంచిన ఓ బుల్డోజర్‌ సహా పోలీసులు పలు అడ్డంకులను తొలగించుకొని ముందుకుసాగారు. నేరస్థుడు ఉంటున్న గ్రామానికి చేరుకోగానే ఓ ఇంటి దాబాపై మాటువేసిన దుండగులు పోలీసులపై ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారు. వారి వాహనాలపై బులెట్ల వర్షం కురిపించారు. ఈ ఘటనలో 8 మంది పోలీసులు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. 

1990లో ఓ హత్య కేసుతో వికాస్‌ దూబే నేర ప్రస్థానం మొదలైంది. కాన్పూర్‌ భాజపా నాయకుడు సంతోష్‌ శుక్లాను పోలీసుస్టేషన్‌లోనే వెంటాడి హత్య చేశాడు. 2002లో అతడు పోలీసులకు లొంగిపోయాడు. తిరిగి తప్పించుకున్నాడు. ఓ హత్యాయత్నం కేసులో దూబేను అరెస్టు చేసేందుకు మూడు పోలీసు బృందాలు సదరు గ్రామానికి చేరుకోగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. నేరస్థుడైన దూబేకు రాజకీయ అండదండలు ఉన్నాయి. జిల్లాలోని ఓ ప్రాంతంలో అతడు జిల్లా పంచాయతీ సభ్యుడిగా కొనసాగుతున్నాడు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని