చలానా గాళ్‌ఫ్రెండ్‌ది.. కార్డేమో భార్యది 

కుర్రాడికి పెళ్లైంది.. అందాల రాశిలాంటి భార్య ఉంది. అయినా అదేం రోగమో ‘మైనే తుమ్‌ కో ప్యార్‌ కియా’ అంటూ ఇంకో అమ్మాయిని

Published : 31 Jan 2021 01:34 IST

భార్య కార్డుతో గాళ్‌ఫ్రెండ్‌ చలానా కట్టేశాడు

ఇంటర్నెట్‌ డెస్క్‌: కుర్రాడికి పెళ్లైంది.. అందాల రాశిలాంటి భార్య ఉంది. అయినా అదేం రోగమో ‘మైనే తుమ్‌ కో ప్యార్‌ కియా’ అంటూ ఇంకో అమ్మాయిని వలచాడు. బహుమతులిచ్చాడు. చాటుమాటుగా సరసాలాడాడు. అంతదాకా బాగానే ఉందిగానీ ఆమెపై వ్యామోహం ఎక్కువై భార్య క్రెడిట్‌ కార్డుతో గాళ్‌ఫ్రెండ్‌ వాహనం చలాన్లు కట్టి అడ్డంగా దొరికిపోయాడు. దుబాయ్‌లో జరిగిందీ చిత్రమైన సంఘటన.

రెండ్రోజుల కిందట ఆ భార్య సెల్‌ఫోన్‌కి ఎస్‌ఎంఎస్‌ వచ్చింది. ‘మీ క్రెడిట్‌ కార్డుతో పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్‌ చలాన్లు కట్టినందుకు థ్యాంక్స్‌’ అని. వెంటనే హ్యాండ్‌బ్యాగ్‌ వెతికిచూసిందామె. కార్డు కనిపించలేదు. ఎవరో దొంగిలించారని ఆమె గుండె జల్లుమంది. వెంటనే బ్యాంకుకు ఫోన్‌ చేసి కార్డును బ్లాక్‌ చేయించింది. ఆ వెనకే పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే రంగంలోకి దిగారు వాళ్లు. వాహనం ఎవరి పేరు మీద ఉందో తనని పట్టుకోవడం పెద్దగా కష్టమేం కాలేదు పోలీసులకు. ‘నీకు ఆ కార్డు ఎక్కడిది? ఫైన్‌ ఎలా కట్టావ్‌?’ అని నిలదీశారు. ‘ఇందులో తప్పేముంది? నా బోయ్‌ఫ్రెండ్‌ కట్టేశాడు. అయినా మీరెందుకు నన్ను ప్రశ్నిస్తున్నారు?’ అని ఎదురు దబాయించింది ఆ అమ్మడు. ఇలా కాదనుకొని ఇద్దరినీ స్టేషన్‌కి తీసుకెళ్లి విచారణ మొదలుపెట్టారు. అప్పుడే సీన్‌ అందరికీ క్లియర్‌గా అర్థమైంది. తన బోయ్‌ఫ్రెండ్‌కి అప్పటిదాకా పెళ్లి కాలేదని ఆ గాళ్‌ఫ్రెండ్‌ అనుకుంది పాపం! ‘మీ భర్తే మీ కార్డును గాళ్‌ఫ్రెండ్‌ కోసం వాడాడు’ అని పోలీసులు చెప్పగానే అవాక్కైంది అర్థాంగి.

ఇంట్లో ఇల్లాలు.. వంటింట్లో ప్రియురాలిలా ఒకరికి తెలియకుండా ఒకరిని మెయింటెయిన్‌ చేస్తున్న గురుడి బండారం మొత్తం బయటపడింది. క్రెడిట్‌ కార్డు హ్యాక్‌ అయిందని ఇల్లాలు భయపడితే ఇల్లే గుల్ల అయ్యిందని తెలుసుకుంది. ‘క్రెడిట్‌ కార్డు మోసం జరిగిందంటూ గతంలో ఎన్నో ఫిర్యాదులు అందుకున్నాం.. కానీ ఇలా భర్తే భార్యకు తెలియకుండా మోసం చేసిన సంఘటన మొదటిసారి చూశాం’ అంటున్నారు ఈ కేసును ఛేదించిన  దుబాయ్‌ సైబర్‌ క్రైం డిపార్ట్‌మెంట్‌ డిప్యూటీ డైరెక్టర్‌ కెప్టెన్‌ అబ్దుల్లా ఆల్‌ షాహీ.

ఇదీ చదవండి..

AP: అభ్యర్థుల ధ్రువపత్రాలపై ఎస్‌ఈసీ స్పష్టత

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని