30 వేల కట్నం కోసం.. ముగ్గురి ప్రాణాలు బలి

ఓ కుటుంబంలో కట్నం కోసం అత్తింటి వారి వేధింపులు, మరో ఇంట్లో మనస్పర్థలు.. ఈ కారణాలతో ఇద్దరు తల్లులు, ముగ్గురు బోసినవ్వుల చిన్నారుల ప్రాణాలు గంగలో కలిసిపోయాయి. ఓ మహిళ తన ఇద్దరు చిన్నారులతో బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడగా.. మరో మహిళ తన రెండేళ్ల కుమార్తెతో సహా శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులో దూకి ప్రాణాలు విడిచింది. శ్రీరామనవమి పండుగ రోజు ఈ ఘటనలు ఆయా గ్రామాల్లో తీరని విషాదం నింపాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

Updated : 29 Jun 2023 17:19 IST

అత్తింటి వారి వేధింపులు తాళలేక ఇద్దరు చిన్నారులతో బావిలో దూకిన తల్లి
మరో ఘటనలో మనస్తాపంతో కుమార్తె సహా తల్లి ఆత్మహత్య

ఈనాడు డిజిటల్‌, పెద్దపల్లి: ఓ కుటుంబంలో కట్నం కోసం అత్తింటి వారి వేధింపులు, మరో ఇంట్లో మనస్పర్థలు.. ఈ కారణాలతో ఇద్దరు తల్లులు, ముగ్గురు బోసినవ్వుల చిన్నారుల ప్రాణాలు గంగలో కలిసిపోయాయి. ఓ మహిళ తన ఇద్దరు చిన్నారులతో బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడగా.. మరో మహిళ తన రెండేళ్ల కుమార్తెతో సహా శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులో దూకి ప్రాణాలు విడిచింది. శ్రీరామనవమి పండుగ రోజు ఈ ఘటనలు ఆయా గ్రామాల్లో తీరని విషాదం నింపాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం అబ్బాపూర్‌కు చెందిన టెక్కం రాజయ్య కుమార్తె విజయ(25)ను నిమ్మనపల్లికి చెందిన స్వామికి ఇచ్చి 2016లో పెళ్లి చేశారు. కట్నం కింద రూ.1.50 లక్షలు ఇవ్వాల్సి ఉండగా వివాహ సమయంలో రూ.70 వేల నగదు, రూ.50 వేల విలువైన బంగారం ఇచ్చారు. వారికి కుమారుడు శివకృష్ణ(3), కూతురు శ్రీకృతి(2) జన్మించారు. స్వామి పెద్దపల్లిలో రోజువారీ కూలి పనులు చేస్తుంటాడు. కట్నం బాకీ రూ.30 వేలతో పాటు అదనంగా రూ.లక్ష కట్నం తేవాలంటూ ప్రతి రోజూ విజయను ఆడబిడ్డ పద్మదేవేంద్ర, భర్త స్వామి, అత్త లక్ష్మి, ఇతర కుటుంబసభ్యులు శారీరకంగా, మానసికంగా వేధించేవారు. ఈ విషయమై గతంలో అబ్బాపూర్‌లో పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ జరగగా.. రూ.30 వేల కట్నం బాకీ ఇస్తామని విజయ తల్లిదండ్రులు చెప్పారు. ఆ తర్వాత విజయ తల్లి చనిపోవడం, పంటలు పండకపోవడంతో కట్నం బాకీ ఇవ్వలేకపోయారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం ఆడబిడ్డ పద్మదేవేంద్ర, అత్త లక్ష్మిలు కట్నం తేవాలంటూ విజయను తీవ్రంగా కొట్టారు. ఈ విషయాన్ని విజయ పెద్దపల్లిలో ఉన్న భర్తకు ఫోన్‌ చేసి చెప్పగా.. సాయంత్రం ఇంటికి వచ్చి మాట్లాడతానని ఆయన అక్కడే ఉండిపోయాడు. తర్వాత విజయ పిల్లలను తీసుకొని బయటకు వెళ్లి తిరిగి రాలేదు. బుధవారం నిమ్మనపల్లి గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో ఇద్దరు చిన్నారుల మృతదేహాలను గుర్తించారు. బావి అడుగున ఉన్న విజయ మృతదేహాన్ని ఈతగాళ్ల సాయంతో వెలికితీశారు. మృతురాలి తండ్రి రాజయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. విజయ భర్త, అత్త, ఆడబిడ్డ, బావ, తోటికోడలిని అదుపులోకి తీసుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని