వేధింపులతో దంపతుల ఆత్మహత్యాయత్నం

కొడుకు చేసిన పొరబాటుకు తండ్రిని పరిహారం చెల్లించమని పెద్దలు వేధించడంతో మనస్తాపానికి గురై భార్యతో కలిసి పురుగుల మందు తాగి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన యానాంలో గురువారం చర్చనీయాంశమైంది.

Updated : 09 Dec 2022 05:31 IST

చికిత్స పొందుతూ భర్త మృతి

యానాం, న్యూస్‌టుడే: కొడుకు చేసిన పొరబాటుకు తండ్రిని పరిహారం చెల్లించమని పెద్దలు వేధించడంతో మనస్తాపానికి గురై భార్యతో కలిసి పురుగుల మందు తాగి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన యానాంలో గురువారం చర్చనీయాంశమైంది. ఎస్సై బడుగు కనకారావు, మృతుడి తరఫు బంధువులు వెల్లడించిన వివరాల ప్రకారం.. సావిత్రినగర్‌కు చెందిన కామాడి దుర్గాప్రసాద్‌ సరకు రవాణా వ్యాన్‌ డ్రైవరుగా పనిచేస్తున్నాడు. గ్రామంలోని జెట్టీ వద్ద వ్యాన్‌ నిలిపిన సమయంలో ప్రమాదవశాత్తు అది ఉప్పుటేరులో పడిపోయి, మరమ్మతులకు రూ.1.50 లక్షలు ఖర్చయింది. దీంట్లో రూ.50వేలు డ్రైవర్‌ దుర్గాప్రసాద్‌ చెల్లించాలని పెద్దలు నిర్ణయించారు. అతడు ఆ సొమ్ము ఇవ్వలేదు. గ్రామంలో కోడిమాంసం అమ్ముకుని జీవిస్తున్న అతడి తండ్రి కామాడి ముత్యాలరావును ఆ సొమ్ము ఇవ్వాలంటూ గ్రామపెద్దలు ఒత్తిడి చేశారు. వేధింపులు భరించలేక ముత్యాలరావు, ఆయన భార్య పార్వతి చీమలమందు, ఫినాయిల్‌ కలుపుకొని డిసెంబరు 5న మధ్యాహ్నం తాగేశారు. యానాం ఆసుపత్రికి అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం కాకినాడకు వారిని తరలించారు. చికిత్స పొందుతూ గురువారం ముత్యాలరావు(47) కన్నుమూశాడు. ఈ నేపథ్యంలో గ్రామపెద్దలు నలుగురిపై కేసు నమోదు చేయనున్నట్లు ఎస్‌ఐ కనకారావు చెప్పారు.


‘గ్రామ పెద్దలే కారణం’

నా భర్త, నేను ఆత్మహత్యకు ప్రయత్నించడానికి కారణం గ్రామపెద్దలే.. నా భర్త, నేను చనిపోయినా నా కొడుకు, నా మనవడికి ఏ హాని జరిగినా కారణం సావిత్రినగర్‌ గ్రామపెద్దలే. అంటూ కామాడి పార్వతి ఇచ్చిన వీడియో వాంగ్మూలం గురువారం యానాంలో వైరల్‌ అయింది. కర్రి స్వామి, రేఖాడి  నారాయణ, చింతా అప్పారావు, మల్లాడి బీరాస్వామి తదితరుల వల్లే తాము పురుగుల మందు తాగి చనిపోతున్నామంటూ ఆమె పలు అభియోగాలు మోపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని