లారీ రావడంలేదని.. అన్నదాత ఆత్మహత్యాయత్నం

ధాన్యాన్ని తరలించేందుకు లారీలు రాకపోవడంతో జిల్లా వ్యాప్తంగా అన్నదాతలు ఆందోళనకు దిగుతున్నారు. సమస్యను పరిష్కరించాలని ప్రజాప్రతినిధులకు, అధికారులకు విన్నవిస్తున్నారు.

Published : 26 May 2023 04:37 IST

మెదక్‌ జిల్లా శివ్వంపేటలో ఘటన

శివ్వంపేట, న్యూస్‌టుడే: ధాన్యాన్ని తరలించేందుకు లారీలు రాకపోవడంతో జిల్లా వ్యాప్తంగా అన్నదాతలు ఆందోళనకు దిగుతున్నారు. సమస్యను పరిష్కరించాలని ప్రజాప్రతినిధులకు, అధికారులకు విన్నవిస్తున్నారు. ఇదే విషయంలో ఓపిక నశించి మెదక్‌ జిల్లా శివ్వంపేటలో గురువారం ఓ రైతు బలవన్మరణానికి ప్రయత్నించారు.ఎస్సై రవికాంత్‌రావు తెలిపిన ప్రకారం శివ్వంపేట మండల కేంద్రానికి చెందిన రైతు ముద్దగల్ల రవితేజ 29 రోజుల కిందట వడ్లను ఐకేపీ కొనుగోలు కేంద్రానికి తరలించారు. రెండు రోజులు ఎండబెట్టాక తూకం వేసినా, తరలించేందుకు లారీ రాకపోవడంతో గురువారం తహసీల్దారు కార్యాలయానికి వెళ్లి అధికారులకు విన్నవించారు. దీనిపై స్పందించిన తహసీల్దారు లారీ పంపిస్తామని చెప్పారు. అయినా రవితేజ వినకుండా, వెంటనే ధాన్యాన్ని తరలించాలని, తనతోపాటు చాలామంది రైతుల ధాన్యం ఉందని పట్టుబట్టారు. బస్తాలు తరలించడంలో ప్రజాప్రతినిధులు, అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించి, ఆగ్రహంతో డీజిల్‌ను తలపై, ఒంటిపై పోసుకున్నారు. అగ్గిపుల్ల వెలిగించేందుకు ప్రయత్నించగా అక్కడే ఉన్న భాజపా నాయకుడు రవిగౌడ్‌ అడ్డుకున్నారు. ఇంతలో కార్యాలయ సిబ్బంది, ఆరై కిషన్‌, డిప్యూటీ తహసీల్దారు ప్రభుదాస్‌ అక్కడికి చేరుకుని రైతుకు నచ్చజెప్పి అగ్గిపెట్టెను లాక్కుకున్నారు. లారీని పంపించి ధాన్యాన్ని మిల్లుకు తరలిస్తామని చెప్పడంతో రైతు అక్కడి నుంచి వెళ్లిపోయారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని