ఎవరైనా కాపాడండి

‘భాయ్‌ క్యా హోరహాహే(సోదరా ఏం జరుగుతోంది) సేవ్‌ కరో.. యా అల్లా’ అంటూ కంటెయినర్‌ లారీ క్యాబిన్‌లో చిక్కుకున్న ఓ డ్రైవర్‌ ఆర్తనాదాలు చేస్తూ.. గంటన్నర పాటు నరక యాతన అనుభవించారు.

Published : 09 Jun 2023 03:46 IST

లారీ క్యాబిన్‌లో చిక్కుకున్న డ్రైవర్‌ ఆర్తనాదాలు
గుంటూరు-విజయవాడ రహదారిపై రోడ్డు ప్రమాదం
ఘటనా స్థలంలో ఒకరు, ఆసుపత్రిలో మరొకరు మృతి

పెదకాకాని, న్యూస్‌టుడే: ‘భాయ్‌ క్యా హోరహాహే(సోదరా ఏం జరుగుతోంది) సేవ్‌ కరో.. యా అల్లా’ అంటూ కంటెయినర్‌ లారీ క్యాబిన్‌లో చిక్కుకున్న ఓ డ్రైవర్‌ ఆర్తనాదాలు చేస్తూ.. గంటన్నర పాటు నరక యాతన అనుభవించారు. గుంటూరు-విజయవాడ మార్గంలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న  జాతీయ రహదారిపై గురువారం ఓ కంటెయినర్‌ లారీ అదుపుతప్పి డివైడర్‌ పైనుంచి దూసుకెళ్లి అవతలి రోడ్డుపై వెళుతున్న మరో లారీని ఢీకొంది. ఈ ఘటనలో లారీ ముందు భాగం ధ్వంసమవ్వగా, అందులోని డ్రైవర్‌ అక్కడికక్కడే మృతి చెందారు. ఆయన్ను కృష్ణా జిల్లా బాపులపాడు మండలానికి చెందిన మనీశ్వరరావుగా గుర్తించారు. కంటెయినర్‌ లారీ క్యాబిన్‌లో చిక్కుకున్న కర్ణాటకలోని ఉడిపి ప్రాంతానికి డ్రైవర్‌ బషీర్‌ను స్థానికులు బయటకు తీసేందుకు యత్నించినా ఫలితం లేకపోయింది. సుమారు గంటన్నర తరువాత హైవేకు చెందిన క్రేన్‌తో కంటెయినర్‌ లారీని పక్కకునెట్టి ముందు భాగాన్ని తాడు సాయంతో వెనక్కు లాగారు. కొన ఊపిరితో ఉన్న బషీర్‌ను హైవే పెట్రోలింగ్‌ పోలీసులు క్యాబిన్‌ నుంచి బయటకు తీసి గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించగా, అక్కడ మృతి చెందారు.

తాడేపల్లి నుంచి క్రేన్‌ రావాల్సిందే

పెదకాకాని మండల పరిధిలోని జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాలు జరిగిన సమయంలో సహాయం అందించేందుకు తాడేపల్లి నుంచి క్రేన్‌ను రప్పించే పరిస్థితి ఉంది. గతంలో క్రేన్‌ కాజ టోల్‌గేటు వద్ద ఉండేది. ప్రస్తుతం అది తాడేపల్లి వద్ద ఉందని స్థానికులు తెలిపారు. టోల్‌గేటుకి కిలోమీటరు దూరంలో రెండు లారీలు ఢీకొన్న ఘటనా స్థలం ఉంది. టోల్‌గేటు వద్ద క్రేన్‌ ఉన్నట్లయితే డ్రైవర్‌ ప్రాణం పోయేది కాదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని