తాళం వేసిన మృతుడి ఇంట్లో చోరీకి.. అంబులెన్స్‌ డ్రైవర్‌ మాస్టర్‌ప్లాన్‌

మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌ నుంచి ఓ అంబులెన్స్‌ డ్రైవరు మధ్యప్రదేశ్‌లోని బైతుల్‌కు మృతదేహంతో బయలుదేరాడు. అదే సమయంలో.. నాగ్‌పుర్‌లో తాళం వేసి ఉన్న మృతుడి ఇంట్లోకి డ్రైవర్‌ కుమారుడు చొరబడి చోరీకి పాల్పడ్డాడు.

Updated : 03 Sep 2023 08:16 IST

హారాష్ట్రలోని నాగ్‌పుర్‌ నుంచి ఓ అంబులెన్స్‌ డ్రైవరు మధ్యప్రదేశ్‌లోని బైతుల్‌కు మృతదేహంతో బయలుదేరాడు. అదే సమయంలో.. నాగ్‌పుర్‌లో తాళం వేసి ఉన్న మృతుడి ఇంట్లోకి డ్రైవర్‌ కుమారుడు చొరబడి చోరీకి పాల్పడ్డాడు. ఓ పథకం ప్రకారం జరిగిన ఈ నేరాన్ని చూసి పోలీసులు సైతం అవాక్కయ్యారు. నాగ్‌పుర్‌లోని సక్కర్‌దరా ఠాణా పరిధిలో నివసిస్తున్న కల్పనా ఘోడే భర్త ఆగస్టు 20న ఓ ఆస్పత్రిలో మరణించారు. వీరి స్వస్థలం బైతుల్‌ కావడంతో అంత్యక్రియలు అక్కడే చేయాలని నిర్ణయించారు. దీంతో కల్పన భర్త మృతదేహాన్ని అంబులెన్సులో తీసుకొని బయలుదేరారు.

ఇదే అదనుగా ఆ అంబులెన్సు డ్రైవరు అశ్వజిత్‌ వాంఖడే చోరీకి పథకం వేశాడు. తాము బయలుదేరాక.. తాళం వేసి ఉన్న కల్పన ఇంట్లో దొంగతనం చేయాలని తన కుమారుడు రితేశ్‌ వాంఖడేకు పురమాయించాడు. రితేశ్‌ ఇద్దరు మైనర్లతో ఆ ఇంట్లో చొరబడి రూ.లక్షల విలువైన ఆభరణాలు, నగదు అపహరించాడు. కల్పన తిరిగి ఇంటికొచ్చాక చోరీ విషయం బయటపడింది. వీధిలో ఉన్న సీసీ టీవీ ఫుటేజి పరిశీలించిన పోలీసులు ముగ్గురు యువకులు బైక్‌పై వచ్చి చోరీ చేసినట్లు గుర్తించి, రితేశ్‌ను అరెస్టు చేశారు. విచారణలో డ్రైవరు పథకం మొత్తం బయటపడింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని