Hyderabad: దోషం ఉంది.. శాంతి చేయాలని ₹37 లక్షలు స్వాహా

మాయమాటలు చెప్పి అమాయకులను మోసం చేస్తున్న అంతర్రాష్ట్ర నకిలీ బాబా ముఠాను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. భువనగిరి ఎస్‌వోటీ, భువనగిరి టౌన్ పోలీసులు

Updated : 05 Jul 2022 16:01 IST

నకిలీ బాబా ముఠా అరెస్టు

హైదరాబాద్: మాయమాటలు చెప్పి అమాయకులను మోసం చేస్తున్న అంతర్రాష్ట్ర నకిలీ బాబా ముఠాను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. భువనగిరి ఎస్‌వోటీ, భువనగిరి టౌన్ పోలీసులు జాయింట్ ఆపరేషన్‌ నిర్వహించి ముఠాను పట్టుకున్నట్లు రాచకొండ సీపీ మహేష్ భగవత్‌ వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలు సీపీ మీడియాకు వివరించారు.

‘‘కొండల్ రెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాం. భువనగిరికి చెందిన కొండల్ రెడ్డి ట్రాన్స్‌పోర్టు బిజినెస్ చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం జరిగిన ప్రమాదంలో ద్విచక్రవాహనంపై నుంచి కింద పడ్డారు. దోషం ఉందని.. శాంతి చేయకపోతే ప్రాణాలు పోతాయని కొండల్ రెడ్డిని ముఠా నమ్మించింది. ఇందుకు కొండల్ రెడ్డి దగ్గర నుంచి విడతల వారీగా రూ.37.71 లక్షలు వసూలు చేశారు. ఈ కేసులో ఇప్పటివరకు ఏడుగురు నిందితులను అరెస్టు చేశాం. నిందితుల నుంచి రూ.8 లక్షలు నగదు, కౌంటింగ్ మిషన్, రుద్రాక్ష మాలలు, పూజా సామగ్రిని స్వాధీనం చేసుకున్నాం. తెలంగాణ సహా ఇతర రాష్ట్రాల్లోనూ ఇదే తరహా మోసాలకు పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది. నిందితులు రాజస్థాన్‌ నుంచి తెలంగాణకు వచ్చి మోసాలకు పాల్పడుతున్నారు’’ అని సీపీ వివరించారు.

నకిలీ ధ్రువీకరణ పత్రాలు.. ముఠా అరెస్టు

నకిలీ ధ్రువీకరణ పత్రాలను ఇస్తూ మోసాలకు పాల్పడుతున్న మరో ముఠాను కూడా అరెస్టు చేసినట్లు సీపీ మహేశ్‌ భగవత్‌ వెల్లడించారు. ‘‘తెలంగాణతో పాటు కర్ణాటకలోని పలు విశ్వవిద్యాలయాలకు సంబంధించిన సర్టిఫికెట్లను అక్రమంగా జారీ చేస్తున్నారు. ఈ ఘటనపై గతంలో చైతన్యపురి పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. కాకతీయ యూనివర్సిటీ, జేఎన్‌టీయూ, ఆచార్య నాగార్జున యూనివర్సిటీలకు చెందిన నకిలీ సర్టిఫికెట్లను జారీ చేస్తున్నారు. గత 6 నెలల నుంచి ముఠా ఈ దందా చేస్తోంది. ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా ఉన్న రోహిత్ కుమార్‌తో పాటు మరో ముగ్గురిని అరెస్టు చేశాం. రోహిత్ ఐటీ ఉద్యోగి. వ్యసనాలకు అలవాటు పడి నకిలీ సర్టిఫికెట్లను తయారు చేసి డబ్బులు వసూలు చేస్తున్నాడు. శ్రీలక్ష్మి కన్సల్టెన్సీ ద్వారా ఈ దందా కొనసాగిస్తున్నారు. ఒక్క సర్టిఫికెట్‌కు రూ. 30వేలు నుంచి రూ.40వేలు వసూలు చేస్తున్నారు. అసలు లేని కాలేజీల పేర్లతో కూడా సర్టిఫికెట్లు ఇస్తున్నారు. విదేశాలకు వెళ్లే విద్యార్థులు ఎక్కువగా వీటిని తీసుకుంటున్నారు. ఇప్పటివరకు ఈ ముఠా 20 మందికి సర్టిఫికెట్స్ ఇచ్చినట్టు దర్యాప్తులో తేలింది. నిందితుల నుంచి నకిలీ సర్టిఫికెట్లు, ల్యాప్‌టాప్స్, ప్రింటర్స్, మొబైల్స్ స్వాధీనం చేసుకొని సీజ్ చేశాం’’ అని సీపీ తెలిపారు. 

కౌన్‌ బనేగా కరోడ్‌పతి పేరుతో మోసం..

కౌన్‌ బనేగా కరోడ్‌పతి పేరుతో రూ.3 కోట్ల మేర మోసాలకు పాల్పడిన సైబర్‌ నేరగాడిని హైదరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. గత కొంతకాలంగా తప్పించుకుని తిరుగుతున్న నిందితుడిని ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లు సహా తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా నిందితుడిపై పలు కేసులు నమోదు అయ్యాయి. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఇటీవలే ఓ బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడిని బిహార్‌లో అరెస్టు చేసినట్లు సీపీ తెలిపారు.


Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని