Andhra News: వీడిన డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం మర్డర్‌ మిస్టరీ.. వివరాలు వెల్లడించిన కాకినాడ ఎస్పీ

వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు మాజీ డ్రైవర్‌ హాత్య కేసు మిస్టరీ వీడింది. ఈ మేరకు ఈ కేసుకు సంబంధించిన వివరాలను కాకినాడు ఎస్పీ రవీంద్రనాథ్‌ మీడియాకు వెల్లడించారు.

Updated : 23 May 2022 23:28 IST

కాకినాడ: వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు మాజీ డ్రైవర్‌ హాత్య కేసులో మిస్టరీ వీడింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను కాకినాడ ఎస్పీ రవీంద్రనాథ్‌ మీడియాకు వెల్లడించారు. ‘‘సుబ్రహ్మణ్యం అనుమానాస్పద మృతిపై ఆయన తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశాం. మొదట అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశాం. సుబ్రహ్మణ్యం బంధువులు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం హత్య కేసుగా నమోదు చేశాం. దర్యాప్తులో భాగంగా లభించిన ప్రాథమిక ఆధారాలు, వాంగ్మూలాల ఆధారంగా ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్టు చేశాం. హత్య ఘటనపై నిన్న డీఎస్పీకి విచారణ బాధ్యతలు అప్పగించాం. ప్రధాన నిందితుడి కోసం 6 బృందాలుగా ఏర్పడి గాలించాం. ఇవాళ ఉదయం ఎమ్మెల్సీ అనంతబాబును కస్టడీలోకి తీసుకున్నాం. ఏలూరు రేంజ్‌ డీఐజీ పాలరాజు ఆధ్వర్యంలో విచారణ కొనసాగింది. విచారణలో అనంతబాబు చెప్పిన వివరాల ప్రకారం, దర్యాప్తులో భాగంగా లభించిన సాంకేతిక ఆధారాల మేరకు ఎమ్మెల్సీ అనంతబాబును ప్రధాన నిందితుడిగా పరిగణించి అరెస్టు చేశాం. విచారణ అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం కాకినాడ ఏఆర్‌ కార్యాలయం నుంచి అనంతబాబును జీజీహెచ్‌కు తరలించారు. ఏఆర్‌ కార్యాలయం నుంచి గట్టి బందోబస్తు మధ్య ఆయన్ను ఆస్పత్రికి తీసుకొచ్చారు. అక్కడ అనంతబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించారు. 

ఆ రోజేం జరిగిందంటే?

ఈ నెల 19న సుబ్రహ్మణ్యం హత్యకు గురయ్యాడు. ఆ రోజు సుబ్రహ్మణ్యం రాత్రి 8 గంటల ప్రాంతంలో ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. స్నేహితులతో కలిసి మద్యం కొనుగోలు చేసి సమీపంలోని పాఠశాలలో మద్యం తాగారు. రాత్రి 10 గంటల వరకు వారు అక్కడే ఉన్నారు. అనంతరం సుబ్రహ్మణ్యం తన స్నేహితులతో కలిసి రోడ్డుపైకి రావడం.. అదే సమయంలో అనంతబాబు తన కారులో అక్కడికి వచ్చి సుబ్రహ్మణ్యంను తీసుకెళ్లారు. వీరిద్దరూ కొద్ది దూరం వెళ్లి జన్మభూమి పార్క్‌ ప్రాంతంలో టిఫిన్‌ తీసుకొని ఎమ్మెల్సీ నివాసం ఉన్న శంకర్‌ టవర్స్‌ శ్రీరాంనగర్‌ వైపు వెళ్లారు. అప్పుడు సమయం రాత్రి 10.30 అయింది. సుబ్రహ్మణ్యం వివాహానికి ఎమ్మెల్సీ కొంత నగదు సాయం చేశారు. దానిలో మృతుడు కొంత అప్పు తీర్చాడు. ఇంకొత ఇవ్వాల్సి ఉంది. ఈ విషయంలో వారిద్దరి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ‘‘నువ్వు ప్రవర్తన మార్చుకుంటే నిన్ను మళ్లీ పనిలోకి తీసుకోవాలని మీ అమ్మ చెప్పింది. మళ్లీ తాగుతున్నావ్‌.. నీలో ఎలాంటి మార్పు రాలేదు’’ అని ఇద్దరి మధ్య వాదన జరిగింది. ఇలా ఎమ్మెల్సీ నివాసం దగ్గరకు వెళ్లగానే నువ్వు నీ ప్రవర్తన మార్చుకోలేదని సుబ్రహ్మణ్యాన్ని కొట్టడం జరిగింది. అప్పటికే తాగి ఉన్న సుబ్రహ్మణ్యం.. ఎందుకు కొడుతున్నావంటూ ప్రశ్నించాడు. దీంతో నన్నే ఎదురు ప్రశ్నిస్తావా..? అంటూ కోపంతో ఉన్న ఎమ్మెల్సీ అతడి మెడ పట్టుకొని పక్కకు తోసేశాడు. దీంతో సుబ్రహ్మణ్యం అక్కడే ఉన్న డ్రైనేజీ గట్టుమీద పడడంతో తలకు గాయమైంది. నన్నే కొడతావా అంటూ సుబ్రహ్మణ్యం మరోసారి వాగ్వాదానికి దిగడంతో మరోసారి మెడపై చేయివేసి తోసేశారు. దీంతో మరోసారి డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం తలకు గాయమైంది. 

మర్డర్‌ను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం!

వెంటనే స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తీసుకెళ్లాలని చూశారు. ఆ సమయంలో వైద్యులు అందుబాటులో లేరు. అదే సమయంలో కారులో ఉన్న సుబ్రహ్మణ్యంకు వెక్కిళ్లు రావడం అనంతబాబు గమనించి తాగేందుకు నీరు ఇచ్చారు. తాగిన కొద్ది సేపటికే సుబ్రహ్మణ్యం నుంచి ఎలాంటి స్పందన లేదు. శ్వాస ఆగిపోవడం గమనించిన అనంతబాబు.. అతడు మృతి చెందినట్లు నిర్ధరణకు వచ్చారు. గతంలో ఎమ్మెల్సీ వద్ద డ్రైవర్‌గా పని చేసే సమయంలో సుబ్రహ్మణ్యంకు తాగి యాక్సిడెంట్ చేసిన చరిత్ర ఉంది. ఇలా చేసిన ప్రతిసారీ తీసుకెళ్లి ఇంట్లో దింపడం జరిగింది. ఏం చేయాలో అర్థం కాని ఎమ్మెల్సీ అనంతబాబు అదే సమయంలో ఓ ఆలోచన వచ్చింది. యాక్సిడెంట్‌ అనే స్టోరీ క్రియేట్ చేయాలని ఆలోచించి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నం చేశారు. ట్రాఫిక్‌ ఉండడంతో సాధ్యపడలేదు. రోడ్డు ప్రమాదం అని చిత్రీకరించాలంటూ ఒంటిపై దెబ్బలు ఉండాలని భావించి వెంటనే సమీపంలోని డంపింగ్‌ యార్డుకు తీసుకెళ్లారు. అందుబాటులో ఉన్న కర్రలు, తాళ్లతో సుబ్రహ్మణ్యం శరీరంపై తీవ్రంగా గాయలు అయ్యేలా చేశారు.

కారు వదిలేసి వెళ్లిపోయిన ఎమ్మెల్సీ..

ఆ అర్ధరాత్రి 12.30 ప్రాంతంలో సుబ్రహ్మణ్యం తల్లికి ఫోన్‌ చేసి ‘సుబ్బుకు యాక్సిడెంట్‌ అయినట్లు నాకు ఫోన్‌ వచ్చింది. నేను అక్కడకి వెళ్తున్నాను. దగ్గర్లోని అమృత ఆస్పత్రికి తీసుకెళ్తున్నాను. మీరు అక్కడికి రండి అని’’ ఎమ్మెల్సీ చెప్పారు. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. తానే స్వయంగా తీసుకెళ్లి ఇంట్లో వదిలేశారు. సుబ్రహ్మణ్యం ఒంటిపై ఉన్న గాయాలు చూసిన కుటుంబసభ్యులు ఇవి ప్రమాదం వల్ల తగిలిన గాయాలు కావని అనుమానం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో సుబ్రహ్మణ్యం కుటుంబీకులు, ఎమ్మెల్సీ మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. దాదాపు గంట సేపు వారి మధ్య చర్చలు, వాగ్వాదం జరిగింది. ఉదయం 4 గంటల ప్రాంతంలో పోలీసులకు ఫిర్యాదు చేయాలని సుబ్రహ్మణ్యం కుటుంబసభ్యులు నిర్ణయించారు. వెంటనే ఎమ్మెల్సీ.. తన కారును అక్కడే వదిలేసి ద్విచక్రవాహనంపై అక్కడ నుంచి వెళ్లిపోయారు. ఇవన్నీ ప్రాథమిక దర్యాప్తు ద్వారా నిర్ధరణకు వచ్చిన వివరాలు’’ అని ఎస్పీ వివరించారు.

మెజిస్ట్రేట్‌ ముందు నిందితుడి హాజరు

మరోవైపు, విచారణ అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం కాకినాడ ఏఆర్‌ కార్యాలయం నుంచి అనంతబాబును జీజీహెచ్‌కు తరలించారు. ఏఆర్‌ కార్యాలయం నుంచి గట్టి బందోబస్తు మధ్య ఆయన్ని ఆస్పత్రికి తీసుకొచ్చారు. అక్కడ అనంతబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించారు. జీజీహెచ్‌లో వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత అనంతబాబును మేజిస్ట్రేట్‌ ఎదుట హాజరుపరిచారు. విచారించిన న్యాయమూర్తి అనంతబాబుకు 14రోజుల పాటు రిమాండ్‌ విధించారు. పోలీసులు అనంతబాబును రాజమహేంద్రవరం జైలుకు తరలించనున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని