Delhi Murder: ఆ తల, చేతులు శ్రద్ధావేనా..?

సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్‌ హత్య జరిగిన కొద్ది రోజులకు తూర్పు దిల్లీలోని ఓ ప్రాంతంలో కుళ్లిపోయిన స్థితిలో ఉన్న తల, చేతులను పోలీసులు గుర్తించారు. అవి శ్రద్ధావేనా? కాదా అన్నది తెలియాల్సి ఉంది.

Published : 17 Nov 2022 13:58 IST

దిల్లీ: శ్రద్ధా వాకర్‌ హత్య కేసులో దిల్లీ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితుడు అఫ్తాబ్ ఇచ్చిన వివరాలతో మృతురాలి శరీర భాగాలను కనుగొనేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే గతంలో దొరికిన గుర్తుతెలియని మృతదేహాలు/శరీర భాగాల కేసులపై పోలీసులు దృష్టిపెట్టారు. కాగా.. శ్రద్ధా హత్య జరిగిన కొద్ది రోజులకే తూర్పు దిల్లీలో ఓ చోట కుళ్లిపోయిన స్థితిలో తల, చేతులు లభించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ విషయం తాజాగా బయటికొచ్చింది.

మే 18న దిల్లీలోని మెహ్రౌలీ ప్రాంతంలో శ్రద్ధా హత్యకు గురైంది. ఈ ప్రాంతానికి కొద్ది దూరంలోనే ఉన్న త్రిలోక్‌పురి ప్రాంతంలో ఈ ఏడాది జూన్‌లో కొన్ని గుర్తుతెలియని శరీరభాగాలను పోలీసులు గుర్తించారు.  పాండవ్‌నగర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలోని రామ్‌లీలా మైదానానికి సమీపంలో కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మనిషి తలను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు, ఫోరెన్సిక్‌ బృందం.. ఓ చెత్తకుప్పలో ఉన్న తల, చేతులను గుర్తించారు. అక్కడ పడేయడానికి ముందు ఆ శరీర భాగాలను ఫ్రిజ్‌లో భద్రపర్చినట్లు అప్పుటి ప్రాథమిక దర్యాప్తులో తేలిందని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. 
అవి ఒకే మృతదేహానికి చెందినవి అయి ఉంటాయని అప్పట్లో పోలీసులు భావించారు. దీంతో వాటిని ఎవరు పడేశారా అని తెలుసుకోవడం కోసం సీసీటీవీ ఫుటేజ్‌లు పరిశీలించారు. ఈ కేసులో ఎటువంటి పురోగతి లభించకపోవడంతో తదుపరి దర్యాప్తు కోసం కేసును దక్షిణ దిల్లీ పోలీసులకు అప్పగించారు.

శ్రద్ధా హత్య జరిగిన కొద్ది రోజులకే ఈ అవయవాలను గుర్తించడంతో ఇప్పుడు పోలీసులు ఆ కేసుపై దృష్టిపెట్టారు. తూర్పు దిల్లీలో లభ్యమైన తల, చేతుల భాగాలను డీఎన్‌ఏ పరీక్షలకు పంపించారు. అవి శ్రద్ధావేనా? కాదా? అన్నది ఫోర్సెనిక్‌ నివేదిక వస్తేనే తెలుస్తుందని పోలీసులు చెబుతున్నారు. కాగా, హత్య అనంతరం ఆమెను గుర్తించడానికి వీల్లేకుండా తల భాగాన్ని కాల్చేసిన తర్వాత పారేసినట్లు నిందితుడు పోలీసుల ఎదుట అంగీకరించినట్లు తెలుస్తోంది.  

శ్రద్ధాను హత్య చేసిన తర్వాత ఆమె శరీరాన్ని ముక్కలుగా నరికిన తర్వాత వాటిని దిల్లీలోని పలు చోట్ల విసిరేసినట్లు నిందితుడు అఫ్తాబ్‌ పోలీసులు విచారణలో అంగీకరించిన విషయం తెలిసిందే. ఎక్కువగా మెహ్రౌలీ అటవీ ప్రాంతంలో పడేసినట్లు చెప్పడంతో.. నిందితుడిని తీసుకుని అక్కడ వెతికారు. ఆ ప్రాంతంలో ఇప్పటివరకూ 10కి పైగా ఛిద్రమైన భాగాలు దొరికాయి. అయితే అవి శ్రద్ధావేనా? లేదా అన్నది ఇంకా తెలియరాలేదు. ఈ కేసులో ఇప్పటివరకు శ్రద్ధా తలను పోలీసులు గుర్తించలేదు. దీంతో పాటు ఆమెను చంపినట్లుగా భావిస్తున్న ఆయుధం, ఆమె దుస్తులను కనుగొనలేదు. హత్య జరిగి నెలలు కావడంతో ఆమె శరీరభాగాలు ఇప్పటికే కుళ్లిపోవడమో లేదా వీధి శునకాలు తినేయడమో జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో ఈ కేసు నిరూపణకు సాక్ష్యాధారాల సేకరణ పోలీసులకు సవాల్‌గా మారింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని