ఆస్తి కోసం తండ్రికి చిత్రహింసలు.. పశ్చిమ బెంగాల్‌లో వదిలేసిన కుమారుడు

ఆస్తి ఇవ్వలేదనే అక్కసుతో కన్న తండ్రిని తెలియని చోట వదిలేసి వేరే ప్రాంతానికి మకాం మార్చిన కుమారుడి ఉదంతమిది.. తెలుగువారైన వి.కృష్ణారావు(65) పశ్చిమ బెంగాల్‌లోని

Updated : 02 Nov 2021 08:38 IST

మూడు నెలలు గాలించి.. కనుగొన్న తోబుట్టువు

కృష్ణారావు                                జగన్‌మోహన్‌రావు

ఖరగ్‌పుర్‌, న్యూస్‌టుడే: ఆస్తి ఇవ్వలేదనే అక్కసుతో కన్న తండ్రిని తెలియని చోట వదిలేసి వేరే ప్రాంతానికి మకాం మార్చిన కుమారుడి ఉదంతమిది.. తెలుగువారైన వి.కృష్ణారావు(65) పశ్చిమ బెంగాల్‌లోని పశ్చిమ మిడ్నాపూర్‌ జిల్లా ఖరగ్‌పుర్‌లో నివసిస్తున్నారు. రైల్వేలో పనిచేసి, ఇటీవల రిటైర్‌ కాగా, ప్రభుత్వ పింఛన్‌ వస్తోంది. స్థిరాస్తిని తన పేరిట రాయాలని కృష్ణారావుపై కుమారుడు విజయ్‌కుమార్‌ ఒత్తిడి చేశారు. అందుకు అంగీకరించకపోవడంతో జులైలో అక్కడే ఓ షాపింగ్‌మాల్‌ ప్రాంతంలో తండ్రిపై దాడి చేశాడు. స్పృహ కోల్పోయిన కృష్ణారావును వదిలేసి వెళ్లిపోగా.. షాపింగ్‌మాల్‌ సిబ్బంది ఆసుపత్రిలో చేర్పించారు.       10 రోజుల చికిత్స తర్వాత ఇంటికి చేరుకున్న కృష్ణారావుతో విజయ్‌కుమార్‌ మళ్లీ గొడవ పడ్డారు.    ఓ రోజు తన స్నేహితులతో కలిసి తండ్రిని బలవంతంగా కారులో ఎక్కించుకుని వెళ్లిన విజయ్‌... మిడ్నాపూర్‌లోని వృద్ధుల పునరావాస కేంద్రంలో చేర్పించాడు. తన తండ్రికి మానసిక రోగం ఉందని చెప్పి.. హైదరాబాద్‌కు మకాం మార్చాడు. ఇక్కడ తండ్రి పింఛన్‌ తీసుకుంటూ, ప్రతినెలా రూ.5 వేలు పునరావాస కేంద్రానికి పంపించాడు.

మూడు నెలల అన్వేషణతో తెలిసిన ఆచూకీ
కృష్ణారావు తమ్ముడు జగన్‌మోహన్‌రావు తన అన్నయ్య గురించి విజయ్‌ను అడగ్గా.. ఎటో వెళ్లిపోయాడంటూ దాటవేశాడు. అయినా, మూడు నెలల పాటు తోబుట్టువు జాడ కోసం ఖరగ్‌పుర్‌ చుట్టుపక్కల ఆసుపత్రులు, సత్రాల్లో గాలించిన మోహన్‌రావు.. చివరకు అక్కడి తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు బొంత మురళీ సాయంతో పునరావాస కేంద్రంలో ఉన్నట్లు తెలుసుకున్నారు. కృష్ణారావును అప్పగించేందుకు అక్కడి సిబ్బంది తొలుత నిరాకరించగా.. ఆధారాలు చూపించి, వారికి నచ్చజెప్పి ఇటీవలే సోదరుడిని బయటకు తీసుకువచ్చారు. ఈ ఘటనపై ఖరగ్‌పుర్‌ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని