Crime News: వివేకా హత్యకేసులో కీలక పరిణామం.. సీబీఐ కస్టడీకి శివశంకర్‌రెడ్డి 

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిని పులివెందుల కోర్టు సీబీఐ కస్టడీకి అనుమతించింది. వివేకా హత్య కేసులో అరెస్టు అయిన

Published : 26 Nov 2021 01:58 IST

పులివెందుల: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన  మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడు, వైకాపా రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిని పులివెందుల కోర్టు సీబీఐ కస్టడీకి అనుమతించింది. వివేకా హత్య కేసులో అరెస్టు అయిన దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిని 8 రోజులు కస్టడీకి ఇవ్వాలని పులివెందుల కోర్టులో సీబీఐ పిటిషన్‌ దాఖలు చేసింది. సీబీఐ పిటిషన్‌పై వాదనలు విన్న పులివెందుల న్యాయస్థానం 7 రోజుల కస్టడీకి అనుమతించింది. కోర్టు ఆదేశాల మేరకు డిసెంబరు 2వ తేదీ వరకు శివశంకర్‌రెడ్డిని సీబీఐ కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించనుంది. దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి ప్రస్తుతం కడప కేంద్ర కారాగారంలో రిమాండ్‌లో ఉన్నారు. వివేకా హత్యకు సంబంధించి శివశంకర్‌రెడ్డి సీబీఐ విచారణలో ఏం చెబుతారనే విషయంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

వివేకా హత్యకేసులో అప్రూవర్‌గా మారిన షేక్‌ దస్తగిరి ఇప్పటికే సీబీఐకి అనేక వివరాలు వెల్లడించారు.‘వైఎస్‌ వివేకానందరెడ్డిని చంపేయ్‌. నువ్వు ఒక్కడివే కాదు మేమూ నీతో పాటు వస్తాం. దీని వెనుక వైఎస్‌ అవినాష్‌రెడ్డి, వైఎస్‌ మనోహర్‌రెడ్డి, వైఎస్‌ భాస్కర్‌రెడ్డి, డి.శంకర్‌రెడ్డి వంటి పెద్దవాళ్లు ఉన్నారు. ఈ హత్య చేస్తే శంకర్‌రెడ్డి రూ.40 కోట్లు ఇస్తారు. అందులో రూ.5 కోట్లు నీకు ఇస్తాను’ అంటూ వివేకాకు సన్నిహితుడైన ఎర్ర గంగిరెడ్డి తనతో చెప్పారని నిందితుల్లో ఒకరు, అప్రూవర్‌గా మారిన షేక్‌ దస్తగిరి వెల్లడించారు. ఆ సమయంలో యాదటి సునీల్‌ యాదవ్‌, గజ్జల ఉమాశంకర్‌రెడ్డిలు కూడా ఉన్నారని తెలిపారు. అలా 2019 ఫిబ్రవరి 10న గంగిరెడ్డి ఇంట్లోనే ఈ హత్య కుట్ర రూపొందిందని చెప్పారు. ‘డ్రైవర్‌గా ఏం సంపాదిస్తావ్‌? ఈ హత్య చెయ్యి. నీ జీవితం సెటిలైపోద్ది’ అంటూ గంగిరెడ్డి తనతో చెప్పాడన్నారు. ఆ ఘటన జరిగిన నాలుగు రోజుల తర్వాత సునీల్‌ తనకు రూ.కోటి అడ్వాన్సు ఇచ్చాడని చెప్పారు. ఈ మేరకు కడప జిల్లా ప్రొద్దుటూరు ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి న్యాయస్థానంలో సీఆర్‌పీసీ 164(1) ప్రకారం దస్తగిరి ఆగస్టు 31న, సీబీఐకి ఆగస్టు 25న వాంగ్మూలాలు ఇచ్చిన విషయం తెలిసిందే. వివేకాను ఎలా హత్యచేశారో కూడా దస్తగిరి పూస గుచ్చినట్టు సీబీఐకి వివరించి కోర్టులో వాంగ్మూలం ఇచ్చాడు. ఈనేపథ్యంలో శివశంకర్‌రెడ్డిని సీబీఐ కస్టడీకి తీసుకోవడం కీలక పరిణామంగా మారింది. ఈకేసులో ఇంకా ఎవరి పేర్లు బయటికొస్తాయోననే చర్చ జరుగుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని