Borewell: ప్రమాదం నుంచి రక్షించారు.. అయినా ప్రాణాలు దక్కలేదు..!

Borewell: గుజరాత్‌లో బోరుబావిలో పడ్డ చిన్నారిని ప్రాణాలతో బయటకు తీసినప్పటికీ.. ఆస్పత్రిలో కన్నుమూయడంతో విషాదం నెలకొంది.

Updated : 02 Jan 2024 10:49 IST

గాంధీనగర్‌: గుజరాత్‌లో బోరుబావిలో పడ్డ చిన్నారి ఘటన విషాదాంతమైంది. సైనిక, ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు తీవ్రంగా శ్రమించి ఆ చిన్నారిని ప్రాణాలతో బయటకు తీసినప్పటికీ.. చికిత్స పొందుతూ తుదిశ్వాస విడవడం అందరినీ కలచివేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుజరాత్‌లోని దేవభూమి ద్వారక జిల్లాలో సోమవారం మధ్యాహ్నం 1 గంట సమయంలో ఓ చిన్నారి ప్రమాదవశాత్తూ బోరుబావిలో పడింది. వెంటనే పోలీసులు ‘జాతీయ విపత్తు స్పందన దళం (NDRF)’తో పాటు సైనిక వర్గాలకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన ఆయా బృందాలు తొమ్మిది గంటల పాటు శ్రమించి ఎట్టకేలకు చిన్నారిని ప్రాణాలతో బయటకు తీశారు. అందుకోసం తాడు, ఓ లోహపు కొక్కేన్ని ఉపయోగించినట్లు అధికారులు తెలిపారు.

అయితే, బయటకు తీసే సమయానికే చిన్నారి అపస్మారక స్థితికి చేరుకొంది. వెంటనే గ్రీన్‌ కారిడార్‌ ఏర్పాటు చేసి హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. కానీ, ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో తమ పాప మృంత్యుంజయురాలిగా తిరిగొచ్చిందని సంతోషించే లోపే శాశ్వతంగా దూరం కావడం తల్లిదండ్రులకు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని