Crime News: మేడ్చల్‌ జిల్లాలో విషాదం.. ఈతకు వెళ్లి ఆరుగురి మృతి

మేడ్చల్‌ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. జవహార్‌నగర్‌ పరిధిలో ఉన్న మల్కారంలోని ఎర్రగుంట చెరువులో ఈతకు దిగి ఆరుగురు మృతి చెందారు.

Updated : 05 Nov 2022 17:15 IST

మేడ్చల్‌: మేడ్చల్‌ జిల్లాలో పెను విషాదం చోటు చేసుకుంది. చెరువులో ఈతకు వెళ్లి ఆరుగురు మృత్యువాత పడిన ఘటన జవహర్‌నగర్‌ పీఎస్‌ పరిధిలో జరిగింది. మృతులు కాచిగూడ అడ్జి కార్ఖానాలోని మదర్సాకు చెందిన విద్యార్థులుగా గుర్తించారు. జవహర్‌నగర్‌ పీఎస్ పరిధిలోని మల్కాపురం ఎర్రగుంట చెరువులో పడి విద్యార్థులు మృతి చెందినట్టు స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు స్థానికుల సాయంతో గాలించారు. ఐదుగురు విద్యార్థులు, మరో వ్యక్తి మృతదేహాన్ని చెరువులో నుంచి బయటకు తీశారు. మృతులు ఇస్మాయిల్, జాఫర్‌, సోహేల్‌, అయాన్‌, రియాన్‌.. వీరిని కాపాడేందుకు చెరువులో దూకిన ఉపాధ్యాయుడు యోహాన్‌గా గుర్తించారు. 

విద్యార్థులంతా 12 నుంచి 14 ఏళ్ల వయస్సున్న వారే. చెరువులో సరదాగా ఈతకోసం దిగిన విద్యార్థులు.. క్రమంగా లోపలికి వెళ్లారు. లోతు ఎక్కువగా ఉండటంతో ఈత రాక ఐదుగురు మునిగిపోయారు. వీళ్లను కాపాడేందుకు వెళ్లిన మదర్సా ఉపాధ్యాయుడు సైతం నీళ్లలో మునిగి చనిపోయాడు. కాచిగూడలోని హానీఫా మదర్సా నుంచి 25 మంది విద్యార్థులు, నలుగురు ఉపాధ్యాయులు కలిసి జవహర్‌నగర్‌లో ఉన్న మరో మదర్సాకు వెళ్లారు. అందులో కొందరు విద్యార్థులు సరదాగా చెరువు వద్దకు వెళ్లగా ఈ దుర్ఘటన జరిగింది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని