logo

ఉచిత బస్సు ఎవరికో?

స్వాతంత్య్ర వజ్రోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రత్యేక కార్యక్రమానికి నాంది పలికింది. ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవం (ఆగస్టు 15)రోజు జన్మించిన వారందరికి ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణం

Published : 11 Aug 2022 05:44 IST

పంద్రాగస్టు చిన్నారికి ‘ఆర్టీసీ’ అండ

మంచిర్యాల సిటీ, న్యూస్‌టుడే: స్వాతంత్య్ర వజ్రోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రత్యేక కార్యక్రమానికి నాంది పలికింది. ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవం (ఆగస్టు 15)రోజు జన్మించిన వారందరికి ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణం చేసేందుకు అవకాశం కల్పిస్తోంది. ఆయా లబ్ధిదారులు 12 ఏళ్లు వచ్చే వరకు రాష్ట్రంలోని ఏ ప్రాంతానికైనా ఎలాంటి ఛార్జీ చెల్లించకుండా వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఉమ్మడిజిల్లా వ్యాప్తంగా దాదాపు నాలుగువేల మంది గర్భిణులు ప్రసవానికి సిద్ధంగా ఉండగా ఈ నెల 15న (24గంటలు)ఎంతమంది ప్రసవం అవుతారనేది మరో నాలుగురోజుల్లో తేలనుంది. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులని తేడా లేకుండా ఎక్కడ జన్మించినా ఈ లబ్ధి చేకూరనుంది.  

ఎంతమందికి వర్తిస్తుందో..

సాధారణంగా గర్భిణులు 36-40 వారాల మధ్య ప్రసవం అవుతారని ప్రసూతి వైద్యనిపుణులు చెబుతున్నారు. 36 వారాలు నిండిన తర్వాత ఎప్పుడైనా నొప్పులు రావచ్చని, వచ్చినా ప్రసవం చేయాల్సిన అవసరం ఉంటుందని చెబుతుండగా 40 వారాలు దాటితే మాత్రం కచ్చితంగా చేయాల్సిందేనంటున్నారు. అది సాధారణమైనా, శస్త్రచికిత్స ద్వారానైనా చేయాలి. ప్రస్తుతం ప్రతి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో నెలకు 950-1000 ప్రసవాలు అవుతుండగా ప్రతిరోజు 30-35 జరుగుతున్నాయి. ఈ లెక్కలు చూస్తే ఆగస్టు 15న జిల్లాకు 30 చొప్పున 120 మందికి పైగా ఆర్టీసీ అందుబాటులోకి తీసుకొచ్చిన లబ్ధి పొందనున్నారు. ఈ ఉచిత ప్రయాణంతోపాటు స్వాతంత్య్ర దినోత్సవం అనేది ప్రత్యేక రోజు కావడంతో మరికొంతమంది ఈ తేదికే ఆసక్తి చూపించే అవకాశం కనిపిస్తుంది. ఎంతమందికి లబ్ధి జరుగుతుందో తెలియాలంటే వచ్చే వారం వరకు వేచిచూడాల్సిందే.

ఆరున్నర ఏళ్లలో సగం డబ్బులు ఆదా..

ఆర్టీసీ ఇచ్చిన ఈ అవకాశంతో 15వ తేదిన జన్మించిన చిన్నారులకు దాదాపు ఆరున్నర ఏళ్ల పాటు లబ్ధి జరగనుంది. ప్రస్తుతం పుట్టిన దగ్గర నుంచి నాలుగున్నర సంవత్సరాలు వచ్చే వరకు పూర్తి ఉచితంగా ప్రయాణం చేస్తుండగా ఆ తర్వాత నుంచి 12వ ఏటా వచ్చే వరకు టికెట్‌ ధరలో సగం (హాఫ్‌ టికెట్‌) మాత్రమే అందిస్తున్నారు. 12 ఏళ్లు రాగానే యథావిధిగా పూర్తి టికెట్‌ ధర చెల్లించాల్సిందే. కాగా ప్రస్తుతం అందుబాటులోకి తీసుకొస్తున్న ఈ కార్యక్రమంతో లబ్ధిదారులకు సగం డబ్బులు ఆదా కానున్నాయి.

మంచిర్యాల జీజీహెచ్‌కు పరీక్షల కోసం వచ్చిన గర్భిణులు


జాగ్రత్తలు తీసుకుంటాం
డా.హరిశ్చంద్రారెడ్డి, జీజీహెచ్‌ పర్యవేక్షణాధికారి

ఆసుపత్రిలో ప్రసవమైన సమయాన్ని వెంటనే నమోదు చేయిస్తున్నాం. 15న జన్మించిన చిన్నారులందరికి ఆర్టీసీ ప్రత్యేక కానుక అందించడంతో మరింత జాగ్రత్తలు తీసుకుంటూ తేది, సమయాన్ని ఎప్పటికప్పుడు నమోదు చేసేలా చర్యలు తీసుకుంటాం. ప్రసవానికి వచ్చే గర్భిణులకు ఎలాంటి ఇబ్బందులు, పడకల సమస్యలు లేకుండా చూస్తాం.


లబ్ధి చేకూరుతుంది
వి.రవీంద్రనాథ్‌, ఆర్టీసీ డీఎం, మంచిర్యాల

ఉన్నతాధికారులు ప్రకటించిన విధంగా ఈ ఏడాది ఆగస్టు 15వ తేదిన జన్మించిన చిన్నారులందరికి ఉచిత ప్రయాణానికి సంబంధించిన లబ్ధి చేకూరనుంది. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రి అనే తేడా లేకుండా స్వాతంత్య్ర దినోత్సవం రోజున పుట్టిన వారందరికి వర్తిస్తుంది.

తొమ్మిది నెలలు పూర్తిచేసుకుని ఈడీడీ(ఎస్టీమేట్‌ డెలివరీ డేట్‌) ఈ నెలలో ప్రసవమయ్యే అవకాశం ఉన్న గర్భిణుల వివరాలు ఇలా..
మంచిర్యాల: 905
నిర్మల్‌ :  1155
ఆదిలాబాద్‌:  1,114
కుమురంభీం: 778
మొత్తం: 3,950  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని