logo

కార్మిక క్షేత్రం.. ఉపాధికి కేంద్రం

కార్మిక ప్రాంతాలకు ప్రధాన కేంద్రంగా మంచిర్యాల జిల్లా అభివృద్ధి చెందుతోంది. ఇక్కడ సింగరేణి బొగ్గు గనులు, విద్యుత్తు ఉత్పత్తి కేంద్రం, చిన్నతరహా పరిశ్రమలు విస్తరించి ఉన్నాయి. ఫలితంగా వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజలు ఉద్యోగ, వ్యాపార రీత్యా వచ్చి స్థరపడ్డారు. భవన నిర్మాణ రంగం రోజురోజుకు అభివృద్ధి  చెందుతుండటంతో వలస కార్మికులకు ఉపాధి లభిస్తుంది.

Published : 15 Aug 2022 05:26 IST

మంచిర్యాల పట్టణం, న్యూస్‌టుడే

కార్మిక ప్రాంతాలకు ప్రధాన కేంద్రంగా మంచిర్యాల జిల్లా అభివృద్ధి చెందుతోంది. ఇక్కడ సింగరేణి బొగ్గు గనులు, విద్యుత్తు ఉత్పత్తి కేంద్రం, చిన్నతరహా పరిశ్రమలు విస్తరించి ఉన్నాయి. ఫలితంగా వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజలు ఉద్యోగ, వ్యాపార రీత్యా వచ్చి స్థరపడ్డారు. భవన నిర్మాణ రంగం రోజురోజుకు అభివృద్ధి  చెందుతుండటంతో వలస కార్మికులకు ఉపాధి లభిస్తుంది. మరో పక్క గ్రామీణ ప్రాంతాల్లో ప్రధాన జీవనాధారంగా వ్యవసాయం మారింది. గతంలో ఉన్నత విద్య, వైద్య సేవలు కావాలంటే  గుంటూరు, హైదరాబాద్‌ లాంటి నగరాలకు వెళ్లేవేరు. ఆ రెండు రంగాలు ఇప్పుడు జిల్లాలోనే అభివృద్ధి చెందుతున్నాయి.స్వాతంత్య్ర వజ్రోత్సవ వేళ..జిల్లా ప్రజలు ప్రగతి ఫలాలు అనుభవిస్తున్నారు.


సింగరేణి సిరులలో..

జిల్లాలో 13 భూగర్భ గనులు, 5 ఉపరితల గనులు ఉన్నాయి. 17 వేల మంది కార్మికులు ప్రత్యక్షంగా, లక్ష మందికిపైగా పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. ఏడాదికి దాదాపు 15 మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేస్తున్నారు. ఏటా దాదాపు రూ.4000 కోట్ల ఆదాయం వస్తుందని సమాచారం. జైపూర్‌ మండలంలో సింగరేణి బొగ్గు ఆధారిత విద్యుత్తు ఉత్పత్తి కేంద్రం నిర్మించారు. 1200 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి చేయగా, జైపూర్‌, మందమర్రి రెండు ప్రాంతాల్లో 20 మెగావాట్ల సోలార్‌ ద్వారా విద్యుత్తు ఉత్పత్తి తయారు చేస్తున్నారు. జిల్లాలో బొగ్గు పరిశ్రమలే కాకుండా సిమెంట్‌, సిరామిక్స్‌ తదితర చిన్ని తరహా పరిశ్రమలు విస్తరించి ఉన్నాయి. వీటి ద్వారా వేలాది మంది ఉపాధి పొందుతున్నారు.


జలమొచ్చి.. భూమికి బలమిచ్చి

జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో రైతులు వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. 3.60 లక్షల ఎకరాలు సాగు చేస్తూ 1.50 లక్షల మంది రైతులు వివిధ రకాల పంటలు పండిస్తున్నారు. 1.90 లక్షల ఎకరాల్లో పత్తి, 1.60 లక్షల ఎకరాల్లో వరి, మరో 10 వేల ఎకరాల్లో వివిధ రకాల పంటలు పండిస్తున్నారు. భూములకు కడెం, ర్యాలీవాగు, నీల్వాయి, గొల్లవాగు జలాశయాలు, ఎల్లంపల్లి జలాశయం బ్యాక్‌ వాటర్‌ గూడెం ఎత్తిపోతల ద్వారా సాగునీరు అందిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 850 చెరువుల ద్వారా కూడా సాగునీరు అందుతుంది. వ్యవసాయ రంగంలో జిల్లా ప్రజలే కాకుండా ఆంధ్రప్రదేశ్‌ నుంచి వచ్చిన కూలీలు ఇక్కడ వ్యవసాయం చేస్తూ ఉపాధి పొందుతున్నారు.


అద్దాల మేడలు వెలుస్తూ..

జిల్లాలో వివిధ పరిశ్రమలు విస్తరించి ఉండటంతో మంచిర్యాల, నస్పూరు, క్యాతన్‌పల్లి పట్టణాల్లో భవన నిర్మాణ రంగం అభివృద్ది చెందుతోంది. ఇక్కడికి ఉద్యోగ, ఉపాధి కోసం వచ్చిన అనేక మంది స్థిరపడి పోయారు. ఇక్కడే భూములు కొనుగోలు చేసి ఇళ్లు నిర్మించుంటున్నారు. ఒక మంచిర్యాలలోనే ఏటా 450 నుంచి 500 ఇళ్లు నిర్మిస్తున్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు ఇక్కడి వచ్చి ఉపాధి పొందుతున్నారు.


అక్షరం.. అల్లుకుంది

పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో విద్యారంగం అభివృద్ధి చెందుతోంది. గతంలో విద్య, నైపుణ్య శిక్షణ కోర్సుల కోసం ఇక్కడి విద్యార్థులు ఇతర జిల్లాలకు వెళ్లేవారు. ఇప్పుడు జిల్లాలోనే అందులో పాలిటెక్నిక్‌ శిక్షణ కేంద్రాలు, ఐటీఐ కళాశాలలు అందుబాటులో ఉన్నాయి. జిల్లాలో 2,855 పాఠశాల్లో 1.03 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. అయిదు ఆదర్శ పాఠశాల్లో 3,642 మంది, 18 కస్తూర్బాగాంధీ పాఠశాల్లో 4,057 మంది విద్యార్థులు విద్య అభ్యసిస్తున్నారు. ఇక్కడ ఇంటర్‌, డిగ్రీ, పీజీ కళాశాలలు అందుబాటులో ఉన్నాయి.


‘నాడి.. ఆడుతోంది

జిల్లా ప్రజలు ఇంతకుముందు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌ నగర ప్రాంతాలకు వెళ్లేవారు. ఇప్పుడు ఇక్కడే మెరుగైన వైద్యం అందుతోంది. మంచిర్యాలలో 200 పడకల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ఉండగా, 130 పడకలతో మాతాశిశు సంరక్షణ ఆసుపత్రి నిర్మించారు.  జిల్లా ప్రజలకే కాకుండా కుమురంభీం, నిర్మల్‌, పెద్దపల్లి జిల్లాలు, ప్రాణహితనది సరిహద్దులోని మహారాష్ట్ర ప్రజలు ఇక్కడికి వచ్చిన వైద్య సేవలు పొందుతున్నారు. మంచిర్యాల జిల్లాకు మెడికల్‌ కళాశాల మంజూరైంది. తరగతి గదుల నిర్వహణ కోసం తాత్కాలిక భవనం కూడా సిద్ధం చేశారు. కళాశాల నిర్వహణకు అనుమతులు రాగానే ఈ ఏడాది తరగతులు నిర్వహించే అవకాశం ఉంది. చెన్నూరు, బెల్లంపల్లి పట్టణాల్లో సామాజిక  ఆసుపత్రులు నిర్మాణ దశలో ఉండగా, లక్షెట్టిపేటలో పనులు ప్రారంభించాల్సి ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని