logo

కబళిస్తున్న కాలుష్యం!

ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం గాలిలో సూక్ష్మ ధూళికణాల పరిమితి 40 ఉండాలి. కానీ ఉమ్మడి జిల్లాలో అంతకంటే ఎక్కువే నమోదవుతోంది.

Published : 02 Dec 2022 03:05 IST

ఉమ్మడి జిల్లాలోనూ జనం ఉక్కిరిబిక్కిరి

న్యూస్‌టుడే, ఆదిలాబాద్‌ వ్యవసాయం

ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం గాలిలో సూక్ష్మ ధూళికణాల పరిమితి 40 ఉండాలి. కానీ ఉమ్మడి జిల్లాలో అంతకంటే ఎక్కువే నమోదవుతోంది. ఒకప్పుడు పెద్ద పట్టణాలకే పరిమితమైన వాయు కాలుష్యం ఇప్పుడు జిల్లాలకు పాకుతోంది. వాహనాల సంఖ్య పెరగడం, పరిశ్రమలు ఏర్పడటంతో వేగంగా విస్తరిస్తోంది. గాలిలో సూక్ష్మధూళి కణాలు (పీఎం10) నిర్దేశిత పరిమితి కంటే ఎక్కువగా నమోదవుతున్నాయి. కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ) గణాంకాల ప్రకారం గతంతో పోలిస్తే.. జిల్లాలో పది శాతం పెరుగుదల ఉంది.  

పరిశ్రమలు, వాహనాల నుంచి వెలువడుతున్న ప్రమాదకర వాయువులు, ప్లాస్టిక్‌ వినియోగం పర్యావరణంపై ప్రభావం చూపుతాయి. గాలిలో సూక్ష్మ ధూళి కణాలు, ఓజోన్‌, నైట్రోజన్‌ ఆక్సైడ్‌, సల్ఫర్‌ డయాక్సైడ్‌ వంటి కాలుష్య ఉద్గారాలు గాలిని కలుషితం చేస్తున్నాయి. వీటిలో ప్రధానమైన పీఎం 10 ఉద్గారాలు జిల్లాలో పెరుగుతున్నాయి. పరిశ్రమలు అందులోనూ మైనింగ్‌ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో కాలుష్యం ఎక్కువగా ఉండే అవకాశం ఉండటంతో కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు మందమర్రిలో కాలుష్య నమోదు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ సీజన్‌లో నెల వారీ వివరాలను పరిశీలిస్తే. అక్టోబరులో పీఎం 10 ఉద్గారాలు సగటు 65గా నమోదు అయింది.

ఉమ్మడి జిల్లాలో ఇలా..

* ఉమ్మడి జిల్లాలో 869 పరిశ్రమలు ఉన్నాయి. ఇందులో పత్తి ఆధారిత పరిశ్రమలతో పాటు సిమెంట్‌, మాంగనీస్‌ తదితర పరిశ్రమలు ఉన్నాయి. వీటితో పాటు 6,092 కుటీర పరిశ్రమలు ఉన్నాయి. వీటి నుంచి పెద్ద ప్రమాదం లేకపోయినా.. భారీ పరిశ్రమల నుంచి విడుదలయ్యే ప్రతి ఘనపు మీటరుకు 500 కార్బన్‌ రేణువులకంటే మించకూడదు. కానీ జిల్లాలో ఉన్న పరిశ్రమలు విడుదల చేస్తున్న విషవాయివులు అంతకంటే ఎక్కువ మోతాదులోనే గాలిలో కలుస్తున్నాయని పర్యావరణవేత్తలు అంటున్నారు. .

* జిల్లాలో భారీ వాహనాలు 46,232 ఉండగా, ఇతర వాహనాలు 1.46 లక్షల వాహనాలు నిత్యం 1.50 లక్షల లీటర్లకు పైగా పెట్రోల్‌, డీజిల్‌ తదితర ఇంధనాలు వినియోగిస్తున్నారు. ఒక లీటర్‌, లేదా డీజిల్‌ ఉపయోగిస్తే 2.30 కిలోల విషవాయువులు ఏర్పడుతాయి. ఈ లెక్కన జిల్లాలో వినియోగిస్తున్న వాహనాలు లక్షల కిలోల విషవాయువును విడుదల చేస్తున్నాయి.

* పరిశ్రమలు, రైతులు పంట పొలాలకు చల్లే ఎరువులు, పురుగు మందులు వర్షం నీరు ద్వారా వాగులు, చెరువుల్లోకి చేరి కలుషితమవుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో ఎరువుల వినియోగం సాధారణం కంటే 60 శాతం అధికంగా ఉండగా, పురుగు మందుల వినియోగం 38 శాతం ఎక్కువగా ఉన్నట్లు వ్యవసాయ శాఖ లెక్కలు చెబుతున్నాయి.. మట్టిలో ఉదజని విలువ 8.4 కంటే ఎక్కువగా ఉంటే అలాంటి మట్టి పనికి రాదు.

జిల్లాలో 540 చెరువుల్లో నుంచి మట్టి నమూనాలు సేకరించి పరీక్షలు చేస్తే 90 శాతం చెరువుల్లోని మట్టిలో రసాయనాలు మిళితమై ఉన్నట్లు గుర్తించారు. ఉమ్మడి జిల్లాలో నీటి కాలుష్యాన్ని గుర్తించేందుకు బాసర, మంచిర్యాలలోని పుష్కర్‌గాట్‌, బోథ్‌ మండలం పొచ్చెర వాటర్‌ఫాల్‌, ర్యాలీవాగు, మంచిర్యాల సమీపంలో కేంద్రాలు ఏర్పాటు చేశారు..


ఈ రోజు ఎందుకంటే..

మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌ గ్యాస్‌ దుర్ఘటనలో మృతి చెందిన వ్యక్తుల జ్ఞాపకార్థం డిసెంబరు 2వ తేదిన జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.
కాలుష్య నియంత్రణ దినోత్సవం నిర్వహించి అవగాహన కలిగించాలని నిర్ణయించారు.


2020లో నిర్వహించిన సర్వే మేరకు ప్రపంచంలో అత్యంత కాలుష్య మొదటి 14 నగరాల్లో 13 భారతదేశంలోనే ఉన్నాయి. కాలుష్యం కారణంగా 12.5 శాతం మరణాలు సంభవిస్తున్నాయి. గాలిలోని హానికరమైన వాయువుల బారిన పడి ప్రతి పది వేల మంది పిల్లలల్లో సగటున 8.5 శాతం అయిదేళ్లు నిండక ముందే చనిపోతున్నారు. 86 శాతం నదులు కలుషితంగా ఉన్నట్లు గుర్తించారు. భారత దేశంలో 351 నదులు కలుషితంగా ఉన్నాయి.


ప్లాస్టిక్‌ పెనుభూతమై..

జిల్లాలో ఏటా ప్లాస్టిక్‌ వినియోగం పెరుగుతోంది. ఏడాదికి వ్యక్తి తన సగటు జీవితంలో 384 ప్లాస్టిక్‌ సంచులు, ఎనిమిది ప్లాస్టిక్‌ సీసాలను ఉపయోగిస్తాడు. కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) నిబంధనల మేరకు 0-50 శాతం లోపు ఉంటే మంచిగా ఉన్నట్లుగా పరిగణిస్తారు.. 51-100 లోపు ఉంటే ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నట్లుగా భావించాలి. ఉమ్మడి జిల్లాల్లో రహదారులు అధ్వానంగా ఉండటంతో దుమ్మూధూళి రేగి కాలుష్యానికి దారి తీస్తోంది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో స్టోన్‌ క్రషర్లున్నాయి. గుట్టలను తవ్వి మొరం తరలిస్తున్నారు. మంచిర్యాలలో బొగ్గుతో పాటు మాంగనీసు, రైస్‌మిల్లులు ఎక్కువగా ఉండగా, ఆదిలాబాద్‌లో పత్తి, సోయా తదితర మిల్లులు ఉన్నాయి. జిల్లాల వారీగా కాలుష్య నమోదు కేంద్రాలు లేక తీవ్రత తెలియని పరిస్థితి ఉంది.  


జాగ్రత్తలు తీసుకోవాల్సిందే..

లక్ష్మణ ప్రసాద్‌, కాలుష్య నియంత్రణ మండలి రీజినల్‌ అధికారి

ఉమ్మడి జిల్లాలో వాయుకాలుష్య ప్రభావం పెద్దగా లేదు. మైనింగ్‌కు సంబంధించిన ప్రాంతాల్లో ఏర్పాటయ్యే పరిశ్రమల్లో సూక్ష్మధూళి కాలుష్యం ఎక్కువగా ఉంటుంది. కాలుష్య ప్రభావం ఉండే ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు కాలుష్య నమోదు కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతం నమోదైన వివరాల మేరకు కాలుష్య ప్రభావం ఎక్కువగా లేకపోయినా.. ఇప్పటి నుంచే జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
మందమర్రిలోని కాలుష్య పరిశీలన కేంద్రం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని