logo

పట్టణ వనాలపై పట్టింపు శూన్యం

జిల్లాలోని నిర్మల్‌, భైంసా, ఖానాపూర్‌ పట్టణాల్లోని 80 వార్డుల్లో 52 పట్టణ ప్రకృతి వనాలు ఏర్పాటు చేశారు. హరితహారంలో భాగంగా రూ.లక్షల నిధులు వ్యయం చేస్తున్నా నిర్వహణ లేకపోవడంతో అందులోని నాటిన మొక్కలన్నీ ఎండిపోతున్నాయి.

Updated : 29 Mar 2024 05:30 IST

నిర్మల్‌-భైంసా, న్యూస్‌టుడే: జిల్లాలోని నిర్మల్‌, భైంసా, ఖానాపూర్‌ పట్టణాల్లోని 80 వార్డుల్లో 52 పట్టణ ప్రకృతి వనాలు ఏర్పాటు చేశారు. హరితహారంలో భాగంగా రూ.లక్షల నిధులు వ్యయం చేస్తున్నా నిర్వహణ లేకపోవడంతో అందులోని నాటిన మొక్కలన్నీ ఎండిపోతున్నాయి. చాలా చోట్ల మొక్కలు కనిపించకుండా పోయాయి. వాటిల్లో ఏర్పాటుచేసిన ఆట వస్తువులు పనికిరాకుండా తప్పుపడుతున్నాయి. ఈ మూడు పట్టణాల్లో ఏర్పాటుచేసిన పట్టణ ప్రకృతి వనాలపై గురువారం ‘న్యూస్‌టుడే’ బృందం పరిశీలన చేపట్టింది. ఎక్కడా కూడా ఈ వనాల్లో పచ్చదనం కనిపించడం లేదు. కొన్ని చోట్ల మోడు వారిన మొక్కలు, మరికొన్ని ప్రాంతాల్లో పిచ్చిమొక్కలు కనిపిస్తుండగా ఇంకొన్ని మొక్కలు లేక మైదానాలు తలపిస్తున్నాయి.

కరవైన నిర్వహణ

పట్టణాల్లోని ప్రజలకు ఆహ్లాదం పంచడానికి ప్రతి వార్డుల్లో ప్రకృతి వనం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వాటిల్లో మొక్కలు నాటడంతోపాటు పచ్చదనం ఉట్టిపడేలా గడ్డి పెంచారు. రక్షణగా చుట్టూ ఫెన్సింగ్‌ ఏర్పాటు చేశారు. చిన్నారులు ఆడుకునేందుకు వీలుగా ఆట వస్తువులు సమకూర్చారు. కొన్నాళ్లు పట్టణ వాసులకు ఆహ్లాదం పంచిన ఈ ప్రకృతి వనాలపై మున్సిపల్‌ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో నిర్వహణను మరిచారు. ఎక్కడికక్కడ మొక్కలు ఎండిపోయాయి. అందులో ఏర్పాటుచేసిన ఆట వస్తువులన్నీ దెబ్బతిని పనికిరాకుండా పోతున్నాయి. ఇప్పటికైనా వీటిని వినియోగంలోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు.


ఎండుతున్న మొక్కలు

జిల్లా కేంద్రంలోని భాగ్యనగర్‌లో ఏర్పాటుచేసిన పట్టణ ప్రకృతి వనం ఆరంభంలో పచ్చదనంతో కనువిందు చేసింది. రూ. 2.50 లక్షలతో అలంకరణ, పూల మొక్కలు, నడవడానికి పచ్చిక ఏర్పాటు చేయడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. అక్కడ బోరు వేసి నిత్యం ఈ మొక్కలకు నీరందించడంతో ఆహ్లాదకర వాతావరణం కనిపించింది. ఆడుకునేందుకు ఆట వస్తువులు ఏర్పాటు చేయడంతో సాయంత్రం సమయంలో చిన్నారులతో సందడిగా కనిపించేది. ఇప్పుడు మున్సిపల్‌ అధికారుల పర్యవేక్షణ కరవైంది. బోరు మోటారు పనిచేయడం లేదు. మొక్కలకు నీరందించక ఎండిపోతున్నాయి. ఆట వస్తువులు పనికిరాకుండా పోయాయి. ఇలా పట్టణంలో మిగతా 19 ప్రాంతాల్లోనూ ఏర్పాటుచేసిన పట్టణ వనాల పరిస్థితి ఇలాగే ఉంది.  


ఇక్కడ మాయం

మైదానాన్ని తలపిస్తున్న పట్టణ ప్రకృతి వనం

ఖానాపూర్‌ పట్టణం శ్రీరానగర్‌ కాలనీ సమీపంలో గోదావరి చెంత ఎల్లమ్మ ఆలయ వెనుక ప్రాంతంలో ఏర్పాటుచేసిన పట్టణ ప్రకృతి వనంలో మొక్కలన్నీ మాయమయ్యాయి. ఆరంభంలో మొక్కలు నాటి రక్షణ కోసం చుట్టూ రక్షణ కంచె ఏర్పాటు చేశారు. ఆ తర్వాత వాటి సంరక్షణ చర్యలు చేపట్టకపోవడంతో అక్కడున్న మొక్కలన్నీ ఎండి కనిపించకుండా పోయాయి. ఫెన్సింగ్‌ కూడా దెబ్బతింటోంది. పట్టణంలోని గాంధీనగర్‌ ప్రాంతంలో ఏర్పాటుచేసిన పట్టణ ప్రకృతి వనం కొంత మేరకు బాగుంది. ఇక్కడ నాటిన మొక్కలను కాపాడటంతో చెట్లుగా మారి పచ్చదనం కనిపిస్తోంది.


ఇదీ ప్రకృతి వనమేనట

భైంసా పట్టణంలోని 14వ వార్డులో జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలను ఆనుకుని పట్టణ ప్రకృతి వనం ఏర్పాటు చేశారు. 10శ్రీ20 అడుగుల స్థలంలో వంద మొక్కలు నాటినా ఒక్కటీ కనిపించడం లేదు. ఇందులో పిచ్చిమొక్కలు పెరిగాయి. 11వ వార్డుకు సంబంధించి ప్రకృతి వనంలో నాలుగు చెట్లు పెరిగాయి. కేవలం రెండు సిమెంటు బెంచీలు వేసి వదిలేశారు. ఇక్కడ కూడా నాటిన మొక్కలు కనిపించడం లేదు. నిర్వహణ లేకపోవడంతో అంతటా పిచ్చిగడ్డి పెరిగింది. రూ. లక్షల వ్యయం చేసి ఏర్పాటుచేసిన ఈ పట్టణ ప్రకృతి వనంపై మున్సిపల్‌ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఉపయోగంలో లేకుండా పోయింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని